న్యూఢిల్లీ: పది రాష్ట్రాల్లోని 26 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల సంఘం(ఈసీఐ) షెడ్యూల్ విడుదల చేసింది. ఆరేండ్ల పదవీకాలం ముగుస్తున్న 24 సిట్టింగ్ స్థానాలతో పాటు రాజీనామాల కారణంగా ఖాళీ అయిన రెండు స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు ఈసీఐ తెలిపింది. జూన్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు జూన్8 చివరి తేదీ.
9న నామినేషన్ల పరిశీలన, 11 వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఈసీ గడువు ఇచ్చింది. జూన్ 18న ఎన్నికల అనంతరం 5 గంటల నుంచి లెక్కింపు జరగనుంది. పదవీకాలం ముగియనున్న ప్రముఖ నాయకులలో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్‌నీత్ సింగ్ బిట్టు ఉన్నారు.
నోటిఫికేషన్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్తాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్నాటక, మిజోరం రాష్ట్రాలలోని 24 రెగ్యులర్ స్థానాలకు, మహారాష్ట్ర, తమిళనాడులోని రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. బారామతి నుంచి మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన ఎన్సీపీ నాయకురాలు సునేత్ర పవార్ రాజ్యసభకు రాజీనామా చేయడంతో మహారాష్ట్రలో ఒక స్థానం ఖాళీ అయింది.
అన్నా డీఎంకే ఎంపీ వీ. షణ్ముగం రిజైన్తో తమిళనాడులో ఆ స్థానం ఖాళీ అయింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆళ్ల అయోధ్య రామి రెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాశ్ చంద్రబోస్, సానా సతీశ్ బాబు స్థానాలు ఖాళీ అవుతున్నాయి.
కాగా, ప్రస్తుతం రాజకీయ వర్గాల దృష్టి అంతా తమిళనాడుపై పడింది. అక్కడి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో ఉన్న బలాల దృష్ట్యా.. టీవీకే పార్టీ తొలిసారిగా రాజ్యసభలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తుందా..? లేక ప్రతిపక్షాల సమన్వయంలో భాగంగా కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థికి మద్దతు ఇస్తుందా..? అనే చర్చలు నడుస్తున్నాయి.
కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం అసెంబ్లీ బలాబలాలను బట్టి చూస్తే.. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీయే ఒక రాజ్యసభ స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి మూడు స్థానాలను గెలుచుకునేలా కనిపిస్తోంది.
