మా గుడిలో మా పూజారి.. మల్లన్న, బీరప్ప పూజచేసే హక్కు ఒగ్గు పూజారులదే

 మా గుడిలో మా పూజారి.. మల్లన్న, బీరప్ప పూజచేసే హక్కు ఒగ్గు పూజారులదే

తెలంగాణలోని గ్రామీణ సంస్కృతిలో మల్లన్న, బీరప్పల ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా యాదవ, కురుమ సమాజాలకు మల్లన్న దేవుడు కేవలం ఆరాధ్యుడే కాదు, వారి జీవన విధానం, సంస్కృతి, ఆత్మగౌరవానికి ప్రతీక.  మల్లన్న బీరప్ప ఆలయాల్లో ఒగ్గు పూజారుల పూజా విధానం  శతాబ్దాలుగా కొనసాగుతున్నది.  అయితే  ఇటీవలి కాలంలో ఆగమ శాస్త్రం పేరుతో కొన్ని దేవాలయాల్లో బ్రాహ్మణ పూజారులను నియమించడం వివాదాస్పదంగా మారింది. 

ఇది కేవలం పూజారి నియామకం సమస్య కాదు. సంప్రదాయం, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణ సమస్యల సమ్మేళనం. ఇలాంటి లోతైన సంప్రదాయాన్ని పక్కనబెట్టి ఒకే విధమైన ఆగమ 
విధానాన్ని అమలు చేయాలనే ప్రయత్నాలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మల్లన్న ఆలయాల్లో పూజా విధానం సాధారణంగా ఇతర ఆలయాల కంటే భిన్నంగా ఉంటుంది. బండారి (పసుపు)తో పూజలు చేయడం,  పట్నాలు వేయడం, శివసత్తుల పూనకాలు..ఇవి అన్నీ ఒగ్గు పూజారుల ద్వారా తరతరాలుగా కొనసాగుతున్న ప్రత్యేక ఆచారాలు. ఇవి కేవలం పూజలు కాదు. ఒక సమాజపు సంస్కృతి, విశ్వాసాలకు 
ప్రతిబింబం.

మల్లన్న, బీరప్ప దైవాలు  తెలంగాణలో శైవ సంప్రదాయానికి చెందినవిగా భావించినా, వీరి ఆరాధన పూర్తిగా  ప్రజల జీవనంతో ముడిపడి ఉంటుంది. పశుపోషక సమాజాలైన యాదవ, కురుమల జీవనంలో మల్లన్న దేవుడు కాపరి, రక్షకుడిగా భావిస్తారు.  బీరప్పను  గ్రామ రక్షక దేవుడిగా, శక్తి స్వరూపంగా పూజిస్తారు. చరిత్రపరంగా చూస్తే, ఈ దేవతల ఆరాధన వేదాలకంటే ముందే ఉన్న  ‘లోకాయత’  సంప్రదాయాలకు చెందినదిగా పండితులు విశ్లేషిస్తున్నారు. అంటే, ఇది రాజసభలలో కాదు..ప్రజల మధ్య, ప్రకృతితో కలిసి అభివృద్ధి చెందిన భక్తి విధానం.ఈ సంప్రదాయాన్ని నిలబెట్టినవారు ఒగ్గు పూజారులు. వీరు కేవలం అర్చకులు కాదు..చరిత్రను, ఆచార, సంప్రదాయాలను తరతరాలకు అందించిన వారసత్వ సంరక్షకులు. ఒగ్గు కథల ద్వారా మల్లన్న–బీరప్పల గాథలను ప్రజలలో  ప్రచారం చేస్తారు. బండారి (పసుపు)తో పూజలు చేయడం, పట్నాలు వేయడం, శివసత్తుల పూనకాలు వంటి ఆచారాలు వీరి ప్రత్యేకత.

  • బండారి (పసుపు) వినియోగం

ముఖ్యంగా బండారి (పసుపు) వినియోగం వెనుక ఉన్న వైజ్ఞానికత  గమనించదగినది. ఆధునిక పరిశోధనలు చెబుతున్నట్లు, పసుపులో ఉండే కుర్కుమిన్ శక్తివంతమైన యాంటీబయాటిక్, యాంటీ ఇన్‌‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. పెద్ద ఎత్తున జరిగే జాతరల్లో  లక్షలాది మంది భక్తులు చేరే సందర్భంలో పసుపు వినియోగం ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. అంటే, మన పూర్వీకులు శాస్త్రాన్ని ఆచారాల రూపంలోనే జీవనంలో భాగం చేశారు.  అలాగే మల్లన్న–బీరప్పల  ‘అల’ను పూజించడం వెనుక ఉన్న తాత్వికత కూడా విశిష్టమైనది. ఇది కేవలం విగ్రహారాధన మాత్రమే కాదు.  ప్రకృతి, శక్తి, జీవన చక్రాన్ని ప్రతిబింబించే ఆధ్యాత్మిక భావన. సామూహిక పూజల ద్వారా సమానత్వాన్ని, ఐక్యతను పెంపొందించే సామాజిక వ్యవస్థ కూడా ఇందులో అంతర్లీనంగా ఉంటుంది.

  • మల్లన్న, బీరప్ప పూజచేసే హక్కు ఒగ్గు పూజారులదే

ఇలాంటి గొప్ప సంప్రదాయానికి విరుద్ధంగా, ఇటీవలి కాలంలో కొన్ని ఆలయాల్లో ఆగమ శాస్త్రం పేరుతో బ్రాహ్మణ పూజారులను నియమించడం వివాదానికి దారితీసింది. ఇది కేవలం నియామకాల సమస్య కాదు.. తరతరాలుగా కొనసాగుతున్న ఒగ్గు పూజారుల  హక్కులను హరించడం. దేశవ్యాప్తంగా గ్రామీణ దేవాలయాల్లో ఎక్కువ శాతం స్థానిక సంప్రదాయాల ఆధారంగా నడుస్తున్నాయి. అలాంటి సందర్భంలో ఒక్కసారిగా ఒకే విధానం అమలు చేయడం వల్ల సామాజిక అసంతృప్తి పెరగడం సహజం. యాదవ, కురుమ సమాజాలు వ్యక్తం చేస్తున్న నిరసనలను ఈ కోణంలో చూడాలి. ఇది ఉద్యోగం కోసం చేసే పోరాటం కాదు..ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలనే ఉద్యమం. ‘మా దేవుడిని మేమే పూజించాలి’ అనే వారి డిమాండ్‌‌లో చరిత్ర ఉంది,  సంస్కృతి ఉంది, స్వాభిమానం ఉంది.  ఈ  సమస్యకు పరిష్కారం ఘర్షణలో లేదు.. సమన్వయంలో ఉంది. ప్రభుత్వం ఒకవైపు శాస్త్రబద్ధతను పాటించాలనే బాధ్యతను నిర్వర్తిస్తూనే..మరోవైపు స్థానిక సంప్రదాయాలను గౌరవించాల్సిన కర్తవ్యాన్ని మరవకూడదు. 

- మేకల కృష్ణ, ప్రధాన కార్యదర్శి
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం

Note: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.