20 లక్షల అప్పు కోసం కన్నబిడ్డను అమ్మేసిన తండ్రి, సవతి తల్లి.. 45 ఏళ్ల బీఆర్ఎస్ నేతతో బలవంతంగా పెండ్లి

20 లక్షల అప్పు కోసం కన్నబిడ్డను అమ్మేసిన తండ్రి, సవతి తల్లి.. 45 ఏళ్ల బీఆర్ఎస్  నేతతో బలవంతంగా పెండ్లి
  • జనగామ జిల్లా బచ్చన్నపేటలో దారుణం
  • మహిళా కమిషన్​ను ఆశ్రయించిన యువతి
  • న్యాయం చేయాలని వేడుకోలు


ఎల్బీ నగర్, వెలుగు: అప్పు తీర్చేందుకు కన్యాశుల్కాన్ని తలపించే విధంగా ఓ తండ్రి, సవతి తల్లి 18 ఏండ్ల బిడ్డను 45 ఏండ్ల వ్యక్తికి ఇచ్చి పెండ్లి చేశారు. ఈ అమానుష ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేటలో చోటుచేసుకుంది. బాధిత యువతి తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన రాకేశ్ గౌడ్  కొన్నేళ్ల కింద ఓ ఎస్టీ మహిళను పెండ్లి చేసుకున్నాడు. వారికి ప్రస్తుతం 18 ఏండ్ల కూతురు ఉంది. కొంతకాలం క్రితమే ఆ ఎస్టీ మహిళను వదిలించుకున్న రాకేశ్.. తన సామాజికవర్గానికి చెందిన మరో మహిళను పెండ్లి చేసుకున్నాడు. అయితే.. రాకేశ్, సవతి తల్లి కలిసి తమకు ఉన్న రూ.20 లక్షల అప్పు తీర్చేందుకు స్థానికంగా ఉన్న ఆవుల ప్రశాంత్ రెడ్డి అనే ఓ బీఆర్ఎస్  లీడర్​కు తమ బిడ్డను ఇచ్చి బలవంతంగా పెండ్లి చేశారు. తనకు రెండు లక్షల అప్పు కావాలని ప్రశాంత్  రెడ్డి వద్దకు రాకేశ్ గౌడ్ వెళ్లగా.. ‘‘నీకు ఉన్న అప్పు అంతా నేను తీరుస్తా.  నాకు నీ బిడ్డని ఇచ్చి పెండ్లి చేయాలి’’ అని చెప్పడంతో రాకేశ్  గౌడ్  అందుకు ఒప్పుకున్నాడు. రాకేశ్ గౌడ్, సవతి తల్లి ఇద్దరు కలిసి.. ఆ పెళ్లి చేసుకోకపోతే విషం ఇచ్చి చంపేస్తామని యువతిని బెదిరించారు. 

ఈనెల 8న స్థానికంగా ఉన్న ఓ గుడిలో ప్రశాంత్ రెడ్డికి, ఆ యువతికి బలవంతంగా పెండ్లి చేసి ప్రశాంత్ రెడ్డి ఇంటికి పంపించారు. పెండ్లి ఇష్టం లేకపోవడంతో తన స్నేహితుల సహాయంతో తప్పించుకున్న బాధిత  యువతి..శనివారం హైదరాబాద్​లోని మహిళా కమిషన్​ను ఆశ్రయించింది. ఆదివారం రంగారెడ్డి జిల్లా కోర్టు వద్దకు చేరుకొని తనకు జరిగిన అన్యాయాన్ని మీడియాకు వివరించింది. తనకు మహిళా కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరింది. ఇప్పటికే రాష్ట్ర డీజీపీ, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని ఆ యువతి తరపు న్యాయవాది గ్యార సతీష్  తెలిపారు. ప్రశాంత్ రెడ్డి నుంచి తప్పించుకొనేందుకు సహకరించిన ఆ యువతి స్నేహితులపై స్థానిక పోలీస్ స్టేషన్‌‌లో కేసు నమోదు చేయించారని ఆయన చెప్పారు.