ఉల్లి గడ్డకి పెద్ద కథ ఉంది తెలుసా?

 ఉల్లి గడ్డకి పెద్ద కథ ఉంది తెలుసా?

ఉల్లి గడ్డకి పెద్ద కథ ఉంది తెలుసా! ఉల్లిగడ్డకి కథేంటి? అంటున్నారా. అయితే ఇది వంటలకు సంబంధించిన కథ కాదు. ఈ కథ వేరే. మన దగ్గర ఉల్లిగడ్డను ఎలా వాడతారో అందరికీ తెలుసు. మరి వేరే దేశాల్లో కూడా మనలాగే వాడతారా? అసలు మనకు దొరికే ఉల్లిగడ్డలు వాళ్లకు దొరుకుతాయా?ఇట్లనే బోలెడు సందేహాలు వస్తున్నాయి కదా. అవి తెలుసుకోవాలంటే ఈ విశేషాలు చదవాల్సిందే. 
ఉల్లిగడ్డల్లో రంగులు, రకాలు చాలా ఉన్నాయి. అలానే ఆయా రకాలతో పాటు వాటి వాసన, రుచి కూడా ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది! మరి అలాంటి ఉల్లిగడ్డలు ఏమేం ఉన్నాయో చూద్దాం. పసుపు లేదా గోధుమ రంగు ఉల్లిగడ్డలు గుండ్రంగా గోధుమ రంగు పొరతో ఉంటాయి. ఈ రకం అమెరికాలో ఎక్కువగా దొరుకుతాయి. వీటిలో కొన్ని పొడవుగా ఉండి, కాస్త తీపిగా ఉంటాయి. వాటిని స్పానిష్​ ఆనియన్స్ అంటారు. ఇవి చాలా పాపులర్ అక్కడ. వీటిని రకరకాల వంటల్లో వాడతారు. అదే భారతదేశంలో అయితే వేపుళ్లకు, ఇటాలియన్ రెడ్ సాస్, స్పానిష్​ పెల్లా వంటి వాటి తయారీలో వాడతారు. ఈ ఉల్లిగడ్డలతో చేసే కేరామిలైజ్డ్ ఆనియన్ రెసిపీకి ఫ్యాన్స్​ ఎక్కువ.

ఎరుపు లేదా ఊదా రంగు ఉల్లిగడ్డల్ని సలాడ్స్, పచ్చళ్లలో ఎక్కువగా వాడతారు. ఆగ్నేయాసియా దేశాలైన ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్​లో ఈ రకం ఉల్లిగడ్డల వాడకం ఎక్కువ. సంప్రదాయ వంటల్లో రెగ్యులర్​గా వాడతారు. వీటిని తరుగుతుంటే కళ్లలో నీళ్లు వచ్చేంత ఘాటు ఉంటుంది. 

తెలుపు రంగు ఉల్లిగడ్డలు ఎరుపు, పసుపు ఉల్లిగడ్డల కంటే ఘాటు తక్కువ. సెంట్రల్ అమెరికా వంటల్లో పచ్చి ఉల్లిగడ్డ రసాన్ని గార్నిషింగ్​ కోసం వాడతారు. మరీ ముఖ్యంగా మెక్సికన్​ ఫుడ్​లో వీటివాడకం తప్పనిసరి. అలాగే సల్సా, గ్వకమోల్ వంటి రా సాస్​ ప్రిపరేషన్​లలో దీన్ని ఉపయోగిస్తారు.
తియ్యని ఉల్లిగడ్డల కేటగిరీలో మూడు పాపులర్​ వెరైటీలు ఉన్నాయి. అవి విడలియా, వాల్లా వాల్లా, మాయు. ఇవి తియ్యగా ఎందుకు ఉంటాయంటే... వీటిలో సల్ఫర్ గాఢత తక్కువ ఉండటం వల్ల. ఇవే కాకుండా బెర్ముడా ఆనియన్స్, స్వీట్ ఇంపీరియల్, టెక్సాస్ స్ప్రింగ్ స్వీట్ వంటి రకరకాల తీపి ఉల్లిగడ్డలు ఉన్నాయి. వీటిని పచ్చిగానే తినేయొచ్చు. అయితే ఈ రకం వాటిని ఎక్కువగా కేరమిలైజ్డ్, సూప్, లైట్ ఫ్రైల్లో వాడతారు. ఈ ఉల్లిగడ్డలను రింగులుగా తరిగి, భోజనంలో తింటుంటారు చాలామంది. 

స్కాలియన్స్ రకం ఉల్లిగడ్డల్ని గ్రీన్, స్ప్రింగ్, బంచింగ్, చైనీస్, వెల్ష్ ఆనియన్స్ వంటి పేర్లతో పిలుస్తారు. వీటిని వాడుకలో ఉల్లి పొరక అంటారు. వీటిలో ఆకులు పొడవుగా ఉండి, ఉల్లిగడ్డ చిన్నగా ఉంటుంది. తూర్పు ఆసియా వంటకాల్లో వీటి వాడకం ఎక్కువ. 
షాలట్స్ ఉల్లిగడ్డల్ని గ్రే లేదా రెడ్ షాలట్స్ అని కూడా అంటారు. ఇవి తియ్యగా ఉంటాయి. కానీ, వీటి వాసన కాస్త వెల్లుల్లిలా ఉంటుంది. ఆగ్నేయాసియాలో దాదాపు ప్రతి వంటలో వీటిని వాడతారు. 
పర్ల్ అనియన్స్... వీటినే వైట్ కాక్​టైల్ ఆనియన్స్ అని కూడా అంటారు. ఇవి చాలా చిన్నగా ఉంటాయి. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయి. ఇవి కూడా తియ్యగానే ఉంటాయి. వీటిని సూప్, క్రీమ్​ల్లో వాడతారు. వీటితో నిల్వ పచ్చళ్లు పెట్టుకుంటారు. 

ర్యాంప్స్.. వీటిని టెన్నెస్సె ట్రఫుల్స్, వైల్డ్ లీక్స్, రామ్సన్, ఎయిల్ డెస్ బయోస్ వంటి పేర్లతో పిలుస్తారు. ఇవి నార్త్ అమెరికాలో పెరుగుతాయి. వీటి ఆకులు, కాండం, బల్బ్ వరకు అన్నీ తినగలిగినవే. వీటిని పచ్చిగా తింటే వెల్లుల్లిలా ఘాటుగా అనిపిస్తుంది. వండితే దీని ఫ్లేవర్ కొంచెం తియ్యగా మారుతుంది. 
సిపొల్లిన్ లేదా ఇటాలియన్ పర్ల్ ఆనియన్స్ అనేవి మరో రకం ఉల్లిగడ్డలు. వీటిని సైడ్​ డిష్​ల్లో వాడతారు. ఇవి చిన్నగా ఉంటాయి. కాబట్టి త్వరగా ఉడుకుతాయి. వీటిని తరగకుండా డైరెక్ట్​గా వండొచ్చు.

లీక్స్ .. ఇవి చూడ్డానికి ఉల్లిగడ్డ ఆకారంలోనే ఉండవు. ఉల్లిపొరకలా ఉంటాయి. అయితే, వీటి ఆకులు పెద్దవిగా ఉంటాయి. ఇవి ఇసుక నేలల్లో పెరుగుతాయి. 
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచవ్యాప్తంగా రకరకాల ఉల్లిగడ్డలు ఉన్నాయి. ఇలాంటి వెరైటీ ఉల్లిగడ్డలతో వంటలు చేయాలనుకుంటే పెద్ద పెద్ద సూపర్​ మార్కెట్స్​, ఆన్​లైన్​ స్టోర్స్​లలో దొరుకుతాయి.