- వార్డుల పెంపునకు గత పాలకవర్గం తీర్మానం
- ఓటర్ మ్యాపింగ్‌పై నేతల దృష్టి
- 43 వార్డుల నుంచి 48కి పెరిగే చాన్స్
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట మున్సిపాలిటీలో వార్డులకు పునర్విభజన జరుగుతుందా లేదా అనే విషయమై ఆసక్తి నెలకొంది. ఇటీవల పాలకవర్గం గడువు ముగియడంతో రాబోయే ఎన్నికల సమయానికి మున్సిపాలిటీ పరిధిలో వార్డుల సంఖ్య 43 నుంచి 48 కి పెరిగే అవకాశముందనే జోరుగా చర్చ సాగుతోంది. మే 10న సిద్దిపేట మున్సిపల్ పాలకవర్గం గడువు ముగియడంతో అడిషనల్ కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు సిద్దిపేట మున్సిపాల్టీకి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండటంతో వార్డుల సంఖ్యపై ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు మరికొద్ది నెలల్లో బల్దియాకు ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న వివిధ పార్టీల ఆశావహులు ఇప్పటికే తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒకవైపు వార్డుల్లో ప్రజలను కలుస్తూనే తమకు టికెట్లు వచ్చేలా చూడాలని ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో ప్రధాన పార్టీల నుంచి చైర్మన్ పదవిని ఆశిస్తున్న నేతలు గ్రౌండ్ వర్క్‌ను ప్రారంభించారు.
చివరి సమావేశంలో తీర్మానం
సిద్దిపేట మున్సిపాలిటీలో 1,28,500 మంది ఓటర్లు ఉన్నారు. పట్టణంలో మొత్తం 43 వార్డులున్నాయి. ఈ ఐదేండ్లలో మున్సిపాల్టీలో జనాభా మరో 20 వేలు పెరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకుని మరో 5 వార్డులు పెంచాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఒక్కో వార్డులో సగటున 2వేల నుంచి 2500 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో వార్డులు పెరుగుతాయని, రాజకీయ పార్టీల లీడర్లు భావిస్తున్నాయి. గత పాలకవర్గం చివరి సమావేశంలో వార్డుల పునర్విభజన చేయాలని తీర్మానం చేసి, ఉన్నతాధికారులకు పంపించారు. ఈ తీర్మానానికి ఆమోద ముద్రపడితే వార్డుల పునర్విభజన జరిగి మరో ఐదు వార్డులు పెరిగే అవకాశాలున్నాయి.
ఓటర్ మ్యాపింగ్ ఫోకస్
మరోవైపు ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) నిర్వహిస్తుండడంతో ప్రధాన పార్టీల నేతలు ఓటర్ మ్యాపింగ్‌పై దృష్టి పెట్టారు. 2002 ఓటర్ లిస్ట్‌తో ప్రస్తుత ఏడాది ఓటర్ల జాబితాలను పరిశీలిస్తుండటంతో వార్డుల్లో ఎక్కడ ఓట్లు కోల్పోకుండా చూడాలని, ఒకవేళ తొలగిస్తే వెంటనే వారితో దరఖాస్తులు చేయించాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన ముఖ్య నేత కింది స్థాయి నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఒక వార్డులో ఓటరుగా ఉండి, ఇతర వార్డుల్లో నివాసముంటున్న వారు వెంటనే మ్యాపింగ్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.
