ప్రస్తుతం టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తోన్న ఏకైక పదం AI. ఇప్పటికే అమెజాన్, మెటా, ఒరాకిల్ వంటి దిగ్గజాలు తమ కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరిస్తూ భారీగా ఉద్యోగాల కోత విధిస్తున్నాయి. అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, అసలైన ప్రమాదం మున్ముందు ఉందంటూ మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ ముస్తఫా సులేమాన్ అంచనాలను వెలువరించారు. రాబోయే 12 నుండి 18 నెలల్లోనే ప్రొఫెషనల్ ఆఫీస్ ఉద్యోగాలు ఊహించని రీతిలో మారిపోనున్నాయని హెచ్చరించారు.
కంప్యూటర్ ముందు కూర్చుని చేసే మెజారిటీ పనులను ఏఐ పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోబోతోందని సులేమాన్ చెబుతున్నారు. ముఖ్యంగా లీగల్, మార్కెటింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ వంటి రంగాలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగానికి ఎక్కువగా ప్రభావితం కానున్నాయి. మానవ మేధస్సుతో సమానంగా ప్రొఫెషనల్ టాస్క్‌లను పూర్తి చేసే సామర్థ్యం త్వరలోనే ఏఐ సొంతం కానుంది. కంప్యూటింగ్ పవర్, మౌలిక సదుపాయాలు రోజురోజుకూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందడమే దీనికి ప్రధాన కారణం. సాంకేతికత ఇంత వేగంగా పుంజుకోవడం.. భవిష్యత్తులో మనుషులు చేసే క్లిష్టమైన పనులు సైతం ఏఐ సులువుగా నిర్వహించగలదనేదానికి ఒక హెచ్చరిక లాంటిదే.
అయితే ఈ ఏఐ విప్లవం కేవలం ఉద్యోగాల భర్తీకే పరిమితం కావడం లేదు. భవిష్యత్తులో ఏఐ గురించి సులేమాన్ రెండు కీలకమైన విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఒక అడ్వాన్స్‌డ్ ఏఐ మోడల్‌ను రూపొందించాలంటే భారీగా నిధులు, అపారమైన కంప్యూటింగ్ పవర్, నిపుణులైన ఇంజనీర్లు అవసరం అవుతోందట. కానీ భవిష్యత్తులో ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయడం లేదా ఒక బ్లాగ్ రాయడం ఎంత సులువో, ఏఐ టూల్స్‌ను బిల్డ్ చేయడం కూడా అందరికీ అంత సులభం కానుందట.
ఇక రెండోది అత్యంత కీలకమైన ఏఐ సాంకేతికతలో మైక్రోసాఫ్ట్ సంస్థ పూర్తిగా స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన సొంత 'ఫౌండేషన్ మోడల్స్'ను అభివృద్ధి చేయడానికి సంస్థ సన్నద్ధమవుతోంది. సాంకేతికత తీసుకొస్తున్న ఈ మార్పులు డెస్క్ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నప్పటికీ.. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మాత్రమే ఈ ఏఐ యుగంలో నిలదొక్కుకోగలమనే వాస్తవాన్ని ఈ పరిణామాలు గుర్తుచేస్తున్నాయి.
