రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల విక్రయం.. తొర్రూర్లో చదరపు గజం రూ.45 వేల 500.. బహదూర్ పల్లిలో రూ. 40 వేల 500

రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల విక్రయం.. తొర్రూర్లో చదరపు గజం రూ.45 వేల 500.. బహదూర్ పల్లిలో రూ. 40 వేల 500

హైదరాబాద్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ ప్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఎటువంటి వివాదాలు లేని, అన్ని వసతులతో అభివృద్ధి చెంది మంచి డిమాండ్తో ఫ్యూచర్ సిటీకి, ఔటర్ రింగ్ రోడ్కు సమీపంలో రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలలోని  తొర్రూర్ (66 ప్లాట్లు), కుర్మల్ గుడ (11), బహదూర్ పల్లి (8) ప్రాంతాల్లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్కు చెందిన 85 ఓపెన్ ప్లాట్ల విక్రయానికి  సోమవారం నాడు బహిరంగ వేలం నిర్వహించారు. 

పెద్ద అంబర్ పేటలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బహిరంగ వేలంలో పాల్గొన్న బిడ్డర్లు  చదరపు గజానికి నిర్దేశించిన దానికంటే అధిక మొత్తంతో ఈ ప్లాట్లను కొనుగోలు చేయడం విశేషం. ఈ ప్లాట్ల విక్రయం ద్వారా సుమారు రూ.83  కోట్ల మేర ఆదాయం వచ్చిందని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి గౌతం తెలిపారు.

తొర్రూర్లో చదరపు గజం రూ.45 వేల 500
* తొర్రూల్ లే అవుట్లో ప్లాట్ను కొనుగోలు చేయడానికి బిడ్డర్లు  పోటీ పడుతూ గరిష్టంగా చదరపు గజం స్థలాన్ని రూ.45,500 (నలభైఐదు వేల అయిదు వందలు)కు వేలం పాటలో కొనుగోలు చేశారని వి.పి.గౌతం తెలిపారు. ఓఆర్ఆర్, ఆదిభట్ల ఐటీ కారిడార్కు సమీపంలో ఉన్న తొర్రూర్లో 200, -700 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 66 ప్లాట్లకు (plots) చదరపు గజానికి కనీస ధర 25 వేల రూపాయలుగా నిర్ణయించారు.

సగటున రూ. 32 వేల 500 (ముప్పయి రెండు వేల అయిదు వందలు) ధర పలికింది. తమకు నచ్చిన భూముల కోసం పోటీ పడుతూ బిడ్డర్లు ఒక దశలో ప్లాట్ను దక్కించుకోడానికి  దాదాపు ఇరవైసార్లు రేట్లు పెంచారంటే ఇక్కడి భూములకున్న డిమాండ్ అర్ధం చేసుకోవచ్చు.

►ALSO READ | TRS జెండా గద్దె మోడల్ ఆవిష్కరణ.. నెల రోజుల పాటు జెండా పండుగ

* అదే విధంగా ఎయిర్ పోర్టు, ఆర్సీఐకి దగ్గరలో ఉన్న కుర్మల్ గుడలో 200 నుంచి 400 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లకు చదరపు గజం కనీస ధర 20 వేల రూపాయలుగా నిర్ణయించగా, గరిష్టంగా  రూ.27,500 ధర పలికింది.

* ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకుని ఉన్న బహదూర్ పల్లి ప్రాంతంలో 200 నుంచి 1000 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లకు కూడా మంచి ధర పలికింది. ఇక్కడ చదరపు గజం కనీస ధర 27 వేల రూపాయలుగా నిర్ణయించగా, వేలం పాటలో గరిష్టంగా రూ.40,500 (నలభై వేలు ఐదు వందల) రూపాయల ధర పలికింది.

* వేలం పాటలో సగటున ఈ భూములకు గజం రూ.33,800కు కొనుగోలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తి పారదర్శకంగా నిర్వహించిన ఈ బహిరంగ వేలం విక్రయాల్లో పలు ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 150 మంది బిడ్డర్లు పాల్గొనడం గమనార్హం.