సంక్షేమ పథకాలపై సమీక్ష ఏది?

సంక్షేమ పథకాలపై సమీక్ష ఏది?

ప్రభుత్వం అందిస్తున్న ఉచిత,  సంక్షేమ పథకాలపై సమీక్ష జరపాల్సిన అవసరం ఉంది.  ఈ విషయాన్నే కాగ్ తన నివేదికలో సైతం చెప్పింది.  అనర్హులకు రేషన్ కార్డు జారీ మొదలుపెట్టి ఎన్నో లోపాలను  కాగ్​ పేర్కొంది. కాగ్ నివేదికలోని  అంశాలను  పరిశీలిస్తే  ప్రభుత్వానికి తెలియని అనేక నిజాలు వెల్లడయ్యాయి.  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడంలేదు.

  కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారు కూడా  రేషన్ కార్డుపై  ఇస్తున్న బియ్యాన్ని తీసుకుంటున్నారు.  కరెంట్ మీటర్​కు  రేషన్ కార్డు అనుసంధానంతో అందిస్తున్న ఉచిత విద్యుత్​ని కూడా అనేకమంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు వినియోగించుకుంటున్నారు.  తమ వారి రేషన్ కార్డు నంబర్​ను తమ ఇంట్లోని  కరెంటు మీటర్​కు అనుసంధానించి పేదలకు ఇచ్చే ఉచితాన్ని  ప్రభుత్వ ఉద్యోగులే  పొందుతున్నారు.  

  •  పథకాల అమలులో లోపాలు

కల్యాణలక్ష్మి పథకం అమలులో ఉన్న లోపాలు అనర్హులకు వరాలుగా మారాయి.  వివాహానికి నిర్ధారించిన  వయసు లేనివారు తమ ఆధార్​ను  సాంకేతికను ఉపయోగించి తమకు కావల్సినట్టు ఎడిట్ చేసుకొని లబ్ధి పొందుతున్నారు.   దొంగ సర్టిఫికెట్లు తెచ్చి  రెవెన్యూ ఉద్యోగులు,  గ్రామ అధికారుల చేతులు తడిపి తాము మేజర్ అని నిరూపించుకునే సర్టిఫికెట్​లు  తెచ్చుకుంటూ   కల్యాణ లక్ష్మి పథకం ద్వారా ఇచ్చే నగదును  పొందుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణంలో  కూడా నిరుద్యోగ,  కార్మిక, పేద మహిళలకన్నా  ఉద్యోగాలు చేస్తున్న  మహిళా ప్రయాణికులకే ఎంతో అనుకులంగా ఉంది.  

ప్రభుత్వ ఉద్యోగులే  ఎక్కువ లబ్ధి పొందుతూ ప్రభుత్వ ఖజానాకు  భారంగా మారింది ఈ పథకం.  ఒకే ఇంట్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా వారి తల్లిదండ్రులకు వృద్ధాప్య పెన్షన్లు అందుతున్నాయి.  ప్రభుత్వ  దవాఖానాలలో వైద్యానికి అవసరమయ్యే మందులు ఉన్నా, రోగ నిర్దారణకు కావాల్సిన ఉపకరణాలు ఉన్నా కొందరు వైద్యులు మాత్రం వీటిని ఉపయోగించడం లేదు.  బయట ఉన్న తమ ప్రయివేట్  దవాఖానాలకు,  రోగ నిర్ధారణ కేంద్రాలకు  పంపిస్తున్నారు.  డబ్బులు  అధికంగా వచ్చే శస్త్ర చికిత్సలను తమకు బయట ఉన్న ప్రయివేట్ దవాఖనాలకు  పంపిస్తున్నారు కొందరు వైద్యులు.  లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఎన్నో వైద్య ఉపకరణాలు ప్రభుత్వ దవాఖానాలలో ఉపయోగంలో లేకుండా మూలన పడేశారు. 

  • ఆర్థిక దుబారాను నిలువరించాలి

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులలో నకిలీలు ఎందరో?  ముఖ్యమంత్రి సహాయనిధి  ద్వారా  నకిలీ బిల్లులు తీసుకొని పట్టుబడ్డ వైద్యులు,  వైద్యశాలలు ఎన్నో ఉన్నాయి.  బయటపడక దోపిడీ కొనసాగిస్తున్నవారెందరో? బయటపడితేగాని వారి లెక్క తేలదు.  నకిలీ హాజరుతో జీతాలు  తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎందరో?  ప్రభుత్వ అధీనంలో ఉన్న  ఆస్తులను  దుబారా  చేస్తున్నా.. ఎప్పటికప్పుడు  సమీక్షించుకుంటూ పట్టించుకునే పటిష్టమైన యంత్రాంగం లేదని చెప్పాలి.  

కాగ్ వంటి  రాజ్యాంగబద్ధ సంస్థ  ప్రభుత్వ లోపాలను  ఎత్తిచూపేదాకా  ప్రభుత్వం తెలుసుకోకపోతే  కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకే కాదు..  మూసీనది సుందరీకరణలాంటి పథకాలలో కూడా వేల కోట్లు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది.  విజిలెన్స్ వంటి ఎన్ని నిఘా వ్యవస్థలు ఉన్నా  నజర్  వేయకపోవడం వల్ల వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టి అక్రమార్కుల జేబులో చేరడం  ప్రభుత్వ లోపమే.  సంక్షేమ పథకాలను, ఉచిత పథకాలను ఎప్పటికప్పుడు  సమీక్షించి లోపాలను సరిదిద్దాలి.   లొసుగులను నివారించి అసలైన లబ్ధిదారులకు ఫలాలు అందేలా చూడాలి. ఆర్థిక దుబారాను నిలువరించి సమీకృత అభివృద్ధి వైపు సాగాలి. 

- ధారావత్ శ్రీను నాయక్
సామాజిక కార్యకర్త

Note: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.