- జేజేపీ, ఇండిపెండెట్ల సపోర్టుతో ఖట్టర్‌కు లైన్‌క్లియర్
- అమిత్ షాతో దుష్యంత్ భేటీ.. జేజేపీకి డిప్యూటీ సీఎం పోస్టు ఇస్తామన్న బీజేపీ చీఫ్
- దీపావళి తర్వాత కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
చండీగఢ్/న్యూఢిల్లీ: మహారాష్ట్రలో శివసేనతో కలిసి అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ హర్యానాలోనూ సర్కార్ ఏర్పాటుకు రెడీ అయింది. మ్యాజిక్ ఫిగర్‌కు ఆరు సీట్ల దూరంలో ఆగిపోయిన బీజేపీకి 10 మంది ఎమ్మెల్యేలున్న జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) మద్దతియ్యడంతో శుక్రవారం సీన్ ఒక్కసారిగా మారిపోయింది. జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా ఢిల్లీలో బీజేపీ చీఫ్ అమిత్ షాను కలిసి మద్దతిస్తామని చెప్పగా, ప్రతిగా జేజేపీకి డిప్యూటీ సీఎం పోస్టు ఇస్తామని షా ప్రకటించారు.
జేజేపీ కంటే ముందే ఆరుగురు ఇండిపెండెట్లు, హర్యానా లోక్‌హిత్ పార్టీ(హెచ్ఎల్పీ) ఎమ్మెల్యే గోపాల్ కందా కూడా బీజేపీకి బేషరతుగా మద్దతిస్తామని ప్రకటించారు. నాన్ బీజేపీ ఎమ్మెల్యేల సపోర్టుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ముందే ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టకముందే బీజేపీ చకచకా పావులు కదిపింది. ఢిల్లీలో మకాం వేసిన హర్యానా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో శుక్రవారం ఉదయం సీఎం ఖట్టర్ మంతనాలు జరిపారు. ఎనిమిది మంది ఇండిపెంట్లలో ఆరుగురు బీజేపీ రెబల్సే కావడం, మిగతా ఇద్దరికీ ఆర్ఎస్ఎస్తో బలమైన అనుబంధం ఉండటంతో చర్చల ప్రక్రియ ఈజీగా సాగినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఆ వెంటనే ఖట్టర్ ఒకరిద్దరు ఎమ్మెల్యేల్ని వెంటతీసుకుని బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కూడా కలిశారు.
ఇవాళ గవర్నర్‌ను కలవనున్న ఖట్టర్
చండీగఢ్‌లో శనివారం ఉదయం 11 గంటలకు హర్యానా బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ భేటీ కానుంది. 40 మంది ఎమ్మెల్యేలు ఖట్టర్‌ను నేతగా ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి హైకమాండ్ పరిశీలకులుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ హాజరుకానున్నారు. శుక్రవారంనాడే గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాల్సిందిగా కోరతానని సీఎం ఖట్టర్ వెల్లడించారు. జేజేపీ సపోర్టుతో ఏర్పడనున్న బీజేపీ కొత్త సర్కారు దీపావళి తర్వాత కొలువుదీరుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
కందా సపోర్ట్ తీసుకోవద్దు
వివాదాస్పద నేతగా పేరున్న గోపాల్ కందా సపోర్టు తీసుకోవడంపై బీజేపీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఎయిర్‌హోస్టెస్ గీతికా శర్మ మృతి కేసులో కందాపై తీవ్రస్థాయి ఆరోపణలుండటమే ఇందుకు కారణం. ఎండీఆర్ఎల్ అనే ఏవియేషన్ కంపెనీ ఓనరైన కందా గతంలో భూపిందర్ హుడా(కాంగ్రెస్) కేబినెట్లో మంత్రిగానూ పనిచేశారు. ఎయిర్‌హోస్టెస్ గీతికను కందానే రేప్‌చేసి చంపేశారనే ఆరోపణలు రావడంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. తర్వాతికాలంలో ఆయన బీజేపీకి దగ్గరయ్యారు. హర్యానాలో సర్కార్ ఏర్పాటుకు కందా సపోర్ట్ తీసుకోవద్దని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి సొంత పార్టీ నేతల్ని తీవ్రంగా హెచ్చరించారు. అధికారం కోసం నైతిక విలువల పునాదుల్ని మరిచిపోవద్దని, మంచివాళ్లను మాత్రమే కలుపుకొని వెళ్లాలని సూచించారు. ‘‘గోపాల్ కందా వల్ల ఓ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఆ తర్వాత ఆమె తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆ కుటుంబానికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. కందా నేరస్తుడా, అమాయకుడా అనేది సాక్ష్యాల ఆధారంగా కోర్టు నిర్ణయిస్తుంది. ఒక నిందితుడు ఎన్నికల్లో గెలవడానికి ఎన్నో కారణాలుండొచ్చు, అంతమాత్రాన ఆ వ్యక్తి నిర్దోషి అయినట్లుకాదు”అని ఉమాభారతి శుక్రవారం ఘాటుగా ట్వీట్ చేశారు.
సోనియా మీటింగ్ పెట్టినా..
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెర్ఫామెన్స్‌పై పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ శుక్రవారం ముఖ్యనేతలతో సమావేశం నిర్వహిస్తారని ఏఐసీసీ వర్గాలు ముందే ప్రకటించాయి. ఈ భేటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ఆజాద్, కేసీ వేణుగోపాల్, అంబికా సోని, జ్యోతిరాదిత్య, ఏకే ఆంటోనీ తదితర నేతలు హాజరయ్యారు. మీటింగ్ వివరాలను మీడియాకు వెల్లడించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా హర్యానా అంశంపై దాటవేతధోరణి ప్రదర్శించారు. సోనియా మీటింగ్‌లో కేంద్ర సర్కార్ విధానాలపైనే ఎక్కువ చర్చ జరిగిందని, చైనాతో కలిసి ‘సమగ్ర ప్రాంతీయ ఆర్థిక భాగస్వామ్యం (ఆర్సీఈపీ)’లో చేరాలన్న మోడీ నిర్ణయం దేశ రైతులపై పెను ప్రభావం చూపుతుందని, ఆర్సీఈపీకి వ్యతిరేకంగా పోరాడాలని సోనియా నిర్దేశించినట్లు సుర్జేవాలా వెల్లడించారు.
కీలక పాత్ర పోషిస్తాం: దుష్యంత్

శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలో జరిగిన జేజేపీ లెజిస్లేటివ్ మీటింగ్‌లో ఎమ్మెల్యేలు దుష్యంత్ చౌతాలాను నేతగా ఎన్నుకున్నారు. మీటింగ్‌కు ముందు దుష్యంత్ తీహార్ జైల్లో ఉన్న తండ్రి అజయ్ చౌతాలను కలుసుకున్నారు. రాత్రి ఎనిమిది గంటల తర్వాత కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బీజేపీ దూతగా దుష్యంత్‌తో చర్చలు జరిపారు. అక్కణ్నుంచి ఇద్దరు నేతలు నేరుగా అమిత్ షా ఇంటికి వెళ్లారు. అప్పటికే అక్కడికి హర్యానా సీఎం ఖట్టర్, ఇతర ముఖ్యనేతలు చేరుకున్నారు. పదవుల పంపకంపై డీల్ కుదిరిన తర్వాత నేతలందరూ జాయింట్‌గా మీడియాతో మాట్లాడారు. హర్యానా ప్రజలిచ్చిన తీర్పుకు అనుగుణంగా రెండు పార్టీల నేతలు నేతలు జరిపిన చర్చలు సక్సెస్ అయ్యాయని, సీఎం పోస్టు బీజేపీ, డిప్యూటీ సీఎం పోస్టు జేజేపీ చేపడతాయని అమిత్ షా ప్రకటించారు. డిప్యూటీతో పాటు మరో రెండు మంత్రి పదువులు ఇచ్చేందుకూ బీజేపీ హైకమాండ్ ఓకే చెప్పినట్లు తెలిసింది. హర్యానాలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలన్న ఉద్దేశంతోనే బీజేపీతో చేతులుకలిపానని దుష్యంత్ చెప్పారు. బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా అవకాశం కల్పంచినందుకు అమిత్ షా, నడ్డాలకు థ్యాంక్స్ చెప్పారు. తాము కీలక పాత్ర పోషిస్తామని చెప్పారు. దుష్యంత్ తాత ఓం ప్రకాశ్ చౌతాలా, తండ్రి అజయ్ చౌతాలా అవినీతి కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న నేపథ్యంలో ఆయన బీజేపీ దగ్గరకావడం కొత్తచర్చకు తెరలేపింది.

