హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఒకే మోడల్లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా గద్దెలు నిర్మిస్తున్నామని పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. సోమవారం (మే 18) బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన స్టేట్ జనరల్ బాడీ సమావేశంలో జెండా గద్దెల మోడల్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మూడు ఫీట్ల ఎత్తు, రెండు ఫీట్ల వెడల్పుతో పార్టీ జెండా గద్దెలు నిర్మించాలని సూచించారు.
పార్టీ జెండా గద్దె బేస్ ఒక ఫీట్ ఎత్తులో ఉంటుందని పైభాగం మరో రెండు ఫీట్ల ఎత్తులో ఉంటుందని తెలిపారు. జెండా గద్దె బేస్‌కు గ్రీన్ కలర్.. పై భాగంలో ఉండే జెండా గద్దెకు ఎల్లో కలర్, దాని మధ్యలో తెలంగాణ మ్యాప్ బ్లూ కలర్లో ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ మ్యాప్ మధ్యలో ఇంగ్లీష్ అక్షరాల్లో టీఆర్ఎస్ అని రాయాలని సూచించారు.
జెండా గద్దె బేస్ గ్రీన్ కలర్ మధ్యలో తెలుగులో తెలంగాణ రక్షణ సేన అని రాయాలని చెప్పారు. పార్టీ జెండా కలర్ కోడ్స్ కూడా తాము ఇచ్చిన విధంగానే చూసుకోవాలని.. అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా జెండాలన్నీ ఏకరూపంలో ఉంటాయని పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీ నుంచి జూన్ 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
