హైదరాబాద్, వెలుగు: గంజాయి పెడ్లర్ నీతూభాయి కోసం ఈగల్ ఫోర్స్ గాలింపు చర్యలు మొదలుపెట్టింది. ఐటీ కారిడార్‌లో డ్రగ్స్, గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో ఈగల్ ఫోర్స్ బుధవారం సోదాలు నిర్వహించింది. నానక్ రామ్‌గూడలోని నీతూభాయి ఇంట్లో గంజాయి కొనుగోలు చేస్తున్న 47 మందిని అదుపులోకి తీసుకుంది. వీరిలో ఐటీ ఎంప్లాయిస్ సహా స్థానికంగా పలు వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. నీతూభాయి తన కిరాణా షాపులో గంజాయి అమ్మకాలు కొనసాగిస్తున్నట్టు ఈగల్ ఫోర్స్ అధికారులు ఇప్పటికే గుర్తించారు.
గంజాయి, డ్రగ్స్ కేసుల్లో గతంలో పలుమార్లు చిక్కిన నీతూభాయిపై ఇప్పటికే పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. ఇటీవలి కాలంలో జైలు నుంచి విడుదలైన అనంతరం మళ్లీ గంజాయి అమ్మకాలు ప్రారంభించింది.. కాగా, ఈగల్ ఫోర్స్ అధికారుల సోదాల సమాచారం తెలుసుకున్న నీతూభాయి అక్కడి నుంచి పారిపోయింది. దీంతో ఆమె కోసం స్థానిక పోలీసులు సహా ఈగల్ ఫోర్స్ అధికారులు గాలిస్తున్నారు.
