పోలీసులపై పూల వర్షం.. దేశమంతటా హర్షం

పోలీసులపై పూల వర్షం.. దేశమంతటా హర్షం

ఎన్​కౌంటర్​లో లేపేసిన్రు‘దిశ’ నిందితుల హతం
ఆమెను చంపిన చోటే నలుగురూ అదే టైమ్కి..
చటాన్పల్లి అండర్ బ్రిడ్జి వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా
పోలీసుల వెపన్స్​ గుంజుకొని కాల్పులు.. రాళ్లతో దాడి

ఎదురుకాల్పులకు దిగిన పోలీసులు
స్పాట్​లో చనిపోయిన ఆరిఫ్​, నవీన్, శివ, చెన్నకేశవులు
ఘటన స్థలానికి భారీగా తరలివచ్చిన స్థానికులు
‘దిశ’కు పదిరోజుల్లోనే న్యాయం జరిగిందన్న జనం
ఇద్దరు పోలీసులకు గాయాలు అయ్యాయన్న సీపీ సజ్జనార్

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులు ఎన్ కౌంటర్​లో హతమయ్యారు. సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం ‘దిశ’ను దహనం చేసిన హైదరాబాద్​ నగర శివారులోని చటాన్ పల్లి అండర్ పాస్ బ్రిడ్జికి శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు తీసుకెళ్లగా.. వీళ్లు పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసుల నుంచి తుపాకులు గుంజుకొని కాల్పులకు దిగారు. రాళ్లు, కట్టెలు విసిరారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని, నలుగురు నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్న కేశవులు చనిపోయారని సైబరాబాద్​ పోలీస్​ కమిషనర్​ సజ్జనార్​ తెలిపారు. ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారని చెప్పారు. ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌ జరిగిన ప్రాంతాన్ని ఆయన సందర్శించి.. మీడియాకు వివరాలు వెల్లడించారు.

10 రోజుల్లో ఖతం

నవంబర్​ 27న రాత్రి 9గంటలకు వెటర్నరీ డాక్టర్​ ‘దిశ’పై తొండుపల్లి టోల్​ప్లాజాకు సమీపంలో ప్లాన్​ ప్రకారం లారీ డ్రైవర్లు ఆరిఫ్​, నవీన్​, క్లీనర్లు నవీన్​, చెన్నకేశవులు అత్యాచారానికి పాల్పడ్డారు. అదే రాత్రి తొండుపల్లి నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని చటాన్​పల్లి అండర్​ పాస్​ బ్రిడ్జి వద్ద కు ఆమెను తీసుకెళ్లి పెట్రోల్​ పోసి నిప్పంటించి కాల్చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ క్రమంలో అదే నెల 29న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ మరుసటి రోజు షాద్ నగర్​ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ నెల 4న కస్టడీలోకి తీసుకున్నారు. గురువారం అర్ధరాత్రి నిందితులతో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశామని, ఇందులో భాగంగా ‘దిశ’ సెల్ ఫోన్, చేతివాచ్, పవర్ బ్యాంక్ ను చటాన్ పల్లి వద్ద పాతి పెట్టినట్టు నిందితులు చెప్పారని సీపీ అన్నారు. దీంతో 10 మంది పోలీసులతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో చటాన్ పల్లి అండర్ పాస్ బ్రిడ్జికి తీసువచ్చినట్లు వివరించారు. ఆ సమయంలో పారిపోయేందుకు పోలీసుల నుంచి రెండు వెపన్స్​ను ఆరిఫ్, చెన్నకేశవులు లాక్కొని కాల్పులు జరిపారని, శివ, నవీన్ రాళ్లు విసిరారని తెలిపారు. ఉదయం 5.45 గంటల నుంచి 6.15గంటల మధ్యలో జరిగిన ఈ దాడిలో ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ గాయపడ్డారని ఆయన చెప్పారు. లొంగిపోవాలని చెప్పినా నిందితులు వినలేదని, వారు కరుడుగట్టిన నేరస్థులని.. వెంటనే పోలీసులూ కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు. కొద్దిసేపటికి కాల్పులు ఆగిపోయాయని.. తర్వాత వెళ్లి చూస్తే నలుగురు నిందితులు చనిపోయారని సీపీ వివరించారు. పోస్ట్‌‌‌‌‌‌‌‌మార్టం నివేదిక అందిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఎన్నిరౌండ్ల ఫైరింగ్ జరిగిందో విచారణలో తేలుతుందని తెలిపారు. ఆ నలుగురిపై కర్నాటక, ఏపీలోని పలు కేసులతో సంబంధం ఉన్నట్లు సమాచారం అందుతోందన్నారు.

గురువారం నుంచి సీన్ రీ కన్ స్ట్రక్షన్

చర్లపల్లి జైలులో ఉన్న ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులును గురువారం తెల్లవారుజామున సీపీ సజ్జనార్ పర్యవేక్షణలోని సిట్​ తమ కస్టడీలోకి తీసుకుంది. సాక్ష్యాధారాలను సేకరించే క్రమంలో సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం నిందితులను గురువారం సాయంత్రం సంఘటన స్థలం పరిసరాలకు పోలీసులు తీసుకెళ్లారు. మొదట తొండుపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఆధారాలు సేకరించారు. కాంపౌండ్ వాల్  పరిసరాల్లోనూ నిందితులను తిప్పారు. దిశపై అత్యాచారం జరిగింది ఇక్కడే. రాత్రి 10.08 గంటలకు టోల్ ప్లాజా నుంచి నిందితులను తీసుకుని రెండు ఎస్కార్ట్ వెహికిల్స్ కొత్తూరు, చటాన్ పల్లి అండర్ పాస్ బ్రిడ్జికి వైపు బయలుదేరాయి. అర్ధరాత్రి 2.30 గంటలకు కొత్తూరులోని జేఎస్ పెట్రోల్ బంక్ వద్ద సీన్ రీకన్ స్ట్రక్షన్ చేశారు. దిశను దహనం చేసిన ప్రాంతంలోనే (చటాన్​పల్లి అండర్​ పాస్​ బ్రిడ్జి వద్దే) ఆమె సెల్ ఫోన్, వాచ్, పవర్ బ్యాంక్ లను దాచినట్లు నిందితులు చెప్పడంతో అక్కడికి వారిని శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు తీసుకొచ్చారు. దిశ సెల్ ఫోన్, వాచ్, పవర్ బ్యాంక్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

10 మంది టీమ్​ విచారిస్తుండగా..

అండర్​ పాస్​ బ్రిడ్జి వద్ద దిశను ఎలా దహనం చేశామన్నది నలుగురు నిందితులు 10 మందితో కూడిన ఇన్వెస్టిగేషన్​ టీంకు వివరించసాగారు. దహనం చేసిన తర్వాత బ్రిడ్జి కింది నుంచి పైకి ఎలా వెళ్లామన్నది చెబుతూ.. ప్రధాన నిందితుడు ఆరిఫ్  బ్రిడ్జి నుంచి బయటకు వచ్చాడు. అప్పటికే అండర్ పాస్ బ్రిడ్జ్ కి రెండు వైపులా నలుగురు కానిస్టేబుల్స్ కాపలాగా ఉండడటాన్ని నిందితులంతా గమనించారు. సరిగ్గా తెల్లవారుజామున 5.30గంటల సమయంలో బ్రిడ్జి నుంచి బయటకు వచ్చిన ఆరిఫ్  ఓ ఎస్కార్ట్ కానిస్టేబుల్ దగ్గరి నుంచి గన్ ను లాక్కున్నాడని, ఆ తర్వాత ఓ ఎస్సై వద్ద నుంచి చెన్నకేశవులు కూడా గన్ లాక్కొని పరుగులు తీశారని పోలీసులు తెలిపారు. వారితోపాటు శివ, నవీన్​..  రాళ్లను, కట్టెలను విసురుతూ పరుగెత్తారని చెప్పారు. పట్టుకోవాలని చూస్తే షూట్ చేస్తామని బెదిరిస్తూ ఆరిఫ్​ గ్యాంగ్  అండర్ పాస్ బ్రిడ్జికి ఈస్ట్ సైడ్​లో ఉన్న పొలాల్లోకి పరుగెత్తిందని వివరించారు. వెపన్స్ తో పారిపోతున్న ఆరిఫ్​ గ్యాంగ్ ను పట్టుకునేందుకు నందిగామ ఎస్ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌ అరవింద్‌‌‌‌‌‌‌‌ గౌడ్  ప్రయత్నించారు. వారిపైకి ఆ గ్యాంగ్​ దాడికి దిగిందని, ఆరిఫ్​ కాల్పులు జరుపగా శివ, నవీన్ రాళ్లు విసిరారని, దీంతో ఎస్సై వెంటకేశ్వర్లు తలకు గాయమైందని, కానిస్టేబుల్​ అరవింద్ గౌడ్ కుడి భుజంపై గాయమైందని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆ గ్యాంగ్ ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. లొంగిపోవాలని హెచ్చరించినా వినకుండా అండర్ పాస్ బ్రిడ్జి నుంచి సుమారు 300 మీటర్ల దూరంలోని పొలాల వైపు నిందితులు పరుగులు తీశారని పోలీసులు తెలిపారు. ఆరిఫ్​, చెన్నకేశవులు కాల్పులు జరుపుతూ.. శివ, నవీన్ రాళ్లు విసురుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారని, దీంతో ఎదురు కాల్పులు జరిపాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు. ఈ కాల్పుల్లో ఆరిఫ్​, చెన్నకేశవులు, శివ, నవీన్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆరిఫ్​ కడుపులోకి, ఛాతిలోకి మొత్తం మూడు బుల్లెట్లు దూసుకెళ్లాయి. చెన్నకేశవులు తొడ, కడుపులోకి  బుల్లెట్లు దూసుకెళ్లగా.. శివ, నవీన్  కడుపులోకి బెల్లెట్లు దూసుకెళ్లాయి.

ఇద్దరి చేతుల్లో గన్స్

దిశను కాల్చేసిన చటాన్​పల్లి అండర్​ పాస్​ బ్రిడ్జికి సమీపంలోనే నిందితులు హతమయ్యారు. అండర్​ పాస్​ బ్రిడ్జికి 300 మీటర్ల దూరంలో.. బెంగళూర్ హైవేకు సమీపంలో పొలాల్లో ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్ కౌంటర్ విషయం తెలుసుకున్న సీపీ సజ్జనార్ శుక్రవారం ఉదయం 7గంటలకు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. హైదరాబాద్ క్లూస్ హెచ్​వోడీ వెంకన్న టీమ్ క్లూస్ సేకరించారు. షాద్ నగర్ ఆర్డీవో కృష్ణ నేతృత్వంలో తహశీల్దార్ పాండు నాయక్ తోపాటు కొందుర్గ్‌‌, నందిగామ, చౌదరిగూడ ఎమ్మార్ లు పంచనామా నిర్వహించారు. ఘటనా స్థలంలో ఒక్కో డెడ్ బాడీ మధ్య 10 నుంచి 20 మీటర్ల దూరంలో పడి ఉన్నాయి. ఆరిఫ్​, చెన్నకేశవులు చేతుల్లో గన్స్​ ఉన్నాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు గాంధీ హాస్పిటల్ ఫోరెన్సిక్ డాక్టర్ల టీం వచ్చి పరిశీలించింది. ఆ తర్వాత నిందితుల శవాలను మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించారు. రాత్రి 7గంటలకు పోస్ట్ మార్టం నిర్వహించి అక్కడే ఉంచారు.