విద్య, వైద్యమే మా ఫస్ట్​ ప్రయారిటీ: మంత్రి పొన్నం ప్రభాకర్

విద్య, వైద్యమే మా ఫస్ట్​ ప్రయారిటీ:  మంత్రి పొన్నం ప్రభాకర్

ముషీరాబాద్, వెలుగు: విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సోమవారం ముషీరాబాద్ గవర్నమెంట్​స్కూలులో రూ.57లక్షలతో కల్పించిన మౌలిక వసతులను, సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ, డాక్టర్ విజయకుమార్ దాట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.3కోట్లతో కొత్తగా నిర్మించిన ముషీరాబాద్ పీహెచ్​సీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. విద్యా వ్యవస్థకు, రాజకీయాలకు సంబంధం లేదని, ప్రభుత్వాలు మారినా సంక్షేమ పథకాలు అమలవుతాయని చెప్పారు. స్కూళ్లలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. 

 అలాగే గవర్నమెంట్​హాస్పిటళ్లలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి నిధులు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్​కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అలాగే గృహజోతి పథకంలో భాగంగా ముషీరాబాద్ లో జీరో కరెంట్​బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గౌస్ ఉద్దీన్, సుప్రియతోపాటు అధికారులు పాల్గొన్నారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం

పద్మారావునగర్: అర్హులందరికీ త్వరలో ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సోమవారం బన్సీలాల్​పేట డివిజన్​గొల్ల కొమురయ్య కాలనీలో కొత్తగా నిర్మించిన అంగన్​వాడీ కేంద్రం బిల్డింగ్​ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక మహిళలతో మాట్లాడారు. మహాలక్ష్మి స్పీంపై స్పందనను అడిగి తెలుసుకున్నారు. పలువురు మహిళలు ఇండ్లు మంజూరు చేయాలని కోరగా, అర్హత ఉన్న ప్రతిఒక్క కుటుంబానికి త్వరలో ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం షెడ్యూల్డ్​కులాల హక్కుల పరిరక్షణ సంఘం 2024 -డైరీని మంత్రి ఆవిష్కరించారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, కార్పొరేటర్​హేమలత, జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వర్ రావు, సీడీపీఓ సునంద తదితరులు పాల్గొన్నారు. 

ప్రజారోగ్యమే ధ్యేయం
ప్రజారోగ్యమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నారాయణగూడ దత్త నగర్ లో ఏర్పాటు చేసిన బస్తీ  దవాఖానను మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఆమె ప్రారంభించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించద్దని సిబ్బందికి సూచించారు.