రిజైన్‌ చేసి గెలిచిన ఒకే ఒక్కడు ఈటల

రిజైన్‌ చేసి గెలిచిన ఒకే ఒక్కడు ఈటల

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటిదాకా.. పార్టీ మారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, గెలిచిన ఒకే ఒక్క లీడర్ ఈటల రాజేందర్. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్‌‌‌‌తో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌‌‌‌లోకి ఫిరాయించారు తప్ప ఏ ఒక్కరూ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లలే. తమ గుర్తు మీద గెలిచి అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారని, వారి సభ్యత్వాలను రద్దు చేయాలని స్పీకర్‌‌‌‌‌‌‌‌ను ప్రతిపక్షాలు కోరినా చర్యలు తీసుకోలేదు. అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలతో హెల్త్‌‌ మినిస్టర్‌‌గా ఉన్న ఈటలను మే 2న కేబినెట్ నుంచి కేసీఆర్ బర్తరఫ్ చేశారు. దీంతో ఈటల తన ఎమ్మెల్యే పదవికి జూన్ 12న రాజీనామా చేసి.. తానేంటో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. బీజేపీలో చేరిన ఆయన.. హుజూరాబాద్‌‌‌‌ నుంచి పోటీ చేసి, అధికార పార్టీ ఎత్తులను చిత్తు చేసి గెలుపొందారు.

ఏడేండ్లలో 41 మంది ఎమ్మెల్యేలు

ఈ ఏడేండ్లలో 41 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా.. ఏ ఒక్కరూ రాజీనామా చేయలేదు.  వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ (టీడీపీ)​, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (బీఎస్పీ), సబితా ఇంద్రా రెడ్డి(కాంగ్రెస్‌‌) మంత్రులు కూడా అయ్యారు. నిరుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి(దుబ్బాక) చనిపోవడంతో జరిగిన బైపోల్‌‌లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రఘునందన్​రావు గెలిచారు.