CSK vs SRH: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసులో అత్యంత కీలకమైన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పోరాడే స్కోరు సాధించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరుగుతున్న ఈ హై-వోల్టేజ్ పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలవాలంటే 181 పరుగులు చేయాల్సి ఉంది.
సంజూ మెరుపులు.. కమిన్స్ దెబ్బ!
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఎల్లో ఆర్మీకి ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. ఓపెనర్‌గా వచ్చిన సంజూ శాంసన్ క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ఆరెంజ్ ఆర్మీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కానీ చెన్నై స్కోరు 31 పరుగుల దగ్గర ఉన్నప్పుడు సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్కెచ్ వేశాడు. కమిన్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన సంజూ.. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. సంజూ శాంసన్ 13 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 27 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
మిడిల్ ఆర్డర్ తడబాటు:
సంజూ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఉర్విల్ పటేల్ కొన్ని ఆకర్షణీయమైన బౌండరీలు కొట్టి టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినా.. 13 రన్స్ మాత్రమే చేసి సాకిబ్ హుస్సేన్ వేసిన సూపర్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరోవైపు వన్ డౌన్‌లో వచ్చిన కార్తీక్ శర్మ అదిరిపోయే హిట్టింగ్‌తో 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాది మంచి ఊపులో కనిపించాడు. కానీ, ప్రమాదకరంగా మారుతున్న కార్తీక్(32)ను ప్యాట్ కమిన్స్ అవుట్ చేసి చెన్నైని దెబ్బకొట్టాడు. ఇక మరో ఎండ్‌లో ఉన్న కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (15) ఈ మ్యాచ్‌లోనూ ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు. కమిన్స్ బౌలింగ్‌లోనే ఎషాన్ మలింగకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.
బ్రెవిస్ షో.. చివర్లో దూబే మెరుపులు:
వరుసగా వికెట్లు పడుతున్నా.. మైదానంలోకి వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ సన్‌రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. గ్రౌండ్ నలుమూలలా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. అయితే హాఫ్ సెంచరీకి చేరువవుతున్న తరుణంలో ఎషాన్ మలింగా వేసిన అద్భుతమైన బంతికి బ్రెవిస్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబే చివర్లో కొన్ని మెరుపులు మెరిపించినప్పటికీ భారీ స్కోరు చేయలేకపోయాడు. సాకిబ్ హుస్సేన్ బౌలింగ్‌లో దూబే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆఖరి ఓవర్లో ప్రశాంత్ వీర్ ఒక ఫోర్ కొట్టడంతో చెన్నై ఎట్టకేలకు 180 పరుగుల మార్క్‌ను అందుకుంది.
సన్‌రైజర్స్ బౌలింగ్ పర్ఫామెన్స్:
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మరోసారి లీడర్ లా ముందుండి నడిపించాడు. కీలకమైన 3 వికెట్లు పడగొట్టి చెన్నైని భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాడు. యంగ్ బౌలర్ సాకిబ్ హుస్సేన్ 2 వికెట్లు తీసుకోగా, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగా చెరో వికెట్ ని తమ ఖాతాలో వేసుకున్నారు.
