ఆధ్యాత్మికం :  ఆత్మకు మరణం లేదు.. శరీరం  మారుతుంది.. కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన రహస్యం ఇదే..! 

ఆధ్యాత్మికం :  ఆత్మకు మరణం లేదు.. శరీరం  మారుతుంది.. కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన రహస్యం ఇదే..! 

మానవుడు ఆనంద స్వరూపుడైన భగవంతునికి ప్రతిరూపం. ఆనంద స్వరూపుడైన మనిషి ఆనందంగా ఉండాలి కాని, దానికి భిన్నంగా ఉండటం అసహజం. మనిషికి బ్రతుకులో ఎన్నో సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అన్నింటినీ సమానంగా స్వీకరించితే ఉండేది ఆనందమే. 

 ఎందుకో గాని మనిషి ఎన్నో సందర్భాలలో దుఃఖపడుతూ ఉంటాడు. అది సహజ లక్షణం కాదు. సహజత్వంలో సుఖం ఉంటుంది. అయితే మనిషి తన సహజ లక్షణాన్ని మర్చిపోయి, ప్రపంచంలో ఉన్న దుఃఖభారం అంతా తానే మోస్తున్నట్టు ఆయాస పడిపోతూ ఉంటాడు. 

యుద్ధం చేయటానికి భయపడి, వణికిపోతున్న అర్జునుడికి సహజ లక్షణాన్ని గుర్తు చేశాడు శ్రీకృష్ణుడు. పైగా ప్రస్తుతం ఉన్న స్థితి కూడదు అని నిశ్చయంగా చెప్పాడు. ఎందుకు ఏడవకూడదో కారణాలని కూడా సహేతుకంగా వివరించాడు. ఒక శతకానికి ఉన్న మకుటంలాగా కొన్ని శ్లోకాల చివర ఒకే విషయం మరీ మరీ నొక్కి పక్కాణించటం జరిగింది. మరెక్కడా ఈ విధంగా చెప్పలేదు. అంటే 'బాధ పడే అధికారం లేదు' అన్నమాటకి ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. 'నాను శోచితుమర్హసి', 'నైవం శోచితు మర్హసి', 'సత్వం శోచితు మర్దసి' అంటూ ఎన్నోసార్లు

'నీకు శోకించే అధికారం లేదు' అని తీర్పు చెప్పాడు శ్రీ కృష్ణుడు..ఒక పని చేయటానికి మనిషికి కొన్ని అర్హతలు ఉంటాయి. అటువంటి వాటిల్లో శోకించటానికి ఏ అర్హతా, అధికారం లేదు మనిషికి, శోకం మనిషిని క్రుంగదీస్తుంది. అప్పుడు మనస్సు, శరీరం తమ శక్తిని పరిపూర్ణంగా వ్యక్తం చెయ్యలేవు. పనిలో సమర్ధత దెబ్బతింటుంది. మనస్సు ఒత్తిడికి లోనవుతుంది. ఉత్సాహం నశిస్తుంది. వినాళ గ్రంథుల నుండి స్రవించే హార్మోనులు' మనస్సుని నిరాశా నిస్పృహలకి లోనుచేస్తాయి. 

సంతోషంగా ఉండి చేసిన పని త్వరగా ఫలిస్తుంది. మానసిక వత్తిడి లేకపోవటం వల్ల సునాయాసంగా పని చెయ్యటం ఉంటుంది. పైగా జ్ఞానంతో, అంటే తెలిసి చేస్తే బాధ పడటానికి ఏమీ ఉండదు. అందుకని ముందు ఆ విషయాన్ని తెలియచేస్తాడు శ్రీ కృష్ణుడు. 

శరీరం అన్నది ఆత్మ ధరించే వస్త్రం వంటిది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే మనిషి నివాసం ఉండే ఇల్లు వంటిది. ఆత్మని ధరించి కాపాడే పురం వంటిది. "పురే శేతే ఇతి పురుష్క" అని పురుష శబ్దానికి వ్యుత్పత్తి కనుక 'తాను', 'తన శరీరం' ఒకటి కాదు అనే సత్యం గుర్తు చేయటం జరిగింది. 

అర్జునుడు శరీరం పోతుందేమోనని భయపడవలసిన అవసరం లేదు. ఇది వంటపడితే తన కర్తవ్యాన్ని నిర్వర్తించటంలో ఎవరూ వెనుకాడరు. ఈమాత్రం అర్జునుడికి తెలియదని కాదు. పిరికితనం అనే పొర, మమకారం అనే ముసుగు వేసుకుని వచ్చి అర్జునుడి వివేకాన్ని కప్పి వేసింది. దాన్ని తొలగించటమే శ్రీకృష్ణుడు చేసిన పని.

ఆత్మ శాశ్వతం.. దానికి చావుపుట్టుకలు లేవు. ఎటువంటి మార్పుని పొందదు. ఇది అర్థం కావటానికి మంచి పోలిక చెపుతాడు మంచి ఉపాధ్యాయుడు అయిన కృష్ణుడు.   శరీరం ఆత్మధరించిన వస్త్రం వంటిది కనుక కట్టుకున్నది పాతపడి, వెలిసిపోయి, చిరిగిపోతే దానిని వదిలి. ఇంకొక దానిని కట్టుకుంటాడు తెలివైనవాడు. అంతే కాని, పాతదానిని పట్టుకుని పాకులాడడు. ఉన్నది వదిలితే కొత్తది వస్తుంది. కనుక శోకించవలసిన పని లేదు అంటాడు కృష్ణుడు. 

ఒకవేళ ఈ జననమరణాలు ఆత్మకి ఉన్నాయి అని అనుకున్నా... పుట్టిన ప్రతిదీ గిట్టక తప్పదు. ఈ ప్రకృతి నియమాన్ని ఎవరూ ఉల్లంఘించలేరు. అప్పుడు కూడా శోకించవలసిన పని లేదు అంటాడు కృష్ణుడు. ఈ ప్రాణులన్నీ పుట్టటానికి ముందు కంటికి కనపడవు, చనిపోయాకా కనపడవు. జనన మరణాల మధ్య మాత్రమేమన చర్మచక్షువులకి కనపడతాయి. ఇట్లా కనపడి, అట్లా మాయమయ్యే ఈ జీవుల గురించి శోకించవలసిన పని లేదు అంటాడు కృష్ణుడు.

 నిజమే కదా...ఈ ఆశ్చర్యకరమైన శాశ్వతసత్యాన్ని గుర్తించే మహానుభావులు చాలా స్వల్పంగానే ఉంటారు. చెప్పేవాళ్లు. వినేవాళ్లు ఉంటే ఉంటారు, కాని, వాళ్ళకి దీని గురించి మాత్రం తెలియదు.
ఆత్మ అనేది ప్రతి జీవిలోనూ ఉంటుంది. శాశ్వతమైనది. అది వధించబడదు. కనుక శోకించవలసిన పని లేదు అంటాడు కృష్ణుడు. 

నిజానికి అర్జునుడికి పిరికితనం రావటానికి కారణం తాను చనిపోతానేమో అన్న భయంతో పాటు, తనవారు చనిపోతారేమోనన్న భయం. మరణం ఎవరిదైనా అది వారి శరీరానికే కాని, ఆత్మకి కాదు అని అశ్వాసన కలిగిస్తున్నాడు శ్రీ కృష్ణుడు, ఎదుటి పక్షంలో ఉన్న తన బంధువులు, మిత్రులని చంపి నెత్తుటికూడు తినటం అవసరమా? అని కదా అర్జునుడు ముందు అన్నది. 

కనుక బంధుమిత్రులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినా, అది శరీరం వదలటం మాత్రమే. వారి ఆత్మ చంపబడడు. అది శాశ్వతం. కనుక అర్జునుడు తన వల్ల వారందరు చనిపోయారు అని శోకించ వలసిన పని లేదు అంటాడు కృష్ణుడు.

ఒక్కక్షణం కొంచెం ఆలోచిస్తే ఎవరికైనా తేలికగా అర్ధం అవుతుంది. మనం దేనికోసం శోకించాలి? ఏదైనా శాశ్వతంగా ఉండదు. క్షణంక్షణం మారటం సహజం. పెద్దమార్పు ఈ శరీరం వదలి మరో శరీరం ధరించటమే. మార్పు వల్ల మంచి జరుగుతుంటే బాధ దేనికి? బాధపడనక్కర లేదు అని చెప్పలేదు. భగవానుడు. బాధపడటానికి అధికారం లేదు అన్నాడు. అధికారం లేని పని చేయకూడదు కదా.కాస్త ఆలోచించండి. మనం ఎందుకు శోకించాలి ?

–వెలుగు,లైఫ్​–