బీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గర రూ.4.8 కోట్లు పట్టివేత

బీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గర రూ.4.8 కోట్లు పట్టివేత

కర్ణాటకకు చెందిన బీజేపీ అభ్యర్థి  కె సుధాకర్ పై లంచం కేసు నమోదు చేసింది ఎన్నిక‌ల సంఘం.  చిక్కబళ్లాపుర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని యలహంకలోని ఓఇంట్లో ఎన్నికల కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు రూ.  4.8 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.  ఈ మొత్తం కూడా కే సుధాకర్‌కు చెందినవిగా భావించి మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయనపై ప్రజా ప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 123, 171 కింద మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది.  

గోవిందప్ప అనే వ్యక్తికి చెందిన నివాసంలో అధికారులు జరిపిన సోదాల్లో కట్టలకొద్దీ దొరికిన రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. తదనంతరం గోవిందప్పను విచారించగా ఆ డబ్బు కే సుధాకర్‌కు చెందినవిగా తేలడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఇతర గిఫ్ట్ ఆర్టికల్స్‌తో కూడిన మొత్తం రూ.50 కోట్ల వస్తువులను ఎన్నికల సంఘం జప్తు చేసింది. 

ఈ ఎన్నికల్లో కే సుధాకర్.. చిక్‌బళ్లాపుర లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. గతంలో బసవరాజ్ బొమ్మై మంత్రివర్గంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు.  కాగా  కర్నాటకలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.  మొదటి దశ పోలింగ్ ఈ రోజు (ఏప్రిల్ 26న)ముగియగా.  రెండో దశ పోలింగ్ మే 7న మొత్తం 28 నియోజకవర్గాల్లో జరగనుంది.