జై శ్రీరాం: రాముడుకి పూజలు చేస్తే చాలదు.. ఆచరించమన్నది ఇదే.. !

జై శ్రీరాం: రాముడుకి పూజలు చేస్తే చాలదు.. ఆచరించమన్నది ఇదే.. !

పన్నెండు నెలలు కౌసల్యాదేవి గర్భంలో ఉండి చైత్రమాసం శుక్లపక్ష నవమినాడు మధ్యాహ్నం వేళ ఈ లోకానికి వచ్చిండు శ్రీరామచంద్రుడు. ఆయన కల్యాణం కూడా అదే రోజున సీతమ్మతో జరిగింది. మానవ అవతారంలో వచ్చి.. మనిషి కీర్తి ప్రతిష్టలు దశదిశలా చాటినవాళ్లు సీతారాములు!

మనిషి ఎట్లాంటి గుణసంపదతో జీవించాలో ఎన్నో ఏళ్ల కిందే ఆచరణాత్మకంగా చేసి చూపించినవాళ్లు సీతారాములు. అందుకే చైత్ర శుద్ద  నవమి శ్రీరామనవమి అయింది. ప్రతి ఊరిలో వాళ్ల పెళ్లి జరిపించడం తరతరాల ఆచారమైంది.

ఉగాది తర్వాత ఎనిమిది రోజులకు  వచ్చే తిథి శ్రీరామ నవమి. అప్పటికే ప్రకృతి మల్లెపూల సువాసనలతో, కమ్మని మామిడి పండ్ల రుచులతో నిండిపోతది. అందరికీ ఇష్టమైన, ఆహ్లాదకరమైన.. ఆ వాతావరణంలో ప్రతి ఊళ్లో సీతారాముల కల్యాణం కన్నులపండుగగా జరుగుతది.

ఆయన ఎన్నడూ దుఃఖించలే.. 

విష్ణుమూర్తి దశావతారాల్లో రామావతారం విశిష్టమైంది. దేవుడు ప్రతి అవతారంలో తన లీలలు
 (సూపర్ పవర్స్) చూపించిండు. లక్ష్మీదేవి కూడా అంతే! సీతారాములు మాత్రమే మనుషుల్లా పుట్టి.. మనుషుల్లాగే పెళ్లి, సంసారం వంటి అన్ని కర్మలు ఆచరించినరు.

మానవుడు ఎంత ఉన్నతంగా జీవించవచ్చో ఆచరణాత్మకంగా చూపించినరు. రాముడు ఎన్నడూ దుఃఖించలేదు. దుఃఖించినట్టు కనబడ్డడు అంతే! ఎందుకు ఆయన అంత సంతోషంగా ఉన్నడు? ఎప్పుడైనా ధర్మాన్ని విడిచి పెడితే.. ఆ రోజు ఆయన రోదించాలి. కానీ.. ఆయన చివరి శ్వాస వరకు ధర్మాన్ని విడిచిపెట్టలేదు. జీవిత ప్రయాణంలో ఎప్పుడు ఏ ధర్మాన్ని ఆచరించాలో ఆ ధర్మాన్ని ఆచరించిండు. ధర్మంగా నడిచినన్ని నాళ్లు తనకు అవిజయం లేదని విశ్వసించిందు..

రెండు కాండలు ఉండేవి కాదు

రాముడు ధర్మాన్ని విడిచిపెట్టి ఉంటే.. రామాయణంలో సుందర కాండ, యుద్ధ కాండలు ఉండేవి కాదు. కేవలం తన భార్య సీతని తిరిగి పొందడమే ఆయన ప్రయోజనం అయితే.. సుగ్రీవునితో కాకుండా వాలితో స్నేహం చేసేటోడు. వాలి చిటికేస్తే... రావణాసురుడు సీతమ్మని తీసుకొచ్చి రామునికి అప్పగిస్తుంది.. వాలి అంటే రావణుడికి అంత భయం!

అధర్మ మార్గంలో నడుస్తున్న వాలితో సంధి చేసుకుని.. ఆధర్మంగా తన భార్యను పొందడం. కన్నా, ధర్మంతో వాలి తమ్ముడు సుగ్రీవునితో స్నేహం చేసి.. అతనికి ఉపకారం చేసి వాలిని సంహరించి... సుందరకాండ, యుద్ధకాండ దాటిన తర్వాత.. రావణ సంహారం చేసి సీతమ్మను పొంది ధర్మంగా ముందుకు నడిచిండు. ధర్మాన్ని అనుసరించినవాడు తిరుగులేని విజయం పొందుతడు. కాలంతో సంబంధం లేకుండా.. వాళ్ల జీవిత కథ చరిత్రలో నిలిచిపోతది. ధర్మాన్ని లోకానికి చాటి చెప్పిన కథే రామాయణ కథ.

పూజలు చేస్తే చాలదు

'మాకు గుళ్లు కట్టాలి. భూగోళం ఉన్నంతకాలం ఈ మనుషులు మాకు పూజలు చెయ్యాలి అని చెప్పి పోయినరా సీతారాములు? ఇది చెప్పడానికేనా వాళ్లు ఈ లోకానికి వచ్చింది" "మనిషి ఇలా ఉండాలి.. ఇలా ప్రవర్తించాలి... ఇలా చెయ్యాలి' అని వాళ్లు ప్రాక్టికల్​ గా ప్రబోధించినరు. మనిషి పవర్​ ని చూపించినరు. మనిషి అంటే ఏంటి? మానవత్వపు విలువ ఏంటి? మనిషిలో ఉండాల్సిన గుణాలు ఏంటి? భర్త దగ్గర ఎలా ఉండాలి? భార్య దగ్గర ఎలా ఉండాలి? తమ్ముడి దగ్గర ఎలా ఉండాలి? నాన్న దగ్గర ఎలా ఉండాలి? అమ్మ దగ్గర ఎలా ఉండాలి? అని చెప్పినరు.

కొడుకు ఎలా ఉండాలి? కోడలు ఎలా ఉండాలి? అసలు మనిషి ఎలా ఉండాలో చూపించినరు సీతారాములు. భక్తులమని చెప్పుకునేటోళ్లు.. బొట్టు పెట్టుకుని.. కొబ్బరి కాయలు కొడితే సరిపోదు. వాళ్లు భక్తులుగా మారినందుకు ఆ దేవుళ్లు. నడిచిన దారిలో నడవాలె. వాళ్లు చేసిన ఉపకారం చేతనైనంత మందికి చెయ్యాలె.. మరి ఇప్పటి నుంచైనా రాముని అడుగు జాడల్లో నడిచేందుకు ప్రయత్నిద్దాం. . .!