V6 News

ఆధ్యాత్మికం: శాస్త్రం చదవాలి.. అనుభవం ఉండాలి.. మహాభారతంలో ధర్మరాజు ఓటమికి కారణం ఇదేనా..!

ఆధ్యాత్మికం: శాస్త్రం చదవాలి.. అనుభవం ఉండాలి.. మహాభారతంలో ధర్మరాజు ఓటమికి కారణం ఇదేనా..!

మహాభారతంలో జూదం ఆడటంలో శకునికి ఎంత నైపుణ్యం ఉందో తెలిసిందే. శకునికి జూదానికి సంబంధించిన శాస్త్రంతో పాటు, అపారమైన అనుభవం కూడా ఉంది. కపట జూదం కూడా ఆడగల నేర్పరితనం ఉంది. కాని ధర్మరాజుకి జూదానికి సంబంధించిన శాస్త్రం తెలిసినప్పటికీ, అనుభవం లేకపోవటం వల్లే శకుని చేతిలో ఓడిపోయాడని చెబుతారు. 

విద్యను సద్గురువుల వద్ద భక్తిశ్రద్ధలతో శాస్త్ర బద్ధంగా అభ్యసించాలి. అప్పుడు ఆ విద్యను ఎప్పుడు, ఎక్కడ, ఎలా బాగా ఉపయోగించాలో తెలుస్తుంది. అలా కాకుండా తనకు తానుగా శాస్త్ర గ్రంథాలను పఠించటం వల్ల విజ్ఞానం వస్తుందే కాని, సమయానుకూలంగా ఆ విద్యను ఆచరణలో ఉంచటం తెలిసే అవకాశం ఉండదు. 

సాధారణంగా చదువుకున్నవారు మేధస్సు మీద ఆధారపడతారు. తర్కంతో, విశ్లేషణతో చూస్తారు. అలా కాకుండా, ఆలోచనా రహితంగా గుడ్డిగా శాస్త్రాన్ని అనుసరించటం వల్ల అనర్థాలు కలుగుతాయి. 
అనగనగా ఒక ఊరిలో శర్వవర్మ అనే ఒక గురువు ఉన్నాడు. ఆయన దగ్గర చదువుకునే వారిలో ముగ్గురు శిష్యులు ఉన్నారు. వారు అన్ని విద్యలూ పూర్తి చేసుకుని వారివారి ఇళ్లకు బయలుదేరారు. వెళ్లే ముందు ఆ ముగ్గురికీ మూడు ప్రత్యేకమైన విద్యలు నేర్పారు గురువుగారు. 

ఎముకలని బట్టి అది ఏ ప్రాణి అని గుర్తించే విద్య మొదటివానికి నేర్పాడు. పేర్చిన ఆకారానికి రక్తమాంసాలు అందించడం రెండో వానికి నేర్పాడు. ఆ ఆకారానికి ప్రాణం పోయడం మూడోవాడు నేర్చుకున్నాడు. గురువు ఈ ప్రత్యేకమైన విద్యను నేర్పినందుకు సంతోషించారు. అవసరమైన చోట మాత్రమే ఈ విద్యను ఉపయోగించాలని గురువు చెప్పారు. గురువుకు నమస్కరించి ఇంటిదారి పట్టారు. దారి పొడవునా కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించారు. 

మార్గమధ్యంలో ఒకచోట వారికి ఎముకలు కనిపించాయి. ఆ ఎముకలను చూసి మొదటివాడు, ‘ఇవి సింహం ఎముకలు’ అని పలికి, వాటిని ఆ ఆకారంలోకి పేర్చాడు. రెండోవాడు రక్తమాంసాలు అందించాడు. ఇక మూడోవాడు ప్రాణం పోయబోతుండగా, మిగిలిన ఇద్దరూ అడ్డుకుని, ‘ఇది సింహం, క్రూర జంతువు. నువ్వు దీనికి ప్రాణం పోస్తే, అది మనలను చంపేసే అవకాశం ఉంది. 

శాస్త్రాన్ని ఎక్కడ ఉపయోగించాలో గుర్తించాలి. నీ ప్రయత్నం మానుకో’ అన్నారు. వాడికి ఆ మాటలు నచ్చలేదు. ‘మీరంతా మీ విద్యలను పరీక్షించుకున్నారు. మరి నేను నా విద్యను పరీక్షించుకోవద్దా...’ అని పలికి, దానికి ప్రాణం పోశాడు. ఈలోగా మిగిలిన ఇద్దరూ పక్కనే ఉన్న చెట్టు ఎక్కేశారు. మూడో వాడు మాత్రం అక్కడే ఉండి, తన విద్యను పరీక్షించుకుంటున్నాడు. ఇంతలోనే ఆ సింహానికి ప్రాణం వచ్చి, వాడిని చంపేసింది. శాస్త్రజ్ఞానం ఏ సమయంలో పరీక్షించుకోవాలనేది విచక్షణతోనే తెలుస్తుందనడానికి ఈ కథ ఒక ఉదాహరణ.

ఇటువంటిదే మరొక ఉదాహరణ..

ఒక ఊరిలో ఒక వైద్యుడున్నాడు. ఒకసారి ఒక రోగి ఆ వైద్యుడి దగ్గర ఔషధం తీసుకున్నాడు. వారం రోజులు గడిచినా ఆరోగ్యం కుదుటపడకపోవటంతో వైద్యుడు ఆ రోగి ఇంటికి వెళ్లాడు. ‘ఏమయ్యా నువ్వు వేరుశనగ కాయలు తింటుంటే, నా మందు ఎలా పనిచేస్తుంది’ అన్నాడు. వైద్యుడి వెంట వచ్చిన అతని కొడుకు, తండ్రితో, ‘నాన్నా! ఈ విషయం నీకు ఎలా తెలిసింది’ అన్నాడు. ‘రోగి మంచం కింద వేరుశనగకాయ తొక్కలున్నాయి. అవి చూసి అర్థం చేసుకున్నాను’ అని సమాధానమిచ్చాడు.

 ఆ తరువాత కొన్నాళ్లకు అతని కొడుకు కూడా వైద్యం చేయటం ప్రారంభించాడు. రోగికి తాను ఇచ్చిన మందు పనిచేయకపోవటంతో తండ్రిలాగే ఆ రోగి ఇంటికి వెళ్లి, ‘నువ్వు బొగ్గులు తింటుంటే రోగం ఎలా తగ్గుతుంది’ అన్నాడు. ఇంటికి వచ్చి ఈ విషయం తండ్రికి చెప్పాడు. ‘బొగ్గులు ఎలా తింటాడు’ అని ప్రశ్నించాడు తండ్రి. ‘రోగి మంచం కింద బొగ్గుల కుంపటి ఉంది’ అని చెప్పాడు కొడుకు. ‘శాస్త్రం చదివితే చాలదు, అనుభవం కూడా ఉండాలి. చలి కాచుకోవటానికి కింద బొగ్గుల కుంపటి పెట్టారు’ అని చెప్పాడు తండ్రి.

 –డా. పురాణపండ వైజయంతి–

మీరూ లైఫ్​కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతోపాటు
featureseditor@v6velugu.com కి మెయిల్​ చేయండి
.