అమ్మ క్యాంటీన్లపై సీఎం విజయ్ కీలక నిర్ణయం

 అమ్మ క్యాంటీన్లపై సీఎం విజయ్ కీలక నిర్ణయం

చెన్నై: తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన టీవీకే చీఫ్ విజయ్ పాలనలో దూసుకుపోతున్నారు. ఇటీవల విద్యాంస్థలు, ప్రార్థనా స్థలాలకు సమీపంలోని వైన్ షాపులను క్లోజ్ చేయించిన విజయ్ తాజాగా అమ్మ క్యాంటిన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏఐఏడీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లను రాష్ట్రవ్యాప్తంగా పునరుద్ధరించి, ఆధునీకరించాలని ఆదేశించారు. 

అమ్మ క్యాంటీన్లలో అందించే ఆహారం నాణ్యత, రుచి సంతృప్తికరంగా లేవన్న ఫిర్యాదులు రావడంతో అమ్మ క్యాంటిన్ల నిర్వహణపై సోమవారం (మే 18) చెన్నైలో ఉన్నతాధికారులతో సీఎం విజయ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అమ్మ క్యాంటీన్లను పునరుద్ధరించాలని అధికారులను సీఎం విజయ్ ఆదేశించారు. అన్న క్యాంటిన్లలో సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని.. అలాగే మరిన్ని వంట పాత్రలు/పరికరాలను సమకూర్చి ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. 

►ALSO READ | ఇండియా ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఫొటో రిలీజ్.. లుక్ అదిరిపోయింది..!

దివంగత నాయకురాలు జయలలిత నేతృత్వంలోని ఏఐఏడీఎంకే ప్రభుత్వం 2011-16లో తమిళనాడులో అమ్మ క్యాంటిన్లను ప్రారంభించారు. అన్నాడీఎంకే కార్యకర్తలు, జయలలిత మద్దతుదారుల ఆమెను అమ్మ అని అప్యాయంగా పిలుస్తుండేవారు. ఈ నేపథ్యంలోనే జయలలిత పుట్టిన రోజు (ఫిబ్రవరి 24) సందర్భంగా 2013, ఫిబ్రవరి 24న తమిళనాడులో అమ్మ క్యాంటీన్లను అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రారంభించింది. మొదట రాష్ట్ర రాజధాని చెన్నైలో ప్రారంభమైన అమ్మ క్యాంటిన్లు ఆ తర్వాత వివిధ పట్టణాలు, నగరాలకు విస్తరించాయి.

 పేద ప్రజలకు రాయితీపై ఆహారాన్ని అందించడం అమ్మ క్యాంటిన్ల ప్రధాన ఉద్దేశం. అన్నాడీఎంకే తర్వాత అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం కూడా అమ్మ క్యాంటిన్లను కొనసాగించింది. ఆ పథకం పేరును కూడా మార్చలేదు. ఇప్పుడు విజయ్ కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అమ్మ క్యాంటిన్ల పేరు మార్పు కానీ, రద్దు చేయడం కానీ చేయకుండా ప్రోత్సహించడం శుభపరిణామం.