Balakrishna: బాలయ్య త్వరగా కోలుకోవాలని డైరెక్టర్ హోమం.. కాటేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

Balakrishna: బాలయ్య త్వరగా కోలుకోవాలని డైరెక్టర్ హోమం.. కాటేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) షూటింగ్‌లో గాయపడిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయనకు మోకాలి సర్జరీ విజయవంతంగా పూర్తైంది. ప్రస్తుతం శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న బాలకృష్ణ, త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ నటిస్తున్న ‘NBK111’ చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని ఆయన ఆరోగ్యం కోసం ప్రత్యేక హోమం నిర్వహించారు. బాలకృష్ణ త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బెంగళూరులో ప్రత్యేక హోమం

డైరెక్టర్ మలినేని గోపీచంద్.. బెంగళూరులోని హుస్కూర్ సమీపంలోని కంబళిపురలో ఉన్న కాటేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలకృష్ణ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని కోసం ప్రత్యేక హోమం జరిపించారు. ఈ పూజా కార్యక్రమంలో సుమారు 18 మంది వేద పండితులు పాల్గొనగా, కొందరు బాలకృష్ణ అభిమానులు కూడా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు సమాచారం. వైద్యుల సూచన మేరకు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆయన మళ్లీ షూటింగ్‌లో పాల్గొననున్నారు.

కోలుకుంటున్న బాలకృష్ణ..

ఇటీవల రాజమండ్రిలో ‘NBK111’ చిత్ర షూటింగ్ సందర్భంగా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా బాలకృష్ణ మోకాలికి గాయమైంది. అనంతరం హైదరాబాద్‌లోని AIG ఆసుపత్రిలో ఆయనకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యులు తెలిపినట్లు సమాచారం. త్వరలోనే బాలకృష్ణ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారని తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు బాలకృష్ణ కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోనున్నారు. అయితే, తనకు సంబంధించిన సీన్స్ మినహా మిగిలిన షూటింగ్‌ను కొనసాగించాలని చిత్రబృందానికి సూచించినట్లు సమాచారం.

బ్రాహ్మణి అప్‌డేట్

 సర్జరీ అనంతరం బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు శుభవార్త తెలిపారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైందని, బాలకృష్ణ త్వరలోనే పూర్తి ఉత్సాహంతో తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారని ఆమె వెల్లడించారు. తమ కుటుంబానికి అండగా నిలిచి ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

‘NBK111’పై భారీ అంచనాలు

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘NBK111’ ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, మంచు మనోజ్ కీలక పాత్రలు  పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కోలుకున్న వెంటనే సినిమా షూటింగ్ మళ్లీ పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది.