సీఎంతో ఉద్యోగుల జేఏసీ భేటీ..పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని వినతి

సీఎంతో ఉద్యోగుల జేఏసీ భేటీ..పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని వినతి
  • అసెంబ్లీ ముగిశాక చర్చలకు పిలుస్తానని సీఎం హామీ

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని గురువారం అసెంబ్లీలో ఉద్యోగుల జేఏసీ నేతలు కలిశారు. జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావుతో పాటు నేతలు శ్యామ్, ముజీబ్, సదానందం గౌడ్, చావా రవి సీఎంతో సుమారు 45 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలయిన పీఆర్సీ, డీఏ, ఈహెచ్ ఎస్ అమలు, సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల వంటి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీపీఎస్ రద్దుపై కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ప్రస్తుతం రూ. 2 వేల కోట్లు ఇస్తున్నారని, ఆ మొత్తాన్ని పెంచాలని సీఎంను కోరారు.

అయితే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే డిసెంబర్ లోగా పీఆర్సీ ఇస్తామని, దసరాలోగా రెండు డీఏలు ఇస్తామని సీఎం తెలిపారని ఉద్యోగుల జేఏసీ నేతలు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత జేఏసీ నేతలను చర్చలకు పిలుస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ఈ ఫైనాన్సియల్ ఇయర్​ముగిసేనాటికి ఆర్ధిక భారం ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని జేఏసీ నేతలు తెలిపారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ  మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పాల్గొన్నారు. 

స్పీకర్ తో  జేఏసీ నేతల భేటీ

ఉద్యోగుల జేఏసీ నేతలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో సమావేశం అయ్యారు. అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్ లో ఈ మీటింగ్ జరిగింది. పీఆర్సీ, డీఏలతో పాటు పలు సమస్యలపై వారు స్పీకర్​తో చర్చించారు.  సమస్యలు పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలని స్పీకర్ ను కోరారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పీకర్ ప్రసాద్ కుమార్ హామీ ఇచ్చారని వారు తెలిపారు.