‘కొడంగల్-–నారాయణపేట’కు పర్యావరణ అనుమతులు

‘కొడంగల్-–నారాయణపేట’కు పర్యావరణ అనుమతులు
  • ప్రాజెక్టు పూర్తయితే లక్ష ఎకరాలకు సాగు నీరు

హైదరాబాద్, వెలుగు: కొడంగల్–నారాయణపేట లింక్ ప్రాజెక్టుకు కేంద్రం పర్యావరణ అనుమతులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెల 13న దరఖాస్తు చేయగా.. 27న జరిగిన మీటింగ్​లో అప్లికేషన్​ను స్టేట్ లెవెల్​ఎన్విరాన్మెంట్​ఇంపాక్ట్ అసెస్​మెంట్ అథారిటీ (ఎస్ఈఐఏఏ) పరిశీలించింది. 29న పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. కాగా, నారాయణపేట, మక్తల్, కొడంగల్​నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగు నీరిచ్చేలా 4 టీఎంసీలను ఎత్తిపోసేందుకు రాష్ట్ర సర్కారు ఈ ప్రాజెక్టును చేపడుతోంది. 

3 దశల్లో నీటిని రాజీవ్​భీమాఎత్తిపోతల పథకం నుంచి ఎత్తిపోయనున్నారు. మొదటి దశలో భూత్పూర్ రిజర్వాయర్​నుంచి వూట్కూర్ చెరువుకు, రెండో దశలో వూట్కూర్​చెరువు నుంచి జయమ్మ చెరువుకు, మూడో దశలో జయమ్మ చెరువు నుంచి కనకుర్తి చెరువుకు నీటిని ఎత్తిపోస్తారు. 

ఇందులో భాగంగా కనకుర్తి చెరువు నుంచి దౌల్తాబాద్​చెరువుకు 17.675 కిలోమీటర్ల పొడవైన గ్రావిటీ కాల్వ ద్వారా నీటిని తరలించనున్నారు. దీంతోపాటు మధ్యలో వచ్చే లక్ష్మీపూర్, ఈర్లపల్లి చెరువులనూ నింపనున్నారు. ఇక, దౌల్తాబాద్ చెరువు నుంచి బొంరాస్​పేట చెరువుకు 31.568 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ ద్వారా నీటిని తరలిస్తారు. హుస్నాబాద్​, కొడంగల్​చెరువులనూ నింపుతారు.