దిశ నిందితుల డెడ్ బాడీలకు ఎంబామింగ్ చేయలే

దిశ నిందితుల డెడ్ బాడీలకు ఎంబామింగ్ చేయలే

    ఫ్రీజర్లలో ఉంచి భద్రపర్చాం

    బుల్లెట్ గాయాలున్నాయ్​.. ఎంబామింగ్ రిస్క్

    కెమికల్స్ లీక్ అయ్యే చాన్స్ ఉంటుంది  

     గాంధీ హాస్పిటల్ వర్గాల వెల్లడి 

దిశ మర్డర్ కేసు నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లుశివ, నవీన్, చెన్నకేశవులు మృతదేహాలు ఖరాబ్ కాకుండా ఉండేందుకు ఎంబామింగ్ ఇంజక్షన్లు ఇస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని గాంధీ హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. మృతదేహాలు చెడిపోకుండా టెంపరేచర్లను బ్యాలెన్స్ చేస్తూ ప్రత్యేక ఫ్రీజర్లలో ఉంచి, జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పాయి. ఈ విషయంలో సుప్రీం కోర్డు గైడ్​లైన్స్​ప్రకారమే నడుచుకుంటున్నామని, డాక్టర్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవద్దని ఆసుపత్రిలోని ఓ డిపార్ట్ మెంట్ హెడ్ స్పష్టం చేశారు. పోలీస్ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన దిశ కేసు నిందితుల డెడ్ బాడీల భద్రతపై గాంధీ ఆసుపత్రిలో సందిగ్థత నెలకొంది. ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిషన్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు బాడీలను భద్రపరచాలని కోర్టు తెలిపింది. దీంతో బాడీలను 6 నెలల పాటు ఫ్రీజర్ లో భద్రపరిచేందుకు ఫోకస్ పెట్టినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. మార్చురీ ఫ్రీజర్ లో ఉంచిన మృతదేహాలు పాడవకుండా హాస్పిటల్ ఫోరెన్సిక్ నిపుణులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపాయి.

ఎంబామింగ్​ఇంజక్షన్లు ఎలా చేస్తారు?

డెడ్ బాడీలు కుళ్లిపోకుండా ఉండేందుకు ఎంబామింగ్ చేస్తారు. ఇందుకోసం గ్లిజరాల్, స్పిరిట్, తదితర లిక్విడ్స్ తో కూడిన ఫ్లూయిడ్స్ ను ఇంజక్షన్ ద్వారా రక్తనాళాల్లోకి ఎక్కిస్తారు. అదేసమయంలో బాడీ ఫ్లూయిడ్స్ ను తొలగిస్తారు. అయితే బుల్లెట్ తాకిన బాడీలకు కెమికల్స్​లీక్​ కాకుండా ఎంబామింగ్​ఎక్కించాల్సి ఉంటుందని, ఇది రిస్క్​తో కూడిన పని అని డాక్టర్లు చెప్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే, ప్రత్యేక పద్ధతిలో మాత్రం ఎక్కించవచ్చని పేర్కొంటున్నారు. బాడీ పరిస్థితిని బట్టి ఒక్క సారి ఎంబామింగ్​ చేస్తే మూడు నుంచి ఆరు నెలలకు వరకు బాడీ డీకంపోజ్​కాకుండా ఉంటుందని, ఎంబామింగ్​ చేసి ఫ్రీజర్లలో ఉంచితే రెండు మూడు ఏళ్లు కూడా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. కెమికల్స్ గాఢతను బట్టి ఈ ఇంజక్షన్ల ధర రూ. 3 వేల నుంచి 8 వేల వరకూ ఉంటుందని ఫోరెనిక్స్​నిపుణులు అంటున్నారు. ఎంబామింగ్​ లేకుండా 4 డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్​లో బాడీని ఉంచితే 3 నెలలు వరకు డీ కంపోజ్​కాకుండా ఉంటుందని పేర్కొంటున్నారు.