- కేంద్రం తీరుపై సస్పెండయిన ప్రతిపక్ష ఎంపీల ఫైర్
- మద్దతు తెలిపిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, సురేశ్ షెట్కార్
- ‘పీఎం ఈజ్ కాంప్రమైజ్డ్’ అని రాసి ఉన్న బ్యానర్‌తో
- పార్లమెంట్ మకర ద్వారం మెట్లపై బైటాయింపు
- మద్దతు తెలిపిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు
- మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, సురేశ్ షెట్కార్
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర సర్కారు పార్లమెంట్‌లో ప్రజాస్యామ్యం గొంతును నొక్కుతున్నదని సభ నుంచి రెండోరోజు సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎంపీలు మండిపడ్డారు. గురువారం పార్లమెంట్ ఆరంభానికి ముందు మకర ద్వారం మెట్లపై బైటాయించి నిరసన తెలిపారు. ‘పీఎం ఈజ్ కాంప్రమైజ్డ్’ అని రాసి ఉన్న భారీ బ్యానర్‌ను ప్రదర్శించారు. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణె పుస్తకంతోపాటు నరేంద్ర మోదీ ఫోటోను దానిపై ముద్రించారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో ఎంపీలు మాణికం ఠాగూర్, ప్రశాంత్ పడోలే, హిబి ఈడెన్, డీన్ కురియకోస్, ఎస్. వెంకటేశన్, గుర్జీత్ సింగ్ ఔజ్లా, అమరీందర్ సింగ్ రాజా వారింగ్ పాల్గొన్నారు. వీరికి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, సురేశ్ షెట్కార్, అనిల్ కుమార్ సంఘీభావం తెలిపారు. వారితోపాటు మకర ద్వారం మెట్లపై కూర్చొని ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రతిపక్ష నేత హక్కుల కోసంమా పోరాటం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హక్కుల కోసం తమ పార్టీ ఎంపీలంతా పోరాడుతున్నట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రధాని మోదీ సభ నుంచి పారిపోతున్నారని విమర్శించారు. ఒక పుస్తకాన్ని చేత బట్టుకొని మాట్లాడుతానంటే రాహుల్ గాంధీకి స్పీకర్ అవకాశం ఇవ్వడం లేదన్నారు. కానీ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూభే మూడు, నాలుగు పుస్తకాలు పట్టుకొని అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ (అసభ్యకరంగా) లో పూర్తి ప్రసంగం చేసినా అభ్యంతరం చెప్పడం లేదన్నారు. దేశ పార్లమెంట్ చరిత్రలో తొలిసారి లోక్‌సభ ప్రతిపక్ష నేత గొంతు నొక్కే అసాధారణ ఘటన జరిగిందని చెప్పారు. ఇదేం ప్రజాస్వామ్యం అని ఫైర్ అయ్యారు. పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ద్వంద వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
