కోల్‌కతా: సువేందు అధికారి నేతృత్వంలోని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మత ఆధారిత సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం (మే 18) సీఎం సువేందు అధికారి అధ్యక్షతన బెంగాల్ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మత ఆధారిత సంక్షేమ పథకాలను నిలిపివేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. 2026, జూన్ నుంచి ఈ పథకాలు నిలిపివేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సంక్షేమ కార్యక్రమాలకు మతం రంగు పులమకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని గత టీఎంసీ సర్కార్ ఇమామ్‌లు, ముఅజ్జిన్‌లు, ఆలయ పూజారులకు నెలవారీ గౌరవ వేతనాన్ని అందించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఉన్న ఇమామ్‌లకు ప్రభుత్వం నెలవారీ గౌరవ వేతనాన్ని అందించింది. ఈ పథకం కింద ఆర్థికంగా బలహీన వర్గాల నుంచి వచ్చిన ఇమామ్‌లు నెలకు రూ.2,500 ఆర్థిక సహయం అందజేసేవారు.
అలాగే, మసీదులలో భక్తులను ప్రార్థనకు పిలిచే ముఅజ్జిన్‌లకు కూడా ఇదే విధమైన ఆర్థిక సహాయ అందించారు. ఈ రెండు పథకాలకు నిధులనూ మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి ఇచ్చేవారు. పంపిణీ చేశారు. ఇమామ్‌ల మాదిరిగానే హిందూ పూజారులు లేదా పురోహితుల కూడా ప్రభుత్వం ఆర్థిక సహయం అందించింది. ఈ పథకం కింద ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన పురోహితులు నెలకు రూ.2 వేల గౌరవ వేతనాన్ని అందుకున్నారు.
►ALSO READ | నీట్ పేపర్ లీక్ కేసులో M సార్ అరెస్ట్.. పరీక్షకు 10 రోజుల ముందే వాట్సప్‌లో క్వశ్చన్ పేపర్..?
ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఘోర పరాజయం పాలైంది. దీంతో బెంగాల్ తొలి బీజేపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే గత టీఎంసీ సర్కార్ అమలు చేసిన మత ఆధారిత సంక్షేమ పథకాలను సువేందు అధికారి రద్దు చేశారు.
