- బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌కు సభ అంటే గౌరవం లేదు
- ప్రజల కోసం పెట్టిన బడ్జెట్ వాళ్లకు కంటగింపుగా ఉంది
- 1.15 కోట్ల ఫ్యామిలీలకు 5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తే కనిపిస్తలేదు
- ఉద్యోగి చనిపోతే రూ.1.20 కోట్ల బీమా భరోసా ఇచ్చినం
- ఇప్పటివరకు మేం తెచ్చిన అప్పులు రూ.1.59 లక్షల కోట్లు
- మీరు చేసిన అప్పులకు తిరిగి కట్టింది రూ.1.80 లక్షల కోట్లు
- అసెంబ్లీలో బడ్జెట్‌పై రిప్లై
హైదరాబాద్, వెలుగు: బడ్జెట్ ద్వారా పేదలకు మంచి చేస్తుంటే బీఆర్ఎస్ వాళ్లు ఓర్వలేకపోతున్నారని, పేదలు బాగుపడితే వాళ్లకు నచ్చదని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రజల పట్ల బాధ్యత, వారి అవసరాలు తీర్చాలన్న ఆలోచన వాళ్లకు లేదన్నారు.‘‘ఇది వాళ్లకు తరతరాలుగా వస్తున్న ఆచారం.. ఆ సమస్య నుంచి వాళ్లు ఇంకా బయటపడలేకపోతున్నారు.. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు.. ఇలా రాష్ట్రంలో ఏ కుటుంబం గురించి బీఆర్ఎస్ నేతలకు అవసరం లేదు.. వారికి ఎవరు కావాలో అర్థం కావడం లేదు” అని ఎద్దేవా చేశారు. పేదల కోసం, ఉద్యోగుల కోసం బీమా పథకాలు తెచ్చినా వాళ్లకు పట్టదన్నారు. బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ఎలాగూ సభకు రారని, ఆయనకు సభంటే గౌరవం లేదని, తాము బడ్జెట్ క్లారిఫికేషన్ ఇస్తే బీఆర్ఎస్వాళ్లు వినడంలేదని విమర్శించారు. అసెంబ్లీలో మంగళవారం బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం రిప్లై ఇచ్చారు. ఇప్పటివరకు తాము రూ.1.59 లక్షల కోట్ల అప్పులు తెస్తే.. బీఆర్ఎస్చేసిన అప్పులు, వాటి వడ్డీలకు రూ.1.80 లక్షల కోట్లు చెల్లించామని, తాము ఈ లెక్కలు చెప్తుంటే సభలో ఉండలేక వాకౌట్చేసి వెళ్లిపోవడాన్ని డిప్యూటీ సీఎం తప్పుపట్టారు.
వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నరు..
ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే.. వాళ్ల కుటుంబం ఒక్కసారిగా కుదేలైపోతుందని, అలాంటి కుటుంబాలకు రూ.1.20 కోట్ల ప్రమాద బీమా పథకాన్ని తీసుకొచ్చామని భట్టి విక్రమార్క చెప్పారు. పైలట్ ప్రాజెక్ట్‌గా విద్యుత్ డిపార్ట్మెంట్లో అమలు చేశామన్నారు. అసిస్టెంట్ లైన్మెన్, ఆర్టిజన్ల కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే గత ప్రభుత్వం రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని, ఇప్పుడు వారి కుటుంబాలకు ఈ పథకంతో భరోసా దక్కుతోందన్నారు. అసెంబ్లీలో సీఎం చేతుల మీదుగా బాధితులకు చెక్కులను అందించామని భట్టి గుర్తుచేశారు. పదేండ్లు ప్రతిపక్షంలో ఎల్వోపీగా, డిప్యూటీ ఎల్వోపీగా చేసిన తనకు.. ఎన్ని అవమానాలు జరిగాయో సభ రికార్డులు తీస్తే తెలుస్తుందన్నారు.
ప్రజల సమస్యలపై మాట్లాడేందుకు గొంతెత్తి అరిచినా మైక్ ఇవ్వని వాళ్లకు.. ఇప్పుడు ప్రజాస్వామిక పద్ధతిలో టైమిచ్చినా సభలో కూర్చుని వినే ఓపిక లేక వాకౌట్ చేసి వెళ్లిపోయారని, అలాంటి వాళ్లను ఏమనాలో కూడా తెలియదని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇదీ వారికి ప్రజాస్వామ్యం, చర్చలపై ఉన్న నమ్మకం. వాళ్లు ఏనాడూ మమ్మల్ని సభ్యులుగా చూడనేలేదు. మైక్ ఇవ్వకపోయినా సభలో అర్ధరాత్రయినా సభలో ఓపిగ్గా కూర్చున్నాం. మాకు సభ అంటే గౌరవం. ప్రజల జీవితాలను మార్చే చట్టాలు ఇక్కడే చేయాలి. వాళ్లకు మంచి చేయాలంటే ఇక్కడ కూర్చోవాలి. మేం మా కోసం సభకు రాలేదు. ప్రజల అవసరాలు తీర్చేందుకు వచ్చాం’’ అని పేర్కొన్నారు.
వడ్డీలేని రుణాల గురించి మీరా మాట్లాడేది..
వడ్డీలేని రుణాల గురించి బీఆర్ఎస్ వాళ్లు ఎలా మాట్లాడుతారని భట్టి నిలదీశారు. ‘‘మహిళల ఆర్థిక ఎదుగుదల బీఆర్ఎస్ వాళ్లకు అక్కర్లేదు. వాళ్లకు మహిళలు కేవలం ఓ రాజకీయ వస్తువు. మహిళలు రాజకీయంగా ఎదగొద్దు. ఇదే వాళ్ల ఆలోచన. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. ఐదేండ్లలో లక్ష కోట్ల వడ్డీలేని రుణాలను ఇస్తామని చెప్పినం. కచ్చితంగా ఇస్తం. దానికి రూ.10 వేల కోట్ల వడ్డీ కావాలి. ఇప్పుడు ఆల్రెడీ రూ.1,500 కోట్లు పెట్టినం. వచ్చే ఏడాది రూ.3,500 కోట్లు పెడ్తం.. ఆ తర్వాత రూ.5 వేల కోట్లు ఆ వడ్డీ కోసం బడ్జెట్లో నిధులు ఇస్తం. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అన్ని రకాలా కృషి చేస్తం. కానీ, వాళ్లు మాత్రం ఎన్నికలకు ముందు కొన్ని నిధులు విడుదల చేసి వదిలేశారు. ఆ తర్వాత 2019 నుంచి 2023 వరకు దాని గురించే ఆలోచించలేదు’’ అని భట్టి చెప్పారు. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు వారు కాంట్రాక్టర్లు, ఉద్యోగుల బిల్లులను వేల కోట్లు పెండింగ్‌లో పెట్టారన్నారు. తాము ఇప్పటిదాకా రూ.6,500 కోట్ల వరకు క్లియర్ చేసి.. సిస్టమాటిక్‌గా ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రతి నెలా రూ.700 కోట్లు క్లియర్ చేస్తామని చెప్పి.. చేస్తున్నామని తెలిపారు. మెడికల్ బిల్లులు పెండింగ్ లేవని, వాటిని ఏ నెలకు ఆ నెల క్లియర్ చేస్తున్నామన్నారు. ఇప్పటి నుంచి ప్రతి నెలా రూ.వెయ్యి కోట్లు క్లియర్ చేసేందుకు నిర్ణయించామని, అందుకు తగ్గట్టుగా బడ్జెట్లో నిధులు పెట్టామన్నారు.
మేము తెచ్చిన అప్పులు..
మీ అప్పులు కట్టేందుకే సరిపోతున్నయ్
2014–-15లో రాష్ట్ర అప్పు కేవలం రూ.9,500 కోట్లేనని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. అవి పెరిగి భారంగా మారాయన్నారు. కానీ, ఇప్పుడు లక్షల కోట్లకు పెరిగిన అప్పులు.. రాష్ట్రాన్ని ముందుకు నడవనీయడం లేదన్నారు. అయినా, ప్రభుత్వపరంగా గట్టిపునాదులు వేస్తూ.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం 2023–-24లో తెచ్చిన అప్పులు రూ.15,357 కోట్లు. ఎఫ్ఆర్బీఎం రీపేమెంట్ కింద రూ.6,907 కోట్లు కట్టినం. వడ్డీ కింద రూ.8,650 కోట్లు చెల్లించాం. ఆఫ్బడ్జెట్ బారోయింగ్స్లో రూ.9,793 కోట్లు కట్టాం. మొత్తంగా ఆ ఏడాది రూ.25,350 కోట్ల అప్పు తిరిగి కట్టినం. దానికి అదనంగా రాష్ట్ర ఆదాయం నుంచి చెల్లిస్తున్నం.
2024– -25 ఆర్థిక సంవత్సరంలో 56,968 కోట్లు అప్పు తీసుకురాగా 66,545 కోట్లు అప్పు, మిత్తి చెల్లించినం. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.86,650 కోట్లు అప్పు తెస్తే.. ఎఫ్ఆర్బీఎం రీపేమెంట్ రూ.19,639 కోట్లు, ఇంట్రెస్ట్ రూ.8,506 కోట్లు, ఆఫ్బడ్జెట్ అప్పులు 45,448 కోట్లు చెల్లించాం. మొత్తం రూ.93,108 కోట్లు ఈ ఏడాది అప్పులు కట్టినం. ఈ రెండేండ్లలో మొత్తం రూ.1.59 లక్షల కోట్ల అప్పులు తెస్తే.. బ్యాంకులకు చెల్లించింది రూ.1.80 లక్షల కోట్లు. తెచ్చిన అప్పులు.. అప్పులు కట్టడానికే సరిపోతుంది. ఇవన్నీ బయటపెడతామని భయపడి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేసి వెళ్లిపోయారు’’ అని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాగా, కరెంట్ చార్జీలను తమ ప్రభుత్వం పెంచలేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తూ.. ఆ తర్వాత యూనిట్‌కు రూ.10 పెంచారన్న ఆరోపణలు అవాస్తవమన్నారు.
1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షల బీమా తెచ్చినం..
సీఎం రేవంత్, తాను, మంత్రులు మారుమూల గ్రామాల నుంచి వచ్చినవాళ్లమేనని, పేద విద్యార్థుల స్థితి గతులేంటో తెలుసని భట్టి విక్రమార్క అన్నారు. లక్షలాదిమంది పేద విద్యార్థుల ఆకలిని అర్థం చేసుకున్న వ్యక్తులుగా బిడ్డలు ఖాళీ కడుపుతో బడికి పోవద్దన్న ఆలోచనతో అల్పాహారం ప్రవేశపెట్టామన్నారు. బడి నడిచిన ఆరు రోజుల్లో మూడు రోజులు పాలు, మిగిలిన మూడు రోజులు రాగి జావా ఇవ్వాలని నిర్ణయించామని, ఇంటర్ పిల్లలకూ మొట్టమొదటిసారి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయబోతున్నామని తెలిపారు. ‘వాళ్లు మన పిల్లలు కాదా.. ఈ రాష్ట్ర భవిష్యత్ కాదా.. వాళ్లు భోజనం చేయడం బీఆర్ఎస్ నేతలకు ఇష్టం లేదా?’ అని ప్రశ్నించారు. దానిని కూడా వీళ్లు ఓర్వడం లేదన్నారు. ‘రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షల ప్రమాద బీమా కల్పించాం. కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం ఆగం కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయం వినడానికి వారికి ఓపిక లేదా? ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయాన్ని గ్రామస్థాయికి తీసుకువెళ్లే ఉద్యోగస్తుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి 1.20 కోట్ల ప్రమాద బీమాను ప్రవేశపెట్టాం. 7.50 లక్షల కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నాం. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మె అని మొదులుకొని ఉద్యోగులు పోరాడారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. రాష్ట్రం వచ్చాక మీ 10 సంవత్సరాల పాలనలో ఉద్యోగులకోసం ఏమైనా చేశారా? వారిని నిర్బంధించారు. హౌస్ అరెస్టులు చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులు భయం భయంగా బతికారు. కానీ, వారికి మొట్టమొదటిసారిగా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందించేలా ఈహెచ్ఎస్ తీసుకొస్తున్నం’ అని డిప్యూటీ సీఎం చెప్పారు.
