- తమిళనాడులోని దిండిగల్ సహా 15 ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్
- రూ.60 లక్షల నగదు సీజ్, రూ.45 కోట్ల విలువైన ఆస్తులు గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. హైదరాబాద్ జోనల్ ఈడీ ఆధ్వర్యంలో బుధవారం సోదాలు నిర్వహించింది. అహిల్యానగర్, బికనీర్, డెహ్రాడూన్, ఢిల్లీ, దిండిగల్, గుంటూరు, ముంబై, రూర్కీ సహా మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ సోదాల్లో రూ. 60 లక్షల నగదును సీజ్ చేసింది. నిందితులు, వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న రూ.45 కోట్లకుపైగా విలువైన ఆస్తులను గుర్తించింది. కల్తీ నెయ్యి వల్ల సంపాదించిన బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి పలు బోగస్ కంపెనీలను సృష్టించినట్లు ఈడీ తెలిపింది. అందుకోసం పటిష్టమైన నెట్‌వర్క్ ద్వారా నకిలీ కొనుగోళ్లు, అమ్మకాల లావాదేవీలు జరిపినట్లు దర్యాప్తులో తేలింది.
తమిళనాడులోని దిండిగల్‌లో ఉన్న ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఏపీలో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదుచేసింది. దర్యాప్తులో భాగంగా ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, అహిల్యానగర్‌లోని మల్గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, రూర్కీలోని భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్లలో సోదాలు నిర్వహించింది. సంబంధిత సంస్థలకు చెందిన పొమిల్ జైన్, విపిన్ జైన్, రాజు రాజశేఖరన్, రాజేష్ మన్సుఖ్‌లాల్ చావడా, అపూర్వ వినయకాంత్ చావడా, మచింద్ర శాంతారామ్ లంకే, అజయ్ కుమార్ సుగంధ్, మహేష్ కుమార్ రోహిరా, ఆశిష్ అగర్వాల్‌ల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేసినట్లు ఈసీ వెల్లడిచింది.
