న్యూఢిల్లీ: రష్యా ఆయిల్ కొనుగోళ్ల విషయంలో అమెరికా ఆంక్షలను ఇండియా లైట్ తీసుకుంది. అమెరికా ఆంక్షల మినహాయింపు గడువు ముగిసినప్పటికీ రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆగవని తేల్చిచెప్పింది. రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లు యధావిధిగా కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ ఇంధన విధానం, ధరలు, సరఫరా భద్రతపైనే దృష్టి సారిస్తుందని తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభ నేపథ్యంలో దేశ ప్రయోజనాలే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని పేర్కొంది.
కాగా, ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోన్న రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దని ప్రపంచ దేశాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించాడు. తమ మాట లెక్క చేయకుండా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీగా సుంకాలు విధిస్తానని హెచ్చరించాడు. దీంతో ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను తగ్గించింది. అయితే, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది.
ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లపై విధించిన ఆంక్షలను నెల రోజుల పాటు అమెరికా సడలించింది. ఈ గడువు సోమవారం (18)తో ముగిసింది. దీంతో రష్యా ఆయిల్ కొనుగోళ్లపై ఆంక్షలు మళ్లీ అమల్లోకి వచ్చాయి. కానీ రష్యా ఆయిల్ కొనుగోళ్లపై అమెరికా విధించిన ఆంక్షల మినహాయింపు గడువు ముగిసినప్పటికీ రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తామని ఇండియా స్పష్టం చేసింది. భారత్ నిర్ణయంపై అమెరికా ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.
రష్యా చమురు సరఫరా స్థిరంగా ఉంది: సుజాత శర్మ
రష్యా ఆయిల్ కొనుగోళ్లపై పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ.. రష్యా నుంచి చమురు సరఫరా స్థిరంగా ఉందని తెలిపారు. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేశామని.. భవిష్యత్‌లోనూ రష్యా నుంచి చమురు కొనుగొళ్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
►ALSO READ | ఒక్క బిడ్డను కంటే 64 లక్షలిచ్చిన PUBG కంపెనీ ఓనర్ !
దేశ ముడి చమురు సేకరణ ప్రధానంగా వాణిజ్యపరమైన అంశాలు, మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అమెరికా ఆంక్షల మినహాయింపు గడువు ముగిసిన రష్యా నుంచి దేశం చేసే కొనుగోలు విధానాన్ని ప్రభావితం చేయదని స్పష్టం చేశారు. షిప్పింగ్ మార్గాలను ప్రభావితం చేస్తున్న ప్రపంచ అనిశ్చితులు, ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారతదేశ ఇంధన సరఫరా స్థిరంగా, పటిష్టంగా ఉందని చెప్పారు. దేశంలో ముడి చమురు కొరత లేదని.. తగినన్ని నిల్వలు ఉన్నాయన్నారు.
