దేవీ నవరాత్రులు: ఒక్కో రోజు ఒక్కో రూపం

దేవీ నవరాత్రులు: ఒక్కో రోజు ఒక్కో రూపం

దేవీ నవరాత్రులు  మొదలయ్యాయి. ఏటా శరదృతువులోని ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్యయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు  ఈ ఉత్సవాలు జరుగుతాయి. అందుకే వీటిని శరన్నవరాత్రులని అంటారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారు హోరాహోరీ యుద్ధం చేసి మహిషాసురుని సంహరిస్తుంది గనుక  వీటినే దేవీ నవరాత్రులని  అంటారు. ఈ తొమ్మిది రోజులు దేశమంతటా దుర్గాదేవి వివిధ రూపాల్లో పూజలందుకుంటుంది. మన దగ్గర ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని కొలుస్తారు. మరి ఆ రూపాలేంటి?  అసలు దేవీ నవరాత్రుల వెనకున్న కథేంటంటే.. 

పురాణాల ప్రకారం మహిషాసురుడు అసురులందరిలో బలవంతుడు. దేవతల మాదిరిగా తనకి కూడా చావులేని జీవితం కావాలనుకుంటాడు అతను. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి  బ్రహ్మదేవుడి కోసం వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అది మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమంటాడు. మరణం లేని జీవితాన్ని ఇవ్వమని అడుగుతాడు మహిషాసురుడు. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదని, అలాంటి వరాన్ని ఇవ్వలేనని చెప్తాడు బ్రహ్మదేవుడు. ‘నీ మృత్యువుకు ఏదైనా ఒక మార్గం విడిచిపెట్టి వరం కోరుకో’ అంటాడు. దాంతో పురుషుల చేతిలో నాకు మరణం లేకుండా వరం ఇవ్వు’ అన్నాడు మహిషాసురుడు. ‘సరే’ అంటాడు బ్రహ్మదేవుడు.  ఆ వరంతో మహిషాసురుడు దేవతలపై యుద్ధాన్ని ప్రకటించాడు. స్వర్గంపై దండెత్తి, దేవతలందరినీ ఓడించాడు. ఇంద్ర పదవిని కైవసం చేసుకున్నాడు. అవన్నీ సహించలేక ఇంద్రుడు త్రిమూర్తుల దగ్గరకు వెళ్లి మొరపెట్టుకోగా, వాళ్లలో రగిలిన కోపం నుంచి పద్దెనిమిది  భుజాలు ఉన్న ఒక స్త్రీ ఉద్భవించింది. ఆమె ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి   నవమి వరకు మహిషాసురుడి సైన్యంలో ప్రముఖులైన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడుతో పాటు మహిషాసురుడిని మట్టుబెట్టింది. ఆ విజయానికి గుర్తుగానే ఈ తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. మరి ఏ రోజు అమ్మవారిని  ఏ రూపంలో కొలుస్తారంటే.. 
మొదటి రోజు
అమ్మవారి నవదుర్గల అవతారాల్లో  మొదటిది శైలపుత్రి. ఈ అవతారంలో పర్వతరాజు హిమవంతుని కుమార్తెగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. కుడి చేతిలో శివుడు ఆయుధమైన త్రిశూలం, ఎడమ చేతిలో కమలం పట్టుకుని ఉండే శైలపుత్రికి పులగాన్ని నైవేద్యంగా పెడతారు. 
రెండవ రోజు 
నవరాత్రుల్లో రెండోరోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తుంది అమ్మవారు. ఈ రూపంలో శ్రీ చక్రంపై ఎడమ కాలు మోపి, చెరుకు గడ, పుష్ప బాణం, ఉరితాడు, కొరడాతో ఉంటుంది. ఈరోజు పదేళ్ల లోపు ఆడపిల్లల్ని అమ్మవారి రూపంగా భావించి కొత్త బట్టలు పెట్టి పూజలు చేస్తారు. 
మూడో రోజు
మూడోరోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణా దేవిగా అలంకరించి పూజిస్తారు. అన్నపూర్ణ అంటే అన్నముతో నిండినది అని అర్థం. ఎడమ చేత్తో  బంగారు పాత్ర..కుడి చేతిలో బంగారు తెడ్డు పట్టుకుని భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో వున్న ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఆకలి బాధలు వుండవని భక్తుల విశ్వాసం. 
నాలుగో రోజు
దేవీ నవరాత్రుల్లో నాలుగో రోజు శ్రీ గాయత్రి దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు.  ఈ అవతారంలో ఐదు ముఖాలతో,  పదిచేతులతో పద్మంలో కూర్చొని భక్తులకు దర్శనమిస్తుంది అమ్మవారు. వరద, భయ ముద్రలతో, పద్మాలు, గద, అంకుశం, చర్నాకోలు, కపాలం పట్టుకుని ఉండే ఈ అమ్మవారిని జ్ఞానానికి ప్రతిరూపంగా చెబుతారు.  గాయత్రి దేవిని తలుచుకున్నా, గాయత్రి మంత్రాన్ని జపించినా బుద్ధి వికసిస్తుందని భక్తుల నమ్మకం. 
ఐదవరోజు
నవరాత్రుల్లో ఐదో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి రూపంలో దర్శనమిస్తుంది అమ్మవారు. లలితాదేవి అంటే శాంతమూర్తి.  ఈ రూపంలో కొలువైన  అమ్మవారిని పూజిస్తే..శాంత స్వభావం పెరుగుతుంది. సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీ, సరస్వతులు ఇరువైపులా ఉండే  లలితా త్రిపుర సుందరి దేవికి దద్దోజనాన్ని నైవేద్యంగా పెట్టి పూజిస్తే శారీరకంగా, మానసికంగా మంచి జరుగుతుందని పురాణాలు చెబుతాయి. 
ఆరో రోజు 
మహాలక్ష్మీ దేవిగా ఆరోరోజు భక్తులకి దర్శనమిస్తుంది అమ్మవారు. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్మిగా అమ్మవారు మహాలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. మహాలక్ష్మి రూపంలో ఉన్న అమ్మవారిని పూజిస్తే సిరిసంపదలకి లోటు ఉండదంటుంటారు. 
ఏడో రోజు
నవరాత్రుల్లో ఏడోరోజు శ్రీ సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది అమ్మవారు. సకల విద్యలకు ఆది దేవతగా వున్న సరస్వతీ దేవి ఈ అవతారంలో పద్మంలో కూర్చొని వీణ, దండ, కమండలం, అక్షరమాల ధరించి, అభయముద్రతో  దర్శనమిస్తుంది. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి.
ఎనిమిదో రోజు 
శ్రీదుర్గా దేవి అవతారంలో ఉండే అమ్మవారిని ఎనిమిదో రోజు కొలుస్తారు. ఈ రూపంలోనే అమ్మవారు ‘దుర్గముడు’ అనే రాక్షసుడ్ని సంహరించింది . ఈ రూపంలో ఉన్న అమ్మవారిని ఎర్రటి పువ్వులతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. 
తొమ్మిదో రోజు
నవరాత్రుల్లో చివరి రోజు శ్రీ మహిషాసురమర్ధిని దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు. ఎనిమిది భుజాలు.. అష్ట ఆయుధాలు... సింహవాహినిగా.. రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం. అలాగే భక్తుల మనసులోని సకల దుర్గుణాలను అమ్మవారు తీసేస్తుందని పురాణాలు చెబుతున్నాయి.