ముంబై: తన విదేశీ విద్యకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న ఆరోపణలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఫౌండర్ అభిజిత్ దీప్కే క్లారిటీ ఇచ్చారు. అమెరికాలో తన చదువు కోసం బోస్టన్ యూనివర్సిటీ స్కాలర్‌షిప్ ద్వారా నిధులు సమకూరాయని తెలిపారు. అలాగే , కొంత ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నానని.. ఆ లోన్ ఇంకా చెల్లించాల్సి ఉందని వివరణ ఇచ్చాడు. ఈ మేరకు తన స్కాలర్ షిప్ లెటర్‌ను అభిజిత్ మీడియాకు చూపించారు. కుటుంబ ఆదాయంతో కాకుండా పక్కదారిలో వచ్చిన డబ్బుతో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాడని తనపై వచ్చిన ఆరోపణలను ఈ సందర్భంగా అభిజిత్ తీవ్రంగా ఖండించాడు.
దీప్కే విదేశీ విద్యకు డబ్బెక్కడిది..?
కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటుతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన అభిజిత్ దీప్కే విదేశీ చదువుకు డబ్బు ఎలా సమకూరిందనే విషయంపై విచారణ జరిపించాలని సూరత్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దీప్కే తండ్రి భగవాన్ రావు దీప్కే ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేశారని తివారీ పేర్కొన్నారు.
విశ్రాంత ఉద్యోగికి తన కొడుకును విదేశాల్లో చదివించేంత సొమ్ము ఎలా సమకూరిందనే విషయంపై సమగ్ర విచారణ జరపాలని తన లేఖలో కోరారు. భగవాన్‌రావు దీప్కే ఆర్థిక పరిస్థితిని, ఆయన కొడుకు విదేశాలలో అభ్యసించిన ఉన్నత చదువుల ఆర్థిక వనరులను పరిశీలించాలన్నారు.
ఈ విషయంపై ట్యాక్స్ అధికారులకూ తివారీ ఓ లేఖ రాశారు. రాజకీయ పార్టీ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సీజేపీ.. నిధులు సేకరించవచ్చా అని ఆయన ప్రశ్నించారు. సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ప్రకటించిన కోటి రూపాయల లీగల్ డిఫెన్స్ ఫండ్‌పై కూడా ఎంక్వైరీ చేయాలని ఈసీని, ట్యాక్స్ అధికారులను తివారీ కోరారు. ఈ నేపథ్యంలో ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ ఆరోపణలకు అభిజిత్ దీప్కే పై విధంగా కౌంటర్ ఇచ్చారు.
