రథయాత్రలో కరెంట్ వైర్లు తగిలి 11 మంది చనిపోయిన్రు

రథయాత్రలో కరెంట్ వైర్లు తగిలి 11 మంది చనిపోయిన్రు

రథయాత్రలో కరెంట్ వైర్లు తగిలి 11 మంది చనిపోయిన్రు
మృతుల్లో ముగ్గురు టీనేజర్లు..  17 మందికి గాయాలు
రథాన్ని మలుపుతుండగా తీగలకు తగిలి ప్రమాదం 
తమిళనాడులోని తంజావూరులో ఘటన
రాష్ట్రపతి, ప్రధాని, సీఎం స్టాలిన్ విచారం

తంజావూరు : తమిళనాడులో దారుణం జరిగింది. ఆలయ రథోత్సవంలో కరెంట్ షాక్ తగిలింది. రథం కరెంట్ తీగలకు తగలడంతో షాక్ కొట్టి 11 మంది భక్తులు చనిపోయారు. వీరిలో 8 మంది మగవాళ్లు, ముగ్గురు టీనేజ్ బాయ్స్ ఉన్నారు. మరో 17 మందికి గాయాలయ్యాయి. తంజావూరు జిల్లాలోని కలిమెడులో మంగళవారం అర్ధరాత్రి అప్పర్ స్వామి రథయాత్ర మొదలైంది. భక్తులు స్వామి వారిని రథంలో ఉంచి ఊరేగించారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల వరకు ఊర్లోని వాడలన్నీ తిరగడం పూర్తయింది. ఇక రథాన్ని తిరిగి ఆలయానికి తీసుకెళ్దామని భక్తులు నిర్ణయించుకున్నారు. తంజావూరు–బుద్ధలూర్ రోడ్డులో రథాన్ని మలుపుతుండగా పైనున్న హైటెన్షన్ వైర్లకు తగిలింది. దీంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి రథం పైనున్న, దాన్ని పట్టుకున్నోళ్లు అందరూ కిందపడిపోయారు. షాక్ ధాటికి స్పాట్ లోనే 10 మంది చనిపోయారు. ఆస్పత్రిటో ట్రీట్ మెంట్ పొందుతూ మరొకరు మృతి చెందారు. కరెంట్ షాక్ తో అగ్నిప్రమాదం జరిగి రథం మొత్తం కాలిపోయింది. ప్రమాదం జరిగిన టైమ్ లో దాదాపు 50 మంది ఉన్నారని, ముగ్గురికి మంటలు అంటుకున్నాయని ప్రత్యక్ష సాక్షి ఎస్.రాజా చెప్పారు. దాదాపు 10 నిమిషాల వరకు తామేం చేయలేకపోయామని, ఆ తర్వాత కరెంట్ సప్లై ఆపేసి.. బాధితులను ఆస్పత్రికి తరలించామని తెలిపారు. 

రోడ్డు ఎత్తును గుర్తించక ప్రమాదం...

ఎన్నో ఏండ్లుగా రథోత్సవం నిర్వహిస్తున్నామని, కానీ ఇలాంటి ప్రమాదం ఎప్పుడూ జరగలేదని గ్రామస్తుడు విజయన్ చెప్పారు. ఇటీవల రోడ్డు పనులు చేశారని, అప్పుడు రోడ్డు ఎత్తు ఒక్క ఫీటు వరకు పెరిగిందని తెలిపారు. అయితే రథం లాగినోళ్లు అది గుర్తించలేదని, దీంతో రథం కరెంట్ తీగలకు తగిలిందని పేర్కొన్నారు. 

బాధిత కుటుంబాలను కలిసిన స్టాలిన్... 
ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. చనిపోయినోళ్ల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినోళ్లకు రూ.50 వేల చొప్పున మోడీ పరిహారం ప్రకటించారు. కాగా, బాధిత కుటుంబాలను సీఎం స్టాలిన్ కలిసి ఓదార్చారు. ఆయన అంతకుముందు అసెంబ్లీలో మాట్లాడుతూ చనిపోయినోళ్ల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.