యాదగిరిగుట్ట, వెలుగు: రైతు నుంచి రూ.35 వేలు లంచం తీసుకుంటూ యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ విద్యుత్ అసిస్టెంట్ లైన్ మెన్(ఏఎల్ఎం) రమేశ్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూర్ మండలం మేడికుంటపల్లి గ్రామానికి చెందిన అనంతరెడ్డి అనే రైతు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం మూడు నెలల కింద రూ.30 వేలు డీడీ రూపంలో చెల్లించాడు.
ట్రాన్స్ఫార్మర్ బిగించేందుకు ఏఎల్ఎం పప్పుల రమేశ్ రూ.35 వేలు డిమాండ్ చేశాడు. సదరు రైతు రూ.10 వేలు ఇవ్వడానికి అంగీకరించగా, రూ.35 వేలు కావాల్సిందేనంటూ మూడు నెలలుగా ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో విసుగు చెందిన అనంతరెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు.
వారి సూచనల మేరకు రూ.35 వేలు లంచం ఇవ్వగా, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏఎల్ఎం రమేశ్ ను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరిచి జుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
