న్యూఢిల్లీ: ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్ 11 ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను దక్కించుకుంది. అయితే వచ్చే రెండు సీజన్లకు మాత్రం డ్రీమ్ ఎలెవన్ బోర్డులో ఉండదు. తక్కువ బిడ్ అమౌంట్ వేసిన కారణంగా 2021, 2022 సీజన్‌లతో కలిపి ప్రతిపాదించిన మూడేళ్ల ఒప్పందాన్ని బీసీసీఐ రిజెక్ట్ చేసింది. దీంతో కేవలం ఈ సీజన్‌లో మాత్రమే డ్రీమ్ ఎలెవన్ స్పాన్సర్‌గా ఉండనుందనేది సుస్పష్టం. బిడ్డింగ్‌లో ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కంపెనీలైన బైజుస్, అన్‌అకాడమీని తోసిరాజని డ్రీమ్ ఎలెవన్ హక్కులు దక్కించుకుంది. నాలుగు నెలల 13 రోజుల ఈ రైట్స్ పీరియడ్‌ను రూ.222 కోట్ల బిడ్డింగ్‌కు డ్రీమ్ ఎలెవన్ సొంతం చేసుకుంది.
‘ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ డ్రీమ్ ఎలెవన్‌ను 2020 సీజన్‌కు గాను కొత్త టైటిల్ స్పాన్సర్‌గా ప్రకటించింది. డ్రీమ్ ఎలెవన్ అనేది ఇండియా కేంద్రంగా ముంబైలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది’ అని బీసీసీఐ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఒకవేళ వివో మళ్లీ రాకపోతే తదుపరి రెండు సీజన్లకు గాను రూ.240 కోట్లు చెల్లించాల్సిందిగా డ్రీమ్ ఎలెవన్‌కు బోర్డు ఆఫర్ చేసిందని సమాచారం. ‘డ్రీమ్ ఎలెవన్ హైయ్యస్ట్ బిడ్‌ను వేసింది. కానీ వచ్చే రెండేళ్లలో కరోనా పరిస్థితి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నందున రూ.240 కోట్లకే స్పాన్సర్‌షిప్ హక్కులను ఆ కంపెనీకి బీసీసీఐ ఎందుకు కట్టబెట్టాలి. బీసీసీఐ వివోతో ఇంకా ఒప్పందంలోనే ఉంది. అదింకా ముగియలేదు. రూ.440 కోట్లు వచ్చే చాన్స్ ఉన్నప్పుడు రూ.240 కోట్లకే సెటిల్ చేసుకోవడం ఎందుకు?’ అని ఈ విషయంపై వెటరన్ బీసీసీఐ అధికారి కామెంట్ చేశారు.

