భట్టి వర్సెస్ మంత్రులు : ప్రతి మాటకు కౌంటర్లు

భట్టి వర్సెస్ మంత్రులు :  ప్రతి మాటకు కౌంటర్లు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో పల్లె, పట్టణ ప్రగతిపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్కపై అధికార పక్షం విరుచుకుపడింది. ఆయన మాట్లాడిన ప్రతి మాటకు మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్‌‌‌‌ ఇచ్చారు. స్పీకర్‌‌‌‌ కూడా పదే పదే భట్టి మైకును కట్ చేసి, అధికార పక్ష సభ్యులకు అవకాశమిచ్చారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూనే భట్టి తన ప్రసంగం కొనసాగించారు. ‘గ్రామ జ్యోతి’ స్కీమ్ ప్రకటించి, ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

 ‘‘పల్లె ప్రగతి పేరిట సర్పంచులతో బలవంతంగా పనులు చేయించారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు” అని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో సర్పంచుల ఆత్మహత్యలపై పత్రికల్లో వచ్చిన వార్తలను ఉదహరించారు. అయితే వార్తలను ఆధారంగా చేసుకుని మాట్లాడడం సరికాదంటూ భట్టి ప్రసంగాన్ని మంత్రి వేముల ప్రశాంత్‌‌రెడ్డి అడ్డుకున్నారు. ‘‘మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకట్రెండు పత్రికలు వార్తలు రాస్తాయి. వాటిని పట్టుకుని బాధ్యత లేకుండా భట్టి మాట్లాడుతున్నారు. భట్టి క్షమాపణలు చెప్పాలి” అని డిమాండ్ చేశారు. 

అయితే పత్రికల్లో వచ్చినవే అబద్ధాలు అంటే ఎట్ల? అని భట్టి ప్రశ్నించారు. సర్పంచులను పిలిపించి మాట్లాడితే, వాళ్ల బాధేంటో సర్కార్ కు తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా మానకొండూర్ నియోజకవర్గం సోమారంపేట సర్పంచ్‌‌ ఆనంద్‌‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాశగూడెం సర్పంచ్ అజారుద్దీన్, వికారాబాద్ జిల్లా యాలాల మండలం తిమ్మాయిపల్లి సర్పంచ్ అపర్ణ ఆత్మహత్యలను సభలో ప్రస్తావించారు. ఈ క్రమంలో భట్టి ప్రసంగానికి మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అడ్డుతగిలారు. ‘‘ఆనంద్‌‌రెడ్డి అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. బిల్లులు రాకపోవడం వల్ల కాదు. భట్టి పాదయాత్రలో నడిచి నడిచి అసలు విషయం మర్చిపోయినట్టున్నారు. ఆయన తన మాటను వెనక్కి తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు. స్పీకర్ కల్పించుకుని చిన్న చిన్న ఉదాహరణలు పట్టుకుని అలా మాట్లాడొద్దని, తన మాటను వెనక్కి తీసుకోవాలని భట్టికి సూచించారు. ‘‘ఆరోగ్య పరిస్థితికి తోడు.. లక్షల్లో బిల్లులు పెండింగ్‌‌ పెట్టడంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆనంద్ రెడ్డి చనిపోయారు. ఒకవేళ పత్రికల్లో వచ్చిన వార్త అబద్ధమైతే, నా మాటను వెనక్కి తీసుకుంటాను” అని భట్టి చెప్పారు.  

31 వేల కోట్లు ఖర్చు చేసినం: ఎర్రబెల్లి 

భట్టి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని, ట్రాక్టర్‌‌‌‌తో ఒక్కో సర్పంచ్‌‌ రూ.20 లక్షలు సంపాదించి గ్రామాలను అభివృద్ధి చేసుకుంటున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు అన్నారు. ‘‘గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పదేండ్లలో రూ.4 వేల కోట్లు ఖర్చు పెడితే.. మా ప్రభుత్వం 9 ఏండ్లలో రూ.31 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇవన్నీ తెలుసుకోకుండా మాట్లాడితే ఎట్ల. నీకైనా నువ్వు మాట్లాడేది తృప్తి అనిపిస్తందా?’’ అని భట్టిని ప్రశ్నించారు. అయితే దయాకర్‌‌‌‌ మాటలను పట్టించుకోని భట్టి.. సర్పంచులకు నిధులు విడుదల చేసి, వారిని ఆదుకోవాలని కోరి ఆ అంశాన్ని అక్కడితో ముగించారు. బీసీ జనగణన గురించి సభలో తీర్మానం చేయాలని భట్టి కోరగా, ఇదివరకే తీర్మానం చేసి పంపించామని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. పాదయాత్రతో భట్టి అన్ని మర్చిపోతున్నారని విమర్శించారు. కాగా, బీసీ జనగణన గురించి కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని భట్టి కోరగా.. ‘మీ రాహుల్ గాంధీని చేయమనండి’ అంటూ అధికార పక్ష సభ్యులు కౌంటర్ వేశారు.

మీ పార్టీకి క్లారిటీ లేదు: కేటీఆర్ 

పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాల పేరుతో పేదల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని భట్టి మండిపడ్డారు. అలా లాక్కోవడానికి బదులు, అవసరమైన చోట భూసేకరణ చేపట్టాలని సూచించారు. కొన్ని చోట్ల భూముల్లేక వాగుల్లో ‘క్రీడా ప్రాంగణం’ అని బోర్డులు పెట్టారని చెబుతూ.. ఉదాహరణగా కొన్ని ఫొటోలను కూడా చూపించారు. ఆ టైమ్ లో ‘వాగుల్లో కూడా ఆడుకోవచ్చు’ అంటూ అధికారపక్ష సభ్యులు కౌంటర్ ఇచ్చారు. ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ కల్పించుకుని.. భట్టి పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘పనులు చేయలేదని, బిల్లులు ఇవ్వట్లేదని, భూములు గుంజుకుంటున్నరని అంటున్నరు. పనులు చేయనప్పుడు, బిల్లుల ప్రస్తావన ఎందుకొస్తది. ఏదో ఒక క్లారిటీకి రండి. మీకు క్లారిటీ లేదు. 

మీ పార్టీకి క్లారిటీ లేదు. మీకు ఫ్రస్టేషన్. మీరు ఇక్కడ ఉంటే, గాంధీభవన్‌‌లో ఉన్నవాళ్లు మీ వెనకాల గోతులు తవ్వుతున్నరు. మీ బాధ నాకు అర్థమైంది. మరీ ఇంత కన్ఫ్యూజ్ అయితే ఎలా? అభివృద్ధి చేశామో.. చేయలేదో ఏదో ఒకటి చెప్పండి” అని అన్నారు. భట్టి స్పందిస్తూ.. ‘‘మీ ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదు. నిధులు కూడా కేటాయించడం లేదు. కేంద్రం ఇచ్చే ఉపాధి నిధులు ఇస్తామని చెప్పి సర్పంచులతో పనులు చేయిస్తున్నరు. తర్వాత చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నరు. పంచాయతీల తరఫున కొన్న ట్రాక్టర్ కిస్తీలు కట్టలేక, డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేక సర్పంచులు తిప్పలు పడుతున్నారు” అని కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.