- పదేండ్లుగా అసంపూర్తిగానే పనులు
- భారీ వరదలకు నిర్మాణంలోనే కూలుతున్న గడ్డర్లు
- వేసవిలో తాత్కాలిక రోడ్డుతో ప్రయాణం
- బ్రిడ్జి నిర్మాణానికి రూ.47 కోట్లు మంజూరు
- నిర్మాణం పై దృష్టి సారించాలని కోరుతున్న ప్రజలు
జయశంకర్ భూపాలపల్లి/ చిట్యాల, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల మధ్య పారుతున్న మానేరు వాగుపై వంతెన నిర్మాణం పదేండ్లుగా సా..గుతూనే ఉంది. వంతెన నిర్మాణం పూర్తైతే రెండు జిల్లాల మధ్య ప్రయాణ దూరం, సమయం గణనీయంగా తగ్గనున్నప్పటికీ, పనులు ఇప్పటికీ పిల్లర్ల దశను దాటకపోవడం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2016లో ప్రారంభం.. ఇప్పటికీ అసంపూర్తే
ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన ప్రజలు భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి మీదుగా మానేరువాగు నుంచి పెద్దపల్లి జిల్లా ఓడేడు గుండా రాకపోకలు సాగిస్తుంటారు. గోదావరిఖని, మంచిర్యాల, మంథని, బెల్లంపల్లి ప్రాంతాలకు వెళ్లేందుకు ఇది దగ్గరి దారి కావడంతో వంతెన నిర్మాణానికి రెండు జిల్లాల ప్రజల నుంచి చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో మానేరుపై బ్రిడ్జి నిర్మాణానికి 2016లో రూ.47.40 కోట్ల అంచనాతో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
ప్రారంభంలో పనులు వేగంగా సాగినప్పటికీ, తర్వాత మధ్యలోనే నిలిచిపోయాయి. పదేండ్లుగా నిర్మాణపనులు పునాదుల దశలోనే ఉండిపోవడంతో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటా వర్షాకాలంలో వాగు పొంగిపొర్లడంతో రైతులు పొలాలకు తెప్పల సహాయంతో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వాగుదాటే క్రమంలో పశువులు, మనుషులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. అయినా నిర్మాణ పనుల్లో ఎలాంటి పురోగతి లేదని ప్రజలు వాపోతున్నారు.
కూలిపోయిన గడ్డర్లు..
రెండేండ్ల కింద వచ్చిన భారీ వరదలకు ఇప్పటికే నిర్మించిన సిమెంట్గడ్డర్లు కూలిపోయాయి. వాగుపై కిలోమీటర్ మేర 23 పిల్లర్లతో వంతెన నిర్మించాల్సి ఉండగా, ప్రస్తుతం ఇరువైపుల కొంతమేర పిల్లర్లు మాత్రమే నిర్మించి వదిలేశారు. పిల్లర్ల మధ్య ఏర్పాటు చేసిన గడ్డర్లు ఎండ, వానల తాకిడికి కూలిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు నిర్మాణంపై దృష్టి పెట్టకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఏటా అక్టోబర్నుంచి తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేసి రాకపోకలు కొనసాగిస్తున్నా, వానాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వంతెన పూర్తయితే తగ్గనున్న ప్రయాణ భారం..
వంతెన నిర్మాణ పూర్తయితే పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల మధ్య రాకపోకలు సులభం కానున్నాయి. ప్రస్తుతం వాగును ఆనుకుని ఉన్న గర్మిళ్లపల్లి నుంచి ఓడేడు వెళ్లాలంటే వానాకాలంలో సుమారు 80 కిలో మీటర్ల చుట్టూ ప్రయాణించాల్సి వస్తోంది. జయశంకర్భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి కొయ్యూరు, మంథని మీదుగా ప్రయాణించాల్సి రావడంతో సమయం, ఖర్చు రెండూ పెరుగుతున్నాయి. ఓడేడు గ్రామానికి చెందిన గీత కార్మికుల తాటి వనాలు, రైతుల వ్యవసాయ భూములు గర్మిళ్లపల్లి పరిసరాల్లో ఉండడంతో వాగుదాటడం తప్పనిసరి అవుతోంది. వంతెన నిర్మాణం పూర్తయితే ఈ ఇబ్బందులు తొలగిపోతాయని ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం చొరవ తీసుకుని వంతెన నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
వంతెన నిర్మాణం కలగానే మిగిలిపోయింది..
మా పొలాలు మానేరు అవతలనే ఉన్నాయి. వానాకాలం, యాసంగి రెండు పంటలు సాగు చేస్తాం. వాగు దాటే సమయంలో మనుషులు, పశువులు గల్లంతైన ఘటనలు ఉన్నాయి. వంతెన నిర్మాణం పూర్తైతే మా కష్టాలు తీరుతాయి అనుకున్నం. కానీ, పదేండ్ల నుంచి నిర్మాణం పూర్తి కాలేదు. – పోతిపెద్ది కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ, ఓడేడు, పెద్దపల్లి జిల్లా
