86 శాతం తగ్గిన డాక్టర్ రెడ్డీస్ లాభం

86 శాతం తగ్గిన డాక్టర్ రెడ్డీస్ లాభం

హైదరాబాద్‌‌, వెలుగు: ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌‌కు ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌‌‌‌ (క్యూ4) లో  రూ.221 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌‌) వచ్చింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌లో వచ్చిన రూ.1,587 కోట్లతో పోలిస్తే ఇది 86  శాతం,  డిసెంబర్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌ (క్యూ3) లోని రూ.1,190 కోట్లతో పోల్చితే 81 శాతం తక్కువ. కంపెనీకి చెందిన లెనాలిడొమైడ్‌‌ అమ్మకాలు పడిపోవడం, నార్త్ అమెరికా,  యూరప్‌‌లో జనరిక్స్‌‌ ధరల కోత, షెల్ఫ్‌‌ స్టాక్ అడ్జస్ట్‌‌మెంట్‌‌ (ఎస్‌‌ఎస్‌‌ఏ)  ప్రభావంతో కంపెనీ ప్రాఫిట్ భారీగా తగ్గింది.

కొత్త లేబర్ కోడ్ సంబంధిత నిబంధనలు కూడా మార్జిన్లపై ఒత్తిడిని పెంచాయని కంపెనీ తెలిపింది.  డాక్టర్ రెడ్డీస్‌‌కు క్యూ4లో  కార్యకలాపాల ద్వారా  రూ.7,516 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది ఏడాది లెక్కన 12 శాతం,   క్యూ3తో పోలిస్తే 14 శాతం  తక్కువ. 2025–-26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ  ఆదాయం రూ.33,593 కోట్లకు చేరింది.  డాక్టర్ రెడ్డీస్‌ బోర్డు 2025–-26 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.8 చొప్పున తుది డివిడెండ్‌‌ను సిఫార్సు చేసింది. ఇందుకు సంబంధించి  జులై 10 ని రికార్డ్ డేట్‌‌గా నిర్ణయించారు.