మధ్యతరగతి, పొదుపరులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. రూ.3 కోట్ల లోపు చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యకాలిక, దీర్ఘకాలిక సేవింగ్ ప్లాన్స్ ద్వారా కస్టమర్లకు మరింత మెరుగైన లాభాలను అందించడమే లక్ష్యంగా పెంచిన ఈ కొత్త వడ్డీ రేట్లు వెంటనే అమలులోకి వచ్చాయి. సురక్షితమైన పెట్టుబడులతో ఎక్కువ రాబడిని ఆశించే డిపాజిటర్లకు ఇది ఒక మంచి అవకాశంగా మారనుంది.
ఏడాది నుంచి రెండేళ్ల లోపు కాలపరిమితి గల డిపాజిట్లపై ఇకపై వార్షికంగా 6.50 శాతం వడ్డీ చెల్లించనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. గతంలో వీటిపై తక్కువ రిటర్న్స్ ఉండేవి. అలాగే 2 ఏళ్ల నుండి మూడేళ్ల లోపు మెచ్యూరిటీ కాలం ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 6.60 శాతానికి పెంచింది. ఎవరైతే కచ్చితంగా మూడేళ్ల కాలపరిమితితో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారో.. వారికి ఏడాదికి గరిష్టంగా 6.70 శాతం వడ్డీ రేటును బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫర్ చేస్తోంది.
ఈ వడ్డీ రేట్ల పెంపు సాధారణ పౌరులకే కాకుండా.. సీనియర్ సిటిజన్లకు మరిన్ని అదనపు ప్రయోజనాలను తెచ్చి పెట్టింది. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు, 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లకు సాధారణ రేట్ల కంటే అదనపు వడ్డీ చెల్లిస్తోంది బ్యాంక్ ఆఫ్ ఇండియా. 6 నెలల నుండి 3 ఏళ్ల లోపు డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 0.65 శాతం అదనపు వడ్డీ ఇస్తోంది. ఒకవేళ 3 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలపరిమితితో డిపాజిట్ చేస్తే.. సీనియర్ సిటిజన్లకు 0.75 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు ఏకంగా 0.90 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది ప్రభుత్వ రంగ బ్యాంక్.
►ALSO READ | ఆఫీస్ ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ హెచ్చరిక.. 18 నెలల్లో డెస్క్ జాబ్స్ ఖాళీ
వీటితో పాటు రూ.కోటికి పైబడి.. కనీసం ఏడాది కాలపరిమితి ఉండే 'నాన్-కాలబుల్' ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏడాదికి మరో 0.15 శాతం అదనపు వడ్డీని ఇస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. అయితే ఎఫ్‌డీలపై లోన్ సదుపాయం, ముందస్తు విత్‌డ్రా సదుపాయాలు కేవలం కాలబుల్ డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందుకోవాలనుకునే కస్టమర్లు నేరుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లకు వెళ్లవచ్చు. లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్, 'BOI Omni Neo' మొబైల్ యాప్ ద్వారా సులభంగా డిజిటల్ పద్ధతిలో తమ ఎఫ్‌డీలను ఓపెన్ చేసుకోవచ్చు.
