కాల్‌ చేస్తే వస్తారు..  కాపాడతారు

కాల్‌ చేస్తే వస్తారు..  కాపాడతారు

ఆపదలో ఉన్న మూగజీవాలను రక్షిస్తున్న -డీఆర్‌ఎఫ్‌ 

స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారంతో రెస్క్యూ

జంతు ప్రేమికులు, స్థానికుల నుంచి ప్రశంసలు మనం ఏమైనా సమస్యల్లో చిక్కుకుంటే పోలీసులకు ఫోన్‌ చేస్తాం. ప్రమాదాలకు గురైతే అంబులెన్స్‌కు ఫోన్‌ చేస్తాం. కానీ మూగ జీవాలు కష్టాల్లో ఉంటే చూస్తూ  జాలి పడటం తప్ప కాపాడేందుకు ఎవరూ ముందుకురారు. ఎవరైనా జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు తెలిస్తే కాపాడతారు. హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. అలాగే జీహెచ్​ఎంసీ డిజాస్టర్​రెస్పాన్స్​ఫోర్స్​ కూడా మూగ జీవాల పాలిట దేవుడిలా మారింది.

హైదరాబాద్‌, వెలుగు:  సిటీలో భారీ వర్షాలు, వరదలు, విపత్తులు, ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైన జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (డీఆర్‌ఎఫ్‌) జంతువులు, పక్షుల పాలిట ఆపన్న హస్తంగానూ మారింది. అగ్ని ప్రమాదాలు, భవనాలు కూలినప్పుడు సహాయ చర్యలు చేపట్టే డీఆర్‌ఎఫ్‌ టీం మూగ జీవాలను కాపాడటంలోనూ ముందుంటుంది. సమాచారం అందిన వెంటనే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారంతో రెస్క్యూ చేస్తుంది.  మూగజీవాలను సంరక్షించే స్వచ్ఛంద సంస్థ కంపాషనేట్‌ సొసైటీ ఫర్‌ ఎనిమల్స్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధులకు ఇటీవల ఓ కుక్కను కాపాడడం సవాలుగా మారింది.  సఫిల్‌గూడలో  రెండు గోడల మధ్య ఇరుక్కున్న కుక్కను బయటకు తీయడం కష్టమైంది. ఈ నేపథ్యంలో డీఆర్‌ఎఫ్‌కు సమాచారం ఇవ్వగా వెంటనే రంగంలోకి దిగిన డీఆర్‌ఎఫ్‌ టీం గోడను కూల్చి కుక్కను కాపాడింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి ప్రత్యేక చొరవతో సిబ్బంది ఎనిమల్‌ రెస్క్యూ ఆపరేషన్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.

బావిలో పడిన పిల్లులు

మల్కాజ్‌గిరి సర్కిల్‌లోని  సీతారాంనగర్‌లో 40 ఫీట్ల లోతు బావిలో పడిన రెండు పిల్లులను జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్క్యూ టీం సురక్షితంగా బయటికి తీసింది. మూడు రోజులుగా బావిలో ఉండి అరుస్తుండగా వాటిని ఎలా బయటకు తీయాలో ఇంటి యజమానికి, స్థానికులకు అర్థం కాలేదు. స్థానికుడొకరు డీఆర్‌ఎఫ్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే బావి వద్దకు వచ్చి రెండు పిల్లి కూనలను బయటకు తీశారు. పిల్లుల కోసం  రిస్క్‌ తీసుకుని స్పందించడంపై డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

చైనా మాంజా చుట్టుకున్న గద్దను..

అసెంబ్లీ వద్ద చెట్టుపైన గద్దకు  చైనా మాంజా చుట్టుకోవడంతో అరుస్తుంది. దీన్ని గమనించిన అసెంబ్లీ సిబ్బంది డీఆర్‌ఎఫ్‌ టీంకి కాల్‌ చేయగా అక్కడికి చేరుకుని దానిని రక్షించారు. ఫస్ట్‌ ఎయిడ్‌ చేసి వదిలిపెట్టారు. నల్లగండ్ల చెరువులో పడ్డ జింకను, హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో కుక్కల దాడిలో గాయపడ్డ జింకను  కాపాడింది.

 సెప్టిక్‌ట్యాంక్‌లో పడిన ఆవు

చందాన‌గ‌ర్ స‌ర్కిల్‌ ఆల్విన్ కాల‌నీలోని సెప్టిక్ ట్యాంక్‌ లో  ప‌డ్డ ఆవును డీఆర్‌ఎఫ్ బృందాలు సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీశాయి. సెప్టిక్‌ ట్యాంక్‌కు ప్రహ‌రీ, క‌ప్పు లేక‌పోవ‌డంతో  ప్రమాద‌వ‌శాత్తు ఆవు అందులో ప‌డింది. ప‌దిరోజులు గడచినా ఎవరూ పట్టించుకోలేదు. స్థానికంగా ఉండే ఒకతను చూసి డీఆర్‌ఎఫ్‌కు సమాచారం  ఇచ్చారు. వచ్చి సెప్టిక్‌ ట్యాంక్‌ను కట్‌ చేసి లోపలికి దిగి, తాడుసాయంతో ఆవును పైకి లాగారు. చికిత్స కోసం స‌మీపంలోని వెట‌ర్నరీ హాస్పిటల్‌కు తరలించారు. ఆవును కాపాడిన డిజాస్టర్ టీంను మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి అభినందించారు.

విపత్తులను ఎదుర్కొనేందుకు..

సిటీలో ఎలాంటి విప‌త్తులు సంభ‌వించినా స‌మ‌ర్థవంతంగా ఎదుర్కోవ‌డంతో పాటు ప్రజల భ‌ద్రత‌కు భ‌రోసా క‌ల్పించేందుకు డీఆర్‌ఎఫ్‌ టీం ఏర్పాటైంది. వానాకాలం విప‌త్తుల‌ను ఎదుర్కొంటుంది. విపత్తుల నిర్వహణ కోసం ప్రత్యేక విభాగం క‌లిగిన రెండో సిటీలో హైద‌రాబాద్ గుర్తింపు పొందింది. ప్రజలకు ఆస్తి, ప్రాణ నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ఆపదలో ఉన్న జంతువులు, పక్షులను కూడా ఆదుకోవడం ద్వారా డీఆర్‌ఎఫ్‌ ప్రత్యేకత చాటుకుంటుంది.