V6 News

'ఓ.. దేవుడా, ఏమవుతోంది...': గాలిలో 4 గంటలు చక్కర్లు కొట్టిన విమానం.. అసలేం జరిగిందంటే?

'ఓ.. దేవుడా, ఏమవుతోంది...': గాలిలో 4 గంటలు చక్కర్లు కొట్టిన విమానం.. అసలేం జరిగిందంటే?

హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఫ్లై91 (Fly91) విమానంలో ప్రయాణికులు ప్రాణభయాన్ని ఎదురుకొన్నారు. సాంకేతిక లోపం కారణంగా గంటల తరబడి గాలిలోనే విమానం చక్కర్లు కొట్టడంతో లోపల ఉన్నవారు భయంతో వణికిపోయారు. 

వివరాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఫ్లై91 విమానం (IC3401) హుబ్బళ్లికి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం  సాయంత్రం 4:30 గంటలకు హుబ్బళ్లి చేరుకోవాలి. కానీ ల్యాండింగ్ సమయంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.

4 గంటల పాటు గాలిలోనే..
హుబ్బళ్లిలో ల్యాండ్ అవ్వడానికి అవకాశం లేకపోవడంతో, విమానాన్ని సురక్షితంగా దించేందుకు పైలట్లు ప్రయత్నించారు. ఈ క్రమంలో దావణగెరె, శివమొగ్గ వంటి ప్రాంతాల పైన విమానం దాదాపు నాలుగు గంటల పాటు గాలిలోనే తిరగాల్సి వచ్చింది. చివరకు రాత్రి 7:30 గంటలకు బెంగళూరు విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

విమానంలో భయానక వాతావరణం:
గాలిలో విమానం చక్కర్లు కొడుతున్న సమయంలో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లోని దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. కొందరు ప్రయాణికులు భయంతో ఏడుస్తూ, దేవుడిని ప్రార్థిస్తూ కనిపించారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు విమానం లోపల వచ్చే కుదుపులకు తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చారు.

"ఓ దేవుడా... ఏమవుతోంది" అనే అరుపులు విమానంలో వినిపిస్తుండగా... ఓ ప్రయాణికురాలు భయంతో కన్నీళ్లు పెట్టుకోగా, తోటి ప్రయాణికులు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.

సాంకేతిక సమస్య ఉన్నప్పటికీ, పైలట్లు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని బెంగళూరుకు మళ్లించి సురక్షితంగా దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏది ఏమైనా, గంటల తరబడి మృత్యువు అంచున ఉన్నట్లుగా ప్రయాణికులు అనుభవించిన ఆ వేదన మాటల్లో చెప్పులేనిది.