- సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో హరేకృష్ణ ఫౌండేషన్‌కు దివీస్,
- అరబిందో కార్పొరేట్ సాయం
- రూ.22.18 కోట్ల విలువైన చెక్కుల అందజేత
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్ అందించే కార్యక్రమానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కింద భారీ ఎత్తున నిధుల సహాయం లభించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ నిలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్, దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్ సంస్థల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అందించేందుకు దివీస్ లేబొరేటరీస్, అరబిందో ఫార్మా సంస్థలు సీఎం సమక్షంలో తమ సీఎస్‌ఆర్ నిధుల చెక్కులను హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్‌కు అందజేశాయి. అరబిందో ఫార్మా లిమిటెడ్ తరఫున రూ.10 కోట్లు, దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ తరఫున రూ.12.18 కోట్లు ఇచ్చారు.
హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థులకు అత్యంత నాణ్యమైన టిఫిన్, మధ్యాహ్న భోజనాన్ని విజయవంతంగా అందిస్తోందని, ఈ క్రమంలో దివీస్, అరబిందో సంస్థలు ముందుకొచ్చి సామాజిక నిధులను విరాళంగా ఇవ్వడం హర్షనీయమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు తోడ్పాటుగా నిలిచిన రెండు సంస్థల యాజమాన్యాలకు, ప్రతినిధులకు సీఎం ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
స్థానిక రైతుల నుంచే నిత్యావసరాలు కొంటాం
విద్యార్థులకు భోజనం, టిఫిన్ తయారీకి అవసరమయ్యే కూరగాయలు, బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా స్థానిక రైతుల నుంచే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోనున్నట్టు సీఎం వివరించారు.
