దేశంలో డెమోక్రసీని సస్పెండ్​ చేశారు

దేశంలో డెమోక్రసీని సస్పెండ్​ చేశారు

న్యూఢిల్లీ : సభా కార్యకలాపాలను అదేపనిగా అడ్డుకున్నందుకు విపక్షాలకు చెందిన19 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్​ విధించారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన ఈ నెల 18 నుంచి విపక్షాల ఎంపీలు.. ధరల పెరుగుదల, నిత్యావసరాలపై జీఎస్టీ విధింపునకు నిరసనగా హౌస్​ ప్రొసీడింగ్స్​కు ఆటంకం కలిగిస్తూనే ఉన్నారు. మంగళవారం కూడా సభ ప్రారంభమైన కాసేపటికే వెల్​లోకి దూసుకెళ్లారు. వెనక్కి వెళ్లి ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్​హరివన్ష్​ ఎంతగా విజ్ఞప్తి చేసినా వారు వినలేదు. దీంతో సభ రెండుసార్లు 15 నిమిషాలపాటు వాయిదా పడింది. ఆ తర్వాత కూడా ఎంపీలు అదేపనిగా హౌస్​కు ఆటంకం కలిగించడంతో ఆరోజు మొత్తానికి సభను డిప్యూటీ చైర్మన్​ వాయిదా వేశారు. అప్పటికీ విపక్ష ఎంపీలు.. కనీస అవసరాలపై జీఎస్టీ విధింపుపై చర్చకు పట్టుబడుతూనే ఉన్నారు. వెల్​లో నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు అడ్డుపడ్డారు. దీంతో వారిపై సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టాలని ట్రెజరీ బెంచ్​ను ఆయన ఆదేశించారు. తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్​ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనుచిత ప్రవర్తన, సభాధిపతి పట్ల ఏమాత్రం గౌరవం చూపనందుకు పది మంది ఎంపీలు ఈ వారమంతా హౌస్​కు హాజరు కాకుండా వారిపై సస్పెన్షన్​ విధిస్తున్నామని డిప్యూటీ చైర్మన్​ తెలిపారు. వాయిస్​ ఓటు ద్వారా సభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది.

సస్పెండ్​ అయిన ఎంపీలు వీళ్లే..

సస్పెండ్​ అయిన 19 మంది రాజ్యసభ సభ్యుల్లో ఏడుగురు టీఎంసీ,  ఆరుగురు డీఎంకే, ముగ్గురు టీఆర్​ఎస్​, ఇద్దరు సీపీఎం, ఒకరు సీపీఐ సభ్యుడు ఉన్నారు. టీఎంసీకి చెందిన సుస్మితా దేవ్, మౌసమ్​నూర్​, శాంతా ఛేత్రి, దోలా సేన్​, శాంతనూ సేన్, అబిర్​ రంజన్​ బిశ్వాస్, నదీముల్ ​హక్, డీఎంకేకు చెందిన మొహమ్మద్​ అబ్దుల్లా, కనిమొళి ఎన్వీఎన్​సోము, షణ్ముగం, కల్యాణసుందరం, గిరిరాజన్, ఎన్​ఆర్​ ఎలాంగో, టీఆర్ఎస్​కు చెందిన బి.లింగయ్య యాదవ్, రవిచంద్ర వద్దిరాజు, దామోదర్​రావు దీవకొండలపై సస్పెన్షన్​ విధించారు. అలాగే సీపీఎం నుంచి సదాశివన్​, ఏఏ రహీం, సీపీఐ నుంచి సంతోష్​కుమార్లను సస్పెండ్​ చేశారు. మంగళవారం ఏ ఒక్క అంశంపై చర్చ జరగకుండానే సభ తుడిచిపెట్టుకుపోయింది. కాగా అంతకుముందు వివిధ విపక్షాల నేతలు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పార్లమెంట్​ఆవరణలో ధర్నా చేశారు.

దేశంలో డెమోక్రసీని సస్పెండ్​ చేశారు: టీఎంసీ

రాజ్యసభ నుంచి 19 మంది సభ్యులను సస్పెండ్​చేయడంపై కేంద్రంపై టీఎంసీ తీవ్రంగా విరుచుకుపడింది. ‘‘దేశంలో డెమోక్రసీని సస్పెండ్​ చేశారు. పార్లమెంట్​ను డార్క్ ​చాంబర్​గా మార్చారు. పార్లమెంట్​ అంటే మోడీ భయపడుతున్నారు” అని టీఎంసీ  లీడర్​ డెరెక్​ ఒబ్రెయిన్ ​మీడియాతో అన్నారు.

లోక్​సభలోనూ అదే సీన్​

ధరల పెరుగుదల, జీఎస్టీ, కేంద్ర సంస్థల దుర్వినియోగంపై సభను వాయిదావేయాలని లోక్​సభలో విపక్షాలు పట్టుబట్టాయి. మంగళవారం ‘కార్గిల్ ​విజయ్ ​దివస్​’ సందర్భంగా సైనికులకు స్పీకర్ ​ఓం బిర్లా నివాళులర్పించి సభను   ప్రారంభించారు. సభ ప్రారంభంకాగానే ద్రవ్యోల్బణం, జీఎస్టీకి వ్యతిరేకంగా విపక్ష లీడర్లు ప్లకార్డులు పట్టుకొని వెల్​లోకి దూసుకెళ్లారు. జీరో అవర్​లో మాట్లాడేందుకు అనుమతిస్తానని స్పీకర్ ​చెప్పినా వినలేదు. దీంతో సభను   స్పీకర్​ 11.45 గంటల దాకా వాయిదా వేశారు. మళ్లీ సమావేశమైన తర్వాత కూడా ప్రతిష్టంభన కొనసాగింది. ఈ క్రమంలో కాంగ్రెస్​ సభ్యులు వాకౌట్​ చేశారు. కేంద్ర సంస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా రాష్ట్రపతి భవన్​వైపు ప్రదర్శనగా వెళ్లి ధర్నా చేశారు.

బరువైన హృదయంతో సస్పెన్షన్​ నిర్ణయం: బీజేపీ

రాజ్యసభ నుంచి 19 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్​ చేయాలన్న నిర్ణయాన్ని ఎంతో భారంగా తీసుకున్నామని బీజేపీ తెలిపింది. సభకు ఆటంకం కలిగించవద్దని డిప్యూటీ స్పీకర్​వారికి ఎంత విజ్ఞప్తి చేసినా వినలేదని, దీంతో వారిపై తప్పక సస్పెన్షన్ విధించాల్సి వచ్చిందని రాజ్యసభలో బీజేపీ లీడర్​ పీయూష్​ గోయల్​ తెలిపారు.