ధరణి పోయి భూభారతి వచ్చినా.. 5 లక్షలకు పైగానే సర్వే నెంబర్లు పెండింగ్

ధరణి పోయి భూభారతి వచ్చినా.. 5 లక్షలకు పైగానే సర్వే నెంబర్లు పెండింగ్

ధరణి పోయి భూభారతి వచ్చింది.. కానీ రైతుల భూసమస్యలు మాత్రం పరిష్కారం కావడంలేదు. ఇందుకు రెవెన్యూ అధికారుల పనితీరే కారణమని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం మారినప్పుడల్లా దరఖాస్తులు తీసుకోవడం, సీఎంలు, మంత్రులు సీరియస్​కాగానే హడావిడిగా కొన్నింటిని పరిష్కరించడం, మిగిలినవన్నీ  పక్కనపెట్టడం రెవెన్యూ యంత్రాంగానికి పరిపాటిగా మారింది.

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు.

మొత్తం 14,09,602 సర్వే నంబర్లకు సంబంధించిన భూ సమస్యలపై 9,15,579 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో  కేవలం 71,385 సర్వే నంబర్లకు సంబంధించిన సమస్యలు మాత్రమే  పరిష్కారానికి నోచుకున్నాయి. అంటే కేవలం 5 శాతానికి అటూఇటుగా మాత్రమే పరిష్కరించిన అధికారులు మిగిలినవన్నీ పక్కనపెట్టేశారు.

5.11 లక్షల సర్వే నెంబర్లు పెండింగ్​
ఒకవైపు భారీగా తిరస్కరించిన అర్జీలు ఒకెత్తయితే, మరోవైపు అసలు ఎటూ తేల్చకుండా పెండింగ్‌‌లో పడేసిన దరఖాస్తుల సంఖ్య కూడా కొండలా పేరుకుపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 5,11,040 సర్వే నంబర్లకు సంబంధించిన సమస్యలు పెండింగ్ జాబితాలోనే మూలుగుతున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 77,400 సర్వే నంబర్లు, వరంగల్‌‌లో 51,924, సూర్యాపేటలో 46,844, మహబూబాబాద్‌‌లో 44,300,  హనుమకొండ జిల్లాలో 33,003 సర్వే నంబర్లకు సంబంధించిన సమస్యలు నేటికీ పరిష్కారానికి నోచుకోలేదు. సదస్సులు నిర్వహించి నెలలు గడుస్తున్నా తమ దరఖాస్తు పరిస్థితి  ఏమిటో తెలియక రైతులు ప్రతిరోజూ తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.

►ALSO READ | హైదరాబాద్ పబ్లిక్కు ట్రాఫిక్ అలర్ట్.. 

పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు స్పష్టమైన గడువు విధించకపోవడంతో ఎప్పటికి పరిష్కారమవుతాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. పై అధికారులు మొదలుకొని కింది స్థాయి సిబ్బంది వరకు రెవెన్యూ యంత్రాంగంలో ఏండ్లుగా గూడుకట్టుకున్న  అలసత్వం, జవాబూదారీతనం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

క్షేత్రస్థాయిలో దరఖాస్తు ఏ కారణంతో తిరస్కరిస్తున్నారో రైతులకు స్పష్టంగా వివరించే  వ్యవస్థ సైతం లోపించింది. అర్జీ తిరస్కరణకు గురైన విషయాన్ని మెసేజ్ రూపంలో పంపడం తప్ప, తదుపరి  ఎక్కడ అప్పీల్​చేసుకోవాలి? ఏ పత్రాలు జత చేయాలి? అనే విషయంలో అధికారులు ఎలాంటి మార్గదర్శనం చేయడం లేదని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

సాదా బైనామాలు 10 శాతం కూడా పరిష్కారం కాలే
రాష్ట్రవ్యాప్తంగా సాదాబైనామాల (తెల్లకాగితాల ఒప్పందాల)కు సంబంధించి 9 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తే ఇప్పటివరకూ అధికారులు 10 శాతం కూడా పరిష్కరించలేకపోయారు. ‘భూభారతి’ అమల్లోకి వచ్చాక అఫిడవిట్ నిబంధనల్లో మార్పులు చేసి, పరిష్కార బాధ్యతలను ఆర్డీవో  పరిధికి అప్పగిస్తూ కొత్త మార్గదర్శకాలు జారీ చేసినా ముందుకు కదలడం లేదు.

మరోవైపు నకిలీ పత్రాలు, కోర్టు వివాదాలు,  దేవాదాయ, అటవీ భూముల ఆక్రమణలకు సంబంధించిన దరఖాస్తులను చట్టప్రకారం ఆమోదించలేమని, మిగిలిన పెండింగ్ దరఖాస్తులను సమగ్ర విచారణ జరిపి త్వరలోనే పరిష్కరిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం గమనార్హం.