V6 News

ఆధ్యాత్మికం:   గత జన్మ యాక్షన్.. ఇప్పుడు రియాక్షన్..పుణ్య పాపాల.. కర్మ సిద్దాంతం ఇదే..!

ఆధ్యాత్మికం:   గత జన్మ యాక్షన్.. ఇప్పుడు రియాక్షన్..పుణ్య పాపాల.. కర్మ సిద్దాంతం ఇదే..!

సనాతన ధర్మంలో పుణ్య, పాపాలు కర్మ సిద్ధాంతానికి మూలం. ఇతరులకు మేలు చేయడం, సత్కర్మలు ఆచరించడం పుణ్యం వస్తుంది.. పుణ్యం సుఖాన్నిస్తుంది.  అపకారం చేయడం, దుష్టకార్యాలు చేయడం వలన  పాపం వస్తుంది. దీనివలన  దుఃఖం స్తుంది. ఈ పాప పుణ్యాలు మరణానంతరం కూడా వాసనలుగా వెంటవచ్చి, మరుసటి జన్మల ఫలితాలను నిర్ణయిస్తాయని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే కిందటి జన్మ యాక్షన్‌కు రియాక్షనే ఈ జన్మ. 

పుణ్య పాపాలగురించి చాలా మందికి అవగాహన ఉంది. పాపపుణ్యాలు క్రమంగా సత్కర్మలు ...దుష్కర్మల ఫలితమని పండితులు చెబుతున్నారు. మంచిచెడుల మధ్య తేడాను గ్రహించగలిగినప్పటికీ  మానవుడు పాపపు కర్మలలోనే నిమగ్నుమవుతున్నాడు. సాధారణంగా, మనిషి తన జీవితంలో చేసిన కర్మల వాసనలను ఆత్మ తన వెంట తీసుకువెళుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. పాప, పుణ్యాల ఫలాలను అనుభవించిన తర్వాతే ఆత్మ మళ్ళీ పునర్జన్మ పొందుతుంది.

ఒకసారి దుర్యోధనుడిని ఇలా భీష్మాచార్యుల వారు ఇలా  ప్రశ్నించారు.  మీరు రాజు.. అన్ని శాస్త్రాలను చదివారు. ధర్మమంటే ఏమిటో తెలుసు. అయినా మీరు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అప్పుడు దుర్యోధనుడు -ధర్మమంటే ఏమిటో నాకు తెలుసు. అయినా నా మనస్సు దాని వైపు మొగ్గటంలేదు. అధర్మమూ నాకు తెలుసు. కాని నా మనస్సు పాపకర్మలు ఆచరించటానికే ఇష్టపడుతోంది. అని సమాధానమిచ్చాడు.  అంటే దుర్యోధనుడు గత జన్మలో చేసిన పుణ్య కర్మల వలన రాజు అయినప్పటికి.. చెడు కర్మల ప్రభావం ఎక్కువుగా ఉండటం వలన అధర్మానికి ఆయన మనస్సు ప్రాధాన్యత ఇస్తుంది.

శ్రీకృష్ణభగవానుని మాటలను వింటున్న అర్జునుడు ...దేవా ! నీవు బోధించే విషయం తెలుస్తున్నా మనిషి ప్రవర్తన చూస్తే వింతగా అనిపిస్తోంది. అని ప్రశ్నించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ..మనిషికి తాను ఏమి చేస్తున్నాడో తెలిసి చేసినా ...ఎవరి బలవంతం మీదనో చేస్తున్నట్లు పాపపు పనులనే చేస్తుంటాడు. దానికి కారణం కూడా  శ్రీకృష్ణ భగవానుడేసమాధానం ఇచ్చారు.

కామము మరియు క్రోధము అనబడు శత్రువులు రజోగుణం వలన జన్మిస్తాయి.అవి మహా పాపిష్టమైనవి. అవే మనిషిని బలవంతంగా పాపానికి ప్రేరేపిస్తాయి. ఈ విషయాలు మనకు తెలియనివి కాదు.. కొత్త కాదు.  . అయితే మళ్ళీమళ్ళీ మనం దానిని గురించి చర్చించాలి. ఎందుకంటే మనం దానిని ఆచరణలోకి తీసుకురాలేకపోతున్నాం కదా. 

కామం, క్రోధం అనేవి ప్రతి మనిషికి బద్ద శత్రువులు. మనిషికి మొదట ఇష్టం లేకపోయినా పాపకార్యాలు చేసేటట్లు ఈ రెండూ బలపరుస్తాయి. కామక్రోధాలను అదుపులో ఉంచుకున్నట్లయితే పాపం చేయాలనే ఆలోచన కలగదు. ఏ వస్తువునైనా తీవ్రంగా కోరుకోవటం కామమైతే, ఆ వస్తువు లభించకపోతే లేదా దానిని కోల్పోతే క్రోధం వస్తుంది.

జీవుడు తన జీవ పరిణామదశలో అనేక జన్మలెత్తుతూ ఉంటాడు. మానవ జన్మలలో స్త్రీగాను, పురుషునిగాను జన్మిస్తుంటాడు.  ఇక జంతు జన్మల్లో పశు పక్ష్యాది జన్మలు కూడా ఎత్తవచ్చును. కర్మ ఫలితాలను బట్టి చర్యకు ప్రతిచర్యగా ఈ జన్మలు ఏర్పడుతుంటాయి. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే కిందటి జన్మ యాక్షన్‌కు రియాక్షనే ఈ జన్మ. 

కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం తెలిసిన వాడు రాబోయే జన్మలలో మరింత సుఖ భోగాలుండేలాగున అనేక పుణ్య కార్యాలు చేస్తాడు. మనం చేసే ప్రతి పనిలోని (కర్మ) స్పందనలు వాయు మండలంలో నిక్షిప్తమవుతాయి. వాయు మండలంలో బాధామయ స్పందనలు, ఆనందమయ స్పందనలు ఉంటాయి. దుష్కర్మల వల్ల బాధలు జనిస్తాయి. ఈరకంగా కర్మ ఫలితం చర్యకు ప్రతిచర్య రూపం దాలుస్తుంది.క్షమాగుణం కలిగిన వారు కర్మ చక్రాన్ని ఆపగల శక్తి కలిగి ఉంటారు. 

పుణ్య కర్మల చేత దేవతలుగా, మిశ్రమ కర్మలచేత మానవులుగా, పాప కర్మల చేత పశు పక్షి  క్రిమి కీటకాదులుగా పుట్టడం జరుగుతూ ఉంటుందనేది  కర్మ సిద్ధాంతం ద్వారా తెలుస్తుంది.కర్మ వల్లనే పుట్టడం, పెరగడం, మరణించడం జరుగుతోంది. కర్మయే ఈ సృష్టికి కారణమని తెలుస్తోంది. పుణ్యకర్మలు చేసిన వారు దైవ గుణాలు, పాప కర్మలు చేసే వారు అసురుల గుణాలు కలిగి ఉంటారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.