ఇండియా ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఫొటో రిలీజ్.. లుక్ అదిరిపోయింది..!

ఇండియా ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఫొటో రిలీజ్.. లుక్ అదిరిపోయింది..!

న్యూఢిల్లీ: భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ఫొటోను రైల్వే శాఖ విడుదల చేసింది. ఈ మేరకు బుల్లెట్ ట్రైన్ తొలి చిత్రాన్ని సోమవారం (మే 18) న్యూఢిల్లీలోని రైల్ భవన్‌లో ప్రదర్శించారు. వైట్ అండ్ ఆరెంజ్ కలర్‎లో బుల్లెట్ ట్రైన్ ఫొటో ఆకట్టుకుంటుంది. 

జపాన్ నుంచి సాంకేతిక, ఆర్థిక సహాయంతో అభివృద్ధి చెందుతున్న ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ముంబై, అహ్మదాబాద్‌లను కలుపుతుంది. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించబడిన ఈ హైస్పీడ్ రైలు ముంబై, అహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయాన్ని కేవలం రెండు గంటలకు తగ్గిస్తుంది. ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్ మధ్య రైలు ప్రయాణానికి 7 నుంచి 8 గంటలు పడుతోంది. 

మొత్తం 12 స్టేషన్లతో కూడిన ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం లక్షా 8 వేల కోట్లు.
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి పనులు 2028కి పూర్తవుతాయి. మొత్తం 508 కిలోమీటర్ల పొడవున ఈ ట్రాక్‌‌ నిర్మిస్తున్నారు. దీనిపై ట్రైన్‌‌ గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. రెండు గంటల్లో ముంబై నుంచి అహ్మదాబాద్‌‌కు చేరుకుంటుంది. ముంబై-అహ్మదాబాద్ మధ్య మొత్తం 508.17 కిలో మీటర్ల రైలు మార్గంలో దాదాపు 21 కిలోమీటర్లు భూగర్భంలోనే ఉంటుంది.

►ALSO READ | పూజారులు, ఇమామ్‎లకు ఆర్థిక సహయం బంద్: బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

మొత్తం 12 స్టేషన్లు కాగా.. ఇందులో 9 స్టేషన్లు గుజరాత్లో, మూడు స్టేషన్లు మహారాష్ట్రలో నిర్మించనున్నారు. బుల్లెట్ ట్రైన్ రాకపోకలు సాగించే ముంబై స్టేషన్ పూర్తిగా అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ‘ది నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ బాధ్యతలను భుజానికెత్తుకున్న సంగతి తెలిసిందే. 

257.4 కిలోమీటర్లు FSLM (Full Span Launching Method) విధానంలో, 14 రివర్ బ్రిడ్జిలు SBS (Span by Span) పద్ధతిలో నిర్మిస్తున్నట్లు NHSRCL తెలిపింది. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం 401 కిలోమీటర్ల ఫౌండేషన్ వర్క్ జరిగింది. 2027, ఆగస్ట్ 15 నాటికి సూరత్ - బిలిమోరా/వాపి మధ్య మొదటి విడత బుల్లెట్ రైలు సేవలు  ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. 2028 చివరి నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి కానుంది.