గత మ్యాచ్‌లో శ్రీలంకపై ఘన విజయం సాధించిన సౌతాఫ్రికా టైటిల్ ఫేవరెట్ ఆస్ట్రేలియాపై అదే జోరు కొనసాగించింది. టోర్నీలో తొలిసారి హిట్ అయిన సఫారీల బ్యాటింగ్ యూనిట్ బలమైన కంగారూల బౌలింగ్ లైనప్‌కు చుక్కలు చూపించి భారీ స్కోరు చేసింది. డుప్లెసిస్ (94 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 100) సెంచరీకి, వాండర్ డుసేన్ (97 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 95), క్వింటన్ డికాక్ (51 బంతుల్లో 7 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీలు తోడవడంతో శనివారం ఇక్కడ జరిగిన వరల్డ్‌కప్ చివరి లీగ్‌మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆరు వికెట్ల నష్టానికి 325 రన్స్ చేసింది. ఆసీస్ నేథన్ లైయన్(2/53), మిచెల్ స్టార్క్ (2/59) రెండేసి వికెట్లు తీశారు. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్‌కు వచ్చిన ప్రొటీస్‌కు ఓపెనర్లు మార్‌క్రమ్(34), డికాక్ మంచి ఆరంభం ఇచ్చారు. ఆసీస్ పేసర్లను సులువుగా ఎదుర్కొన్న ఈ జోడీ తొలి వికెట్‌కు 79 రన్స్ జోడించింది. వెటరన్ స్పిన్నర్ లైయన్ బౌలింగ్‌లో స్టంపౌటైన మార్‌క్రమ్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. కాసేపటికే హాఫ్‌సెంచరీ పూర్తి చేసిన డికాక్‌ను కూడా లైయన్ పెవిలియన్ చేర్చాడు. అయితే కెప్టెన్ డుప్లెసిస్, డుసేన్ ఆసీస్ బౌలర్లతో ఆటాడుకున్నారు. స్వేచ్ఛగా పరుగులు చేసిన వీరిద్దరూ మూడో వికెట్‌కు 152 బంతుల్లో151 రన్స్ భాగస్వామ్యంతో 41వ ఓవర్ పూర్తయ్యే సరికి జట్టు స్కోరును 250 దాటించేశారు. బెరెన్‌డార్ఫ్ వేసిన 43 ఓవర్ రెండో బాల్‌కు సింగిల్ తీసి కెరీర్‌లో 12వ సెంచరీ పూర్తి చేసిన డుప్లెసిస్, ఆ ఓవర్ లాస్ట్ బాల్‌కు స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చాడు. కానీ అప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఊపుమీదున్న డుసేన్ చివరి బంతి దాకా పోరాడాడు. జట్టు స్కోరును 300 దాటించిన డుసేస్ సెంచరీకి ఐదు పరుగులు దూరంలో ఆగిపోయాడు. కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ చివరి బంతికి భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. కాగా, చివర్లో పుంజుకున్న ఆసీస్ పేసర్లు.. కెరీర్‌లో చివరి వన్డే ఆడుతున్న జేపీ డుమిని(14)తోపాటు, ప్రిటోరియస్(2)ను ఔట్ చేసి కాస్త స్కోరు వేగాన్ని నియంత్రించారు.

