- కనీస వేతనాల సవరణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల స్థితిగతులను మెరుగు పరిచేందుకు, వారికి మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో కనీస వేతనాల సవరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, లేబర్ కమిషనర్ దాసరి హరి చందన, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
.రాష్ట్రంలో వేతనాల సవరణ శాస్త్రీయంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ సందర్భంగా దేశంలోని ఇతర ప్రధాన రాష్ట్రాల్లో అమలవుతున్న కనీస వేతనాల విధానాలను కమిటీ కూలంకషంగా పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తీసుకురానున్న నూతన ‘లేబర్ కోడ్’ ప్రభావం ఎలా ఉండబోతోందనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. కార్మికుల వేతనాలను కేవలం అంకెల్లో కాకుండా, వారి వాస్తవ అవసరాలకు అనుగుణంగా సవరించాలని కమిటీ నిర్ణయించింది.
ప్రస్తుతం పెరుగుతున్న ధరలు, జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలు ఉండాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. దేశంలోని అత్యుత్తమ వేతన నమూనాలను రాష్ట్రంలో అమలు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయ పడింది. తెలంగాణను కార్మికుల పక్షపాతి రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అభిప్రాయడ్డారు. త్వరలోనే అన్ని వర్గాల అభిప్రాయాలను క్రోడీకరించి, కార్మికులకు మేలు చేకూర్చే విధంగా కనీస వేతనాల సవరణపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అసంఘటిత, సంఘటిత రంగ కార్మికులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
