ఘనంగా బక్రీద్ పండగ.. మసీదుల్లో ముస్లింల ప్రార్ధనలు

ఘనంగా బక్రీద్ పండగ.. మసీదుల్లో ముస్లింల ప్రార్ధనలు

జూన్ 29వ తేదీ గురువారం ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు బక్రీద్(ఈద్-ఉల్-అధా) పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ముస్లిం సోదరులు మసీదులలో ప్రార్ధనలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. జగిత్యాల జిల్లాలోని ఈద్గాలో, ఖిల్లా, మసీదులలో బక్రీద్ సందర్భంగా ఈద్గాలో మతగురు మౌలానా ముస్తాక్ అహ్మద్ ఖస్మి ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నమాజ్ చేసి బక్రీద్ పండుగ రోజున ఏ జంతువును బలి ఇచ్చినా దాని మాంసాన్ని మూడు భాగాలుగా చేయాలి. ఈ 3 భాగాలలో కొంత భాగాన్ని పేదలకు పంచాలి. రెండవ భాగాన్ని బంధువులకు పంచి, మూడవ భాగాన్ని ఇంటివారు ఉపయోగించాలనే సంప్రదాయం ఉందని తెలిపారు. 

బక్రీద్ ముస్లిం సమాజం యొక్క పవిత్ర పండుగ, ఇబ్రహీం త్యాగం, అల్లాను విశ్వసించేవారి భక్తిని గుర్తుచేసే రోజు.. త్యాగానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని మతగురు వివరించారు. మరోవైపు బక్రీద్ సందర్భంగా కోరుట్లలోని అయ్యప్పగుట్ట దర్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా నియోజవర్గ ప్రజలందరికీ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.

బక్రీద్, ఈద్-అల్-అధా లేదా అరబిక్‌లో ఈద్ ఉల్ జుహా అని కూడా పిలుస్తారు, ఇది ముస్లింలలో ప్రముఖంగా జరుపుకునే "త్యాగాల పండుగ". జూన్ నెలాఖరున బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారు. ఇస్లాం మతాన్ని విశ్వసించే ప్రజల పండుగలలో బక్రీద్ ముఖ్యమైనది. త్యాగానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈద్ ఉల్ అధా (ఈద్ అల్-అధా లేదా బక్రీద్) అనేది ప్రవక్త ఇబ్రహీం అల్లాపై తనకున్న బలమైన విశ్వాసంతో చేసిన త్యాగానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే పండుగ ఇది