తప్పులు వెతికి నిష్కారణంగా ఇతరులను బాధ పెట్టకూడదు : డా. వైజయంతి పురాణపండ

తప్పులు వెతికి నిష్కారణంగా ఇతరులను బాధ పెట్టకూడదు : డా. వైజయంతి పురాణపండ

ఎప్పుడూ ఎవరినీ అవమానించకూడదు, ఎవరినీ బాధించకూడదు. ఇతరులు తెలియక చేసిన తప్పులను క్షమించటమే యుక్తం..  అంటాడు చాణక్యుడు తన నీతి సూత్రాలలో.

ఒక మనిషిని అవమానించేతత్వం, బాధించే లక్షణం మనిషికి ఉండకూడదు. అటువంటి లక్షణాలు ఉన్నవారిని పశువులుగా, ఆ లక్షణాలను పశు లక్షణంగాను చెప్తారు పెద్దలు. పశువులకు ఆలోచనాశక్తి తక్కువగా ఉంటుంది కనుక, అవి కొన్ని చెడు లక్షణాలు కలిగి ఉంటాయి. మానవులకు ఆలోచనా శక్తి, విచక్షణ మెండుగా ఉంటాయి. కనుక, మంచిచెడులు ఆలోచిస్తూ, జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాలని ఋషులు చెప్తున్నారు.

*   *   *
మహాభారతంలో మయసభ చూడటానికి వచ్చిన దుర్యోధనుడు వారి సంపదలు చూసి ఈర్ష్య, అసూయలతో రగిలిపోతాడు. దాంతో ఆలోచనలు అదుపు తప్పుతాయి. అందునా మయసభలో ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు కనిపిస్తాయి. అందుకే తివాచీ ఆకారంలో ఉన్న మడుగును చూసి, అది తివాచీ అనుకుని అడుగేసి, మడుగులో పడిపోతాడు. అది గమనించిన పాండవులు, దుర్యోధనుడికి పొడి బట్టలు ఇచ్చి ఆదరంగా గౌరవిస్తారే కానీ, దుర్యోధనుడి స్థితిని చూసి ఎగతాళి చేయరు. కానీ, దుర్యోధనుడు అవమానంగా భావించి, పాండవుల మీద పగబట్టి, ఏ విధంగానైనా వారిని అవమానపరచాలి అనుకుంటాడు. పాండవులతో మాయాజూదం ఆడి, వారిని అడవుల పాలు చేశాడు. దుర్యోధనుడిలో ఈ లక్షణం బాల్యం నుంచే ఉంది. 

చిన్నతనంలో అందరూ ఆటలు ఆడుకునేటప్పుడు, భీముడిని ఏదో ఒక రకంగా బాధించాలనుకునేవాడు దుర్యోధనుడు. అందుకే విషం కలిపిన అన్నం పెట్టాడు. తాళ్లతో కట్టి, పాతాళంలోకి పారవేశాడు. అస్త్రవిద్యా ప్రదర్శన అప్పుడు కూడా తన ముష్టి ఘాతాలతో భీముడిని శారీరకంగా బాధించాడు. వారు బాధపడుతుంటే ఆనందించేవాడు. ఈ లక్షణం దుర్యోధనునితో పాటు పెరిగి పెద్దదైంది. పాండవులు జూదంలో ఓడిపోయినప్పుడు, ద్రౌపదిని సభకు రప్పించి, వస్త్రాపహరణం చేస్తూ, పైశాచిక ఆనందం పొందాడు. మాతాసమానురాలైన వదినని, సభలోకి రాలేని స్థితిలో ఉన్నప్పటికీ, ఇతరులను బాధించే లక్షణం ఉన్న దుర్యోధనుడు ఆ పని చేశాడు. కౌరవుల వల్ల ఇన్ని అవమానాలు, బాధలూ అనుభవించినప్పటికీ, ఘోషయాత్ర చేసేటప్పుడు, దుర్యోధనాదులను అర్జునుడు రక్షిస్తాడు. వారి తప్పులను మన్నిస్తాడు. 

రామాయణంలో రాముడు ధర్మానికి నిలువెత్తు విగ్రహం. అందుకే ‘రామో విగ్రహవాన్‌‌ ధర్మః’ అంటారు. ఎవరి మనసులను నొప్పించడు. ఎవ్వరినీ అవమానించడు. వీలైనంతవరకు ఇతరులకు సాయం చేయటమే రాముడి లక్షణం. ‘తప్పులు మన్నించుటే దేవుని సుగుణం’ అన్నారు ఒక కవి. రాముని పట్టాభిషేకానికి ముహూర్తం నిశ్చయమైందని తెలుసుకున్న కైకేయి, ఈర్ష్య, అసూయలతో, ‘రాముడికి పదునాలుగు సంవత్సరాలు వనవాసం. భరతుడికి పట్టాభిషేకం’ అంటూ రెండు వరాలను కోరింది. ఆ వరాలతో దశరథుడి మనసు కలత చెందింది. చివరకు ఆ బాధతో దశరథుడు ప్రాణాలు విడిచాడు. రామలక్ష్మణులు తండ్రిలేనివారయ్యారు. కేవలం కైక తన వరాలతో ఆయనను బాధించటం వల్ల ఇంత జరిగింది. అయినప్పటికీ రాముడు కైకను ఒక్క మాట కూడా అనకుండా, ఆమె చేసిన తప్పును ప్రశ్నించకుండా, అడవులకు వెళ్లిపోయాడు.

*   *   *
ఒక ఊరిలో ఒక సాధువు ఉండేవాడు. ఆయన నిత్యం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించేవాడు. ప్రతిరోజూ ఒక చీమ అదే సమయానికి అక్కడకు వచ్చి, సాధువును కుట్టేది. సాధువు, ఆ చీమను జాగ్రత్తగా తన చేతితో తీసి, చెట్టు ఆకు మీద విడిచిపెట్టేవాడు. ‘‘నేను ప్రతి రోజూ నిన్ను కుడుతున్నాను కదా. మరి నన్నేం చేయకుండా, ఎందుకు కాపాడుతున్నావు?’ అని ఒకరోజు చీమ సాధువుని ప్రశ్నించింది. అందుకు ఆ సాధువు, ‘నీకు తెలియక నువ్వు నన్ను కుడుతున్నావు. కానీ, నిన్ను బాధించకూడదని నాకు తెలుసు. కనుక, నిన్ను నేనేమీ చేయట్లేదు’ అని మృదువుగా సమాధానమిచ్చాడు. చీమకు తను చేసిన తప్పేమిటో తెలిసింది. ఇతరులను బాధించకూడదని అర్థం చేసుకుని, మరుసటి రోజు నుంచి ఆ చీమ సాధువు చేతి మీద పాకుతూ, ఆయన అర్ఘ్యం ఇచ్చిన తరువాత తన దారిని వెళ్లిపోవటం మొదలుపెట్టింది.

చాలామందికి కొన్ని ప్రాణులను అకారణంగా బాధించటం ఒక సరదా. అవి మనకు ఎటువంటి హాని చేయకపోయినా, వాటిని బాధించి ఆనందించటం కొందరి లక్షణం. అలాగే స్వేచ్ఛగా ఎగురుతున్న తూనీగలను పట్టుకుని, వాటికి దారాలు కట్టి, ఆడుకోవటం మరికొందరికి అలవాటు. ఆ తూనీగ బాధపడుతుంటే, వినోదం చూస్తూ ఆనందిస్తారు. మృకండ మహాముని తన బాల్యంలో ఈ విధంగానే తూనీగతో ఆడుకుంటాడు. పెద్దవాడయ్యాక దానికి  కొరత (శరీరంలోకి నిలువుగా శూలం గుచ్చుతారు) శిక్ష అనుభవిస్తాడు. అందుకే తెలిసి చేసినా తెలియకచేసినాతప్పు తప్పే. కనుక, ఏ స్థితిలోనూ నిష్కారణంగా ఇతరులను బాధించకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. స్వాతంత్య్ర పోరాటం సమయంలో గాంధీ మహాత్ముడు అహింసా మార్గంలో పోరాటం చేశాడు. 

తప్పులు వెతికి నిష్కారణంగా ఇతరులను బాధ పెట్టకూడదు. ‘తప్పులు వెతికే పురుషుడు పాములాంటివాడు’ అని సుమతీ శతకం చెప్తోంది. మంచి లక్షణాలను అలవరచుకోవటానికి పెద్దలు పలికిన సూక్తులను పాటించాలని అందుకే చెప్తారు.

-  డా. వైజయంతి పురాణపండ 
ఫోన్: 80085 51232