V6 News

జమ్మూ కాశ్మీర్ లో ఘోర ప్రమాదం... లోయలో పడ్డ బస్సు..16 మంది మృతి...

జమ్మూ కాశ్మీర్ లో ఘోర ప్రమాదం... లోయలో పడ్డ బస్సు..16 మంది మృతి...

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడిన ఘటనలో 16 మంది మృతి చెందగా... 19 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. సోమవారం ( ఏప్రిల్ 20 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో ప్రయాణికులతో వెళుతున్న బస్సు కొండపై నుంచి లోయలో పడటంతో 16 మంది మృతి చెందగా, మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు.

రామ్ నగర్ ప్రాంతంలోని కాగోర్ట్ గ్రామం దగ్గర ఉదయం 10 గంటల సమయంలో జరిగింది ఈ ప్రమాదం. బస్సు మలుపు దగ్గర అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి క్షతగాత్రులను బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు.

బస్సు శిథిలాల కింద మొత్తం 15 మృతదేహాలను వెలికితీశామని, 20 మంది గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని, వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు పోలీసులు. బస్సు రాంనగర్ నుండి ఉదంపూర్ వెళ్తుండగా కానోటే గ్రామం దగ్గర ప్రమాదం జరిగిందని తెలిపారు పోలీసులు.

సమాచారం అందించిన వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టామని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు పోలీసులు. ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని భావిస్తున్నారు.